కుంభకోణం యాత్ర - 28
కుంభకోణం యాత్ర - 28
కరుంబైరం వినాయగర్
ఈ పూటతో మన ట్రిప్ పూర్తవుతుంది. ఇవాళ మిగిలిన ఆలయాలలో మనం చూడగలిగినన్ని చూసేద్దాం. దానికే ఆటో మాట్లాడేను. పదండి. ముందుగా వినాయకుడి గుడి. ఈ యాత్రలో అనేక ఆలయాలలో వినాయకుణ్ణి దర్శించుకున్నాంగానీ ప్రత్యేకించి వినాయకుడి ఆలయం చూడలేదుకదా. ఇప్పుడు వినాయకుడు ప్రధాన దేవతగా వున్న కరుంబైరం వినాయగర్ ఆలయానికి వెళ్దాము. ఇది చాలా దగ్గర. కుంభకోణం ఊళ్ళోనే వున్నది.
ఇదిగో ఇదే. ఆలయం కూడా చిన్నదే. వినాయకుడు చూశారా! ఎంత అందంగా వున్నాడో ఈ వినాయకుడి గురించి ఒక కధ వున్నది. ఈయన ఎప్పుడు ఇక్కడ వెలిశాడో, ఎందుకు వెలిశాడో తెలియదుగానీ తర్వాత ఈ స్వామి మహిమని చాటే కధ ఒకటి రకరకాలుగా చెప్పుకుంటారు. ఇంతకీ ఆ కధ ఏమిటంటే...
ఒకసారి ఒక చెరుకు వ్యాపారి ఎడ్లబండిలో చెరుకుతో ఈ దోవగుండా వెళ్తున్నాడు. ఈ ప్రాంతానికి వచ్చేసరికి చీకటి పడటంతో ఇక్కడ ఆగి ఎడ్లని విశ్రాంతికి విడిచాడు. తనుకూడా ఈ వినాయకుడి గుడిలో విశ్రాంతి తీసుకున్నాడు. వినాయకుడు చిన్న బాలుడి రూపంలో ఆ వ్యాపారి దగ్గరకు వచ్చి తనకి ఒక చెరుకుగడ ఇమ్మని అడిగాడు. వ్యాపారి చాలా పిసినారి. ఆయన బాలుడికి చెరుకుగడ ఉచితంగా ఇవ్వటం ఇష్టంలేక పోయింది. అందుకే ఇవ్వలేదు.
వ్యాపారి మర్నాడు లేచి చూసేసరికి ఏముంది అక్కడ అంతా చెరుకు పిప్పి. ఆయన బండిలో చెరుకు లేదు. అదంతా సారంలేని పిప్పయి అక్కడంతా పడి వున్నది. అది చూసిన వ్యాపారికి నిన్న తనని చెరుకుగడ అడిగిన బాలుడు సామాన్యుడు కాదు, సాక్షాత్తూ వినాయకుడే అని స్ఫురించి వెంటనే వినాయకుడి దగ్గరకి వెళ్ళి, చిన్న బాలుడిగా అడిగినప్పుడు ఒక్క చెరుకుగడ ఇవ్వనందుకు తనకి తగిన శాస్తి జరిగిందనీ, తన అపరాధాన్ని క్షమించమని, ఆ వినాయకుడికి వెయ్యి చెరుకుగడలు సమర్పించుకుంటాననీ ప్రార్ధించాడు. కరుణామయుడు విఘ్నేశ్వరుడు కరుగకుండా వుంటాడా!? ఆయనా వ్యాపారిని కరుణించాడు. వ్యాపారీ తన మొక్కును భక్తి శ్రధ్ధలతో తీర్చాడు. అప్పటినుంచీ ఈ వినాయకుడిని కరుబైరం వినాయకుడు అంటారు.
ఈ కధనే ఇంకో రకంగా కూడా చెబుతారు. వర్తకుడు ఈ మార్గానే వెళ్తూ అలసిపోయి ఆలయ పుష్కరిణి దగ్గర ఆగి ముఖం కడుక్కుని తిరిగి ప్రయాణం సాగించాడు. వినాయకుడు చిన్న పిల్లాడిలా ఆ వ్యాపారి వెనుకపడి చెరుకు గడ కోసం అడిగాడు. ఎంత అడిగినా ఆ వ్యాపారి ఇవ్వలేదు. దోవన పోయే వాళ్ళుకూడా, చిన్న పిల్లాడు, బొద్దుగా వినాయకుడులా వున్నాడు, ఒక గడ ఇచ్చినంత మాత్రాన నీకే నష్టం రాదు అని చెప్పినా, నా చెరకు గడ్డిలా వుంది, అంత రసం లేదు, మిల్లులో తీస్తేగానీ రసం రాదు అని చెప్పి వెళ్లిపోయాడుట. అప్పుడు ఆ పిల్లాడు వ్యాపారి అబధ్ధం చెబుతున్నాడని చెప్పి, ఆ చెరుకు అలాగే వుంటుంది అని అన్నాడుట.
ఆ వర్తకుడు మిల్లు దగ్గరకెళ్ళి అక్కడివారికి చెరుకు మిల్లులో వెయ్యమంటే అక్కడివారు నవ్వారుట. రసం లేని ఆ గడ్డిని మిల్లు పట్టటం వల్ల ఉపయోగం ఏమిటని. వర్తకుడు దిగులుతో ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. నిద్రలో వినాయకుడు కలలో కనిపించి అతను అబధ్ధం చెప్పినందుకు తగిన శాస్తి అనుభవించాడని చెప్పాడుట. వ్యాపారి మర్నాడు వినాయకుడి గుడికి వెళ్ళి తన అపరాధాన్ని క్షమించమని వేడుకున్నాడుట. దయగల స్వామి ఆ చెరుకును తిరిగి మామూలు చెరుకుగా మార్చాడుట. అప్పటినుంచీ ఈయనని కరుబైరమ్ పిళ్ళయార్ అంటారు. కరుంబు అంటే తమిళంలో చెరుకు. పిళ్ళయార్ అంటే మీకు తెలుసుకదా, వినాయకుడు.
ఈ కధ జరిగి వెయ్యి ఏళ్ళు అయిందిట. మరి అంతకుముందునుంచే వినాయకుడు ఇక్కడ కొలువు తీరి వున్నాడు. కుంభకోణంలో ఈ వినాయకుడిది మొదటి ఆలయం అంటారు. దీనికి సంబంధించి కధ ఏమిటంటే హిరణ్యాక్షుడు భూదేవిని చెరబట్టి సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడుకదా. అప్పడు భూదేవిని రక్షించటానికి శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తినప్పుడు, తన కార్యం నిర్విఘ్నంగా సాగాలని ఈ ప్రదేశంలో వినాయకుణ్ణి ప్రార్ధించాడుట. వినాయకుడు శ్రీమహావిష్ణువుకి సహాయం చేశాడుగనుక ఈ వినాయకుణ్ణి వరాహ వినాయకుడు అని, ఈ ప్రాంతాన్ని వరాహపురి అనేవారు. అన్నట్లు ఈ వినాయకుడి ఆలయం వరాహస్వామి ఆలయానికి సమీపంలోనే వున్నది. ఈ చెరుకుగడల సంఘటన తర్వాత ఆయన పేరు ఇలా మారింది.
ఈ వినాయకుణ్ణి పూజించినవారి కోరికలన్నీ తీరుతాయనీ, భక్తుల జీవితాలని చెరకు అంత తీపిగా, అంటే, సుఖమయంగా చేస్తాడని భక్తులకి గట్టి నమ్మకం. భక్తులు ఈయనకి, కొబ్బరికాయలతోబాటు చెరకు గడలు కూడా సమర్పిస్తారు. గరికతో చేసిన మాలలు వేస్తారు.
దర్శన సమయాలు
ఉదయం 5 గం. ల నుంచీ 10 గం. ల దాకా, తిరిగి సాయంత్రం 3 గం. ల నుంచీ 7 గం. ల దాకా.
పదండి పదండి. మనం వేరే ఆలయానికి వెళ్ళాలి.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)