కుంభకోణం యాత్ర – 29

 

కుంభకోణం యాత్ర – 29
సుందరేశ్వరస్వామి ఆలయం, పెట్టి కాళి అమ్మ, తిరుపడలవనం

 


                                                                                     

ఇప్పుడు మనం ఇక్కడికి 3 కి.మీ. ల దూరంలో వున్న కురుపం వెళ్తున్నాము.  ముందు దూరంవి చూసుకుని వస్తే, ఊళ్ళోవి కొంచెం ఆలస్యమయినా పర్వాలేదు.  ఈ ఆలయం గురించి నాకు తెలిసింది చెబుతాను.

 

పూర్వం బ్రహ్మదేవుడు ఒక కీకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్టించి రోజూ ఆయనని అర్చించేవాడు.  ఆ వనం పత్రి (తమిళం) వనం.  అందుకే ఆ ప్రాంతానికి పడలవనం అని పేరు వచ్చింది.  శివుడు ఇక్కడ బ్రహ్మదేవుడికి జ్ఞానోపదేశం చేశాడుట. దేవతలందరూ ఈయనని సుందరుడు, లోక సుందరుడు అని కొనియాడారుట.  అందుకని స్వామి పేరు సుందరేశ్వరుడు అయింది.  సుందరమూర్తి నాయనార్ ఈయనని తన గీతాలతో అర్చించాడు.  అగస్త్యుడు, వక్కిలియార్, కణ్వుడు మొదలగు ఋషులు ఈ స్వామిని కొలిచారు.  ఇంద్రుడు పౌర్ణమి రోజున తన ఐరావతంమీద వచ్చి ఇక్కడ శివుణ్ణి పూజించాడు.  

 

అమ్మవారు

 

 

అమ్మవారు అభిరామి  దక్షిణ ముఖంగా వుంటుంది.  నాలుగు చేతులతో దర్శనమిచ్చే ఈ తల్లి కుడివైపు పై చేతిలో జపమాల, ఎడమవైపు పై చేతిలో తామర పుష్పం ధరించింది.  కింద చేతులు అభయ, వరద ముద్రలతో భక్తులకు అభయ ప్రదానం గావిస్తూ వుంటాయి.

 

ఆలయ నిర్మాణం

 


ఆలయం పురాతన రాతి కట్టడం.  చోళుల సమయంలో నిర్మింపబడింది.  కుళోత్తుంగ చోళుడు-3 (క్రీ.శ. 1186 – 1216) పునర్నిర్మాణం గావించాడు.  ఐదు అంతస్తుల రాజ గోపురం తూర్పు ముఖంగా, వివిధ శిల్పాలతో శోభిల్లుతూ వుంటుంది. ఆలయం వచ్చేసింది.  దిగండి.  జనం చాలామందే వున్నారు.  అందరూ ప్రసాదాలు తీసుకు వెళ్ళటమో, తినటమో చేస్తున్నారు.  అంటే ఇప్పుడే ఏదో పూజ అయ్యుంటుంది.  మనల్ని చూసి అంతా అలా చూస్తున్నారేమిటి?   ఆయన దర్శనం సమయం అయిపోయిందంటాడేమిటి?  ఇప్పుడింకా సాయంకాలం 6 గం. లు కూడా కాలేదు.  అప్పుడే దర్ళనం అవటమేమిటి!?  నేను ఈ గుడికి ఇంతకు ముందు రాలేదు.  అందుకనే అంతా కొత్తగా వున్నది. ఆయన్నడుగుదాము. మేము చాలా దూరంనుంచి వచ్చాము, మళ్ళీ ఇప్పుడప్పుడే రాలేక పోవచ్చు.  స్వామిని దర్శించుకుంటే మాకు తృప్తిగా వుంటుంది అన్నాను.  అటు రమ్మంటున్నాడు.  సరే వెళ్దాం పదండి.

 

అక్కడ లోపల శివుడు వున్నాడు.  ఆలయం తెరిచే వుంది కదా.  మరి సమయం అయిపోయిందన్నాడేమిటి?  అదిగో  ఆయనే గట్టిగా పిలుస్తున్నాడు..అటునుంచి రమ్మంటున్నాడు.  ఏమిటో ఆయన భాష మనకర్ధంకాదు.  ఈయన కూడా చెబుతున్నాడు .. శ్రీఘ్రం పో .. అని.  ఏమిటో వెళ్ళి చూద్దాము.  ఎంత పెద్ద పెట్టో.  పూర్వం ఇళ్ళల్లో భోషాణాలని వుండేవి ఇలాగే.  ఆ పెట్టె చూపిస్తాడేమిటి?  అందులో ఏముంది?  పెట్టె మూత తీసి చూడమని చెప్పాడు.  ఏముంది?   అబ్బో!!  ఎంత అందమైన అమ్మవారు!  ఎఱ్ఱని ముఖం, నొసటన విభూది, తిలకం, నోట్లో రెండు కోరలు, ఎనిమిది చేతులు .. కుడివైపు చేతులలో శూలం, డమరుకం, కొక్కెంలాంటిది, చిలుక వున్నాయి.  ఎడమ చేతిలో పాశం, డాలు, గంట, పుఱ్ఱె వున్నాయి.  అయినా ఎంత అందంగా వున్నది!!  ఎవరన్నా గ్రామ దేవత ఏమో!  మనం చూడగానే పెట్టె మూసేశారు.  ఆ పెట్టె మూసే సమయం తర్వాత వచ్చామనేనేమో మనల్ని అలా చూశారు, అంత హడావిడి పెట్టారు.

 

లోపలకెళ్ళి శివుణ్ణి, అమ్మవారిని  దర్శించుకొచ్చి ఇక్కడ కూర్చుందాము.  ఆ అబ్బాయి ఎవరో మనల్ని కొత్తవాళ్ళమని ఆసక్తిగా చూస్తున్నాడు.  అతన్ని అడుగుదాం ఈ అమ్మవారి విశేషం ఏమిటో. 

 

చెబుతున్నాడు వినండి.  ఆవిడని పెట్టి కాళి అమ్మన్, సుందర మహా కాళి అమ్మన్ అంటారుట.  ఆవిడ మూర్తి అలాగే పెట్టేతో సహా కావేరి నదిలో కొట్టుకుని ఇక్కడ ఒడ్డుకు చేరిందట.  దానిని చూసినవారు ముందర ఒక తడికల షెడ్డులాగా వేసి అక్కడ వుంచి పూజలు చేశారుట.  తర్వాత ఈ ఆలయానికి తరలించి, ఆలయంలో వుంచారుట.  జనశృతి ప్రకారం రాజా విక్రమాదిత్యుని  చివరి రోజులలో ఉజ్జయిని కాళి రెండుగా విరిగిందిట.  వాటిని పెట్టెలో పెట్టి నదిలో వదిలారుట.  ఆ పెట్టె ఇక్కడ ఒడ్డుకు చేరింది.  ఆ పెట్టె చూసిన వారికెవరికీ దానిని తెరిచే ధైర్యం లేకపోయిందట.  ఒక చిన్న పాప తెరిచింది అంటారు.  ఆలయంలో పెట్టిన తర్వాత కూడా అమ్మవారి అనుమతి తీసుకునే ఆ పెట్టె తెరిచి ఆవిడకి పూజ చేస్తారుట.  పెట్టె తెరవటానికి ముందు ప్రత్యేక పూజలు చేస్తారుట.  ఆ పెట్టె తెరిచినప్పుడు భక్తులు అమ్మవారికి పూజలు చేస్తారు, దర్శనం చేసుకుంటారు.  మిగతా సమయంలో ఈ కాళీ దర్శనం వుండదు.  అబ్బ .. మనమెంత అదృష్టవంతులమో కదా  ..  పెట్టె అప్పుడే మూయటం వల్ల మనల్ని పిలిచి దర్శనం చేయించారు.  లేకపోతే తర్వాత చాలా బాధ పడేవాళ్ళం,  సమయానికి ఇక్కడిదాకా వచ్చీ చూడలేకపోయామని.

 

ఆ అబ్బాయి ఇంకా ఏదో చెబుతున్నాడు, విందాము.

 

ఇదివరకు ఏడాదికి ఒకసారి ఈ పెట్టె తీసేవాళ్ళట.  చాలా పెద్ద ఉత్సవాలు జరుగుతాయట అప్పుడు.  గ్రామస్తులంతా అమ్మవారిని పల్లకీలో ఊరేగించి, గ్రామీణుల వాయిద్యాలతో పెద్ద సంబరం చేస్తారుట.  అయితే ఈ మధ్య వారానికి మూడు సార్లు పెట్టె తీసి అమ్మవారి దర్శనం చేయిస్తున్నారుట.  ఆ రోజులు ...

 

మంగళవారం   మధ్యాహ్నం 3-30కి
శుక్రవారం       మధ్యాహ్నం 12 గం. లకి
ఆదివారం        సాయంత్రం 4-30 కి.
పెట్టె తెరిచాక గంటా, గంటన్నర మాత్రమే అట్టి పెడతారు.  

 

ఆవిడ అడుగుతోంది ఎక్కడనుంచి వచ్చారు వగైరా వివరాలన్నీ.  ప్రసాదం తెచ్చిస్తానుండమని చెప్పింది ఆగండి.  అదిగో మనకి దర్శనమే కాదు, ప్రసాదం ప్రాప్తి కూడా వున్నది.  ధన్యవాదాలమ్మా.  ఈ ఆలయం గురించి ముందు తెలియక పోయినా, ఇక్కడికి వచ్చి హడావిడిగానైనా దర్శనం, ప్రసాదం అన్నీ అయ్యి సంతోషంగా వెళ్తున్నాము.  వెళ్ళి వస్తాము.

 

 

 

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)