కుంభకోణం యాత్ర - 10

 

 

 

కుంభకోణం యాత్ర - 10

వైట్ వినాయగర్

 


                                                                                                
అమ్మయ్య.  హోటల్ కి వచ్చేశాము.  లంచ్ టైమ్ అయిందిగానీ ఏమైనా తినే ఓపిక కూడా లేదు.  ముందు కొంచెం సేపు పడుకుందాం.2-45 కి లేచాము. కింద రెస్టారెంట్ వున్నది కదా.  అప్పుడు లంచ్ చేసి బయల్దేరాము.  ఈ పూట వైట్ వినాయగర్ అనుకున్నాము. సాయంకాలం దూరం వాటికి వెళ్తే ప్రయాణ సమయం కలిసి వస్తుందని, అంటే ముందే బయల్దేరితే గుడి తెరిచే సమయానికి అక్కడ వుండచ్చని బయల్దేరాము.

 

హోటల్ వాళ్ళు కూడా  టూరిస్టులకి టాక్సీ  అందుబాటులో వుంచారుగానీ, ఆ ఛార్జీలు చాలా ఎక్కువగా అనిపించింది. ముఖ్యంగా మేము ఇద్దరమే, సమయం వున్నది, బస్ స్టాండ్ పక్కనే వున్నది, తమిళనాడులో బస్సులలో తిరగటం చాలా తేలిక.  అందుకే రెండు సార్లు రెండు మూడు చోట్లకి అడిగీ మానేశాము.  వైట్ వినాయగర్ కి స్వామి మలై, పట్టీశ్వరం (ఒకదానికొకటి మూడు కిలో మీటర్ల దూరంలో వుంటాయి) 3, 4 గం. ల సమయం పడుతుంది, 1400 రూ. అన్నారు.  మేము ఓపిక లేక ఒక్కదానికే వెళ్ళినా, మనిషికి 10 రూ. ల్లో వెళ్ళొచ్చేశాము.  ఈ మూడింటికీ మూడుసార్లు వెళ్ళాము ఒకేసారి కుదరక. వీటన్నింటికీ ప్రయాణం కోసం మేము ఖర్చు పెట్టింది  మనిషికి రూ. 40 కూడా లేదు. అయితే అవసరమైనవాళ్ళు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు.  నమ్మకంగా తీసుకెళ్ళి తీసుకొస్తారు.

 

బస్ స్టాండుకి వెళ్ళి కనుక్కుంటే 51 నెంబరు బస్ లో వెళ్ళమన్నారు.  సాధారణంగా అక్కడ మినీ బస్ లన్నీ ఊళ్లల్లోంచి వెళ్తాయి.  గుడి సమీపంలో ఆగుతాయిగనుక నడక తక్కువ వుంటుంది.  అక్కడ మేమెప్పుడు బస్ కోసం 5 ని. కన్నా వైట్ చెయ్యలేదు.  బస్ రెడీగా వున్నది.  ఎక్కి కూర్చున్నాము.  మీరు కూడా వచ్చేశారు కదా?

 

ఈ ఆలయం కుంభకోణంనుంచి 8 కి.మీ. దూరంలో వున్నది.  బస్ ఛార్జీ 5 రూ. లు.  గుడికి చాలా దగ్గరలోనే బస్ స్టాప్.  బస్ దిగిన చోటునుంచీ ఎదురు సందులో గుడి గోపురం కనబడతోంది.  అదిగో చూశారా?  టైము 3-50.  గుడి 4 గం. లకి తీస్తారేమో.  అదిగో గుడి బయట ఒక ముసలావిడ బుట్టల్లోంచి పూలు తీసి సర్దుతోంది.  పదండి.  దేవుడికి పూలు తీసుకుందాము.  ఇక్కడ అన్ని గుళ్ళల్లో మనం తీసుకెళ్ళిన పూల దండ ఎంత చిన్నదైనా తప్పనిసరిగా దేవుడికి పెడతారు.  నాకది చాలా సంతోషం అనిపిస్తుంది.

 

మనం వినాయక చవితి ఉత్సవాల్లో స్వీట్స్ తో, కాయగూరలతో, పూలతో, చెరుకుగళ్ళతో, డబ్బులతో, .....ఇలా ఒకటేమిటి అనేక రకాల వినాయక విగ్రహాలను ఎంతో అందంగా మలచటం చూస్తున్నాం కదా.  ఇప్పుడేమో పర్యావరణ పరి రక్షణ దృష్టిలో వుంచుకుని మట్టి వినాయకుళ్ళనే పూజించమంటున్నారు.  ఈ పర్యావరణ పరి రక్షణ అనేది ఇప్పుడే కాదు, పూర్వం వాళ్ళూ అనుసరించినట్లున్నారు.  అందుకేనేమో మరి సముద్ర నురగతో కూడా  వినాయకుణ్ణి తయారు చేశారుట.  ఇక్కడ వున్నది ఆయనే.

 

 

ఆలయం గోపురం చూశారుకదా.  లోపలకెళ్దాం పదండి.  ఎంత విశాలమైన ఆవరణో!  ఇంత పెద్ద ఆవరణలో గుడి చిన్నగానే వున్నదే.  అవును ఈ ఆలయం ఇక్కడ విలసిల్లటానికి వెనుక కధ చెప్పాలి కదా మీకు.  దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించిన కధ మీకు తెలుసుకదా.  అయితే ఏ కార్యక్రమం మొదలు పెట్టటానికైనా చేయవలసిన వినాయక పూజని చెయ్యటం దేవతలు మరిచి పోయారుట.  అందుకే సముద్ర మధనంలో ముందు హాలాహలం పుట్టిందిట. శివుడిని ప్రార్ధించిన దేవతలు ఆయన సహాయంతో తమ కష్టాన్ని దాటి, ఆయన ద్వారా  తమ పొరపాటును తెలుసుకుని, పాల సముద్రం నురగతో వినాయకుణ్ణి తయారు చేసి, పూజించారుట.  సముద్ర మధనం తర్వాత ఆ వినాయకుడిని ఇంద్రుడు తనతో తీసుకెళ్ళి పూజించాడుట. 

 

తర్వాత ఇంద్రుడు అహల్య సంఘటనతో వచ్చిన శాపాన్ని పోగొట్టుకోవటానికి ఈ శ్వేత వినాయకుడి విగ్రహంతో సహా భూలోకానికి వచ్చి అనేక  ప్రదేశాలలో శివార్చన చేస్తూ ఇక్కడికి వచ్చాడుట.  శ్వేత వినాయకుడికి ఇక్కడ వుండాలనిపించి దాని కోసం తన తండ్రి సహాయం అడిగాడుట.  శివుడు చిన్న పిల్లాడి రూపంలో ఇంద్రుడి దగ్గరకు వచ్చాడుట.  ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి ఆ బాలుడి చేతికిచ్చి తాను శివార్చన ముగించుకు వచ్చేదాకా కింద పెట్టవద్దని చెప్పి వెళ్ళాడు.  కానీ ఆ బాలుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడ వున్న బలిపీఠం కింద పెట్టి వెళ్ళి పోయాడుట.  తిరిగి వచ్చిన ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడనుంచి తీసుకెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేసి భంగ పడ్డాడు.  దేవ శిల్పిని రప్పించి రధం తయారు చేయించి, వినాయక విగ్రహం వున్న ఆ ప్రదేశాన్నే తీసుకు వెళ్ళాలని ప్రయత్నించాడు.  ఆ సమయంలో అశరీరవాణి ద్వారా శ్వేత వినాయకుడు అక్కడే వుండ దల్చుకున్నాడని, ఇంద్రుణ్ణి ప్రతి వినాయక చవితికీ వచ్చి ఆయనని పూజించమని, దానితో ఆయనని రోజూ పూజించిన ఫలితం వస్తుందని చెప్పింది.  అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుణ్ణి పూజిస్తాడని భక్తుల నమ్మకం.

 

శ్వేత వినాయకుడిది చిన్న విగ్రహమే. నురగ అవునో కాదో తాకి చూస్తామంటారా?  మీది మరీ విడ్డూరమండీ! గాలికే నీటి బుడగలు మాయమవుతాయే!  మనలాంటి వారంతా ముట్టుకుని చూస్తే ... అసలు నురగతో తయారయింది గనుకే ఈ విగ్రహానికి వస్త్రాలు కట్టరు, పూలు పెట్టరు, అభిషేకాలు వగైరా చెయ్యరు.  అంటే,  ఏ విధంగానూ విగ్రహాన్ని తాకరు.  కేవలం పచ్చ కర్పూరం పొడి మాత్రం చల్లుతారు, అదీ చెయ్యి తగలకుండా.

 

వినాయకుడు ఇక్కడ ఇంద్రదేవి కమలాంబాల్ (మహా విష్ణువు కళ్ళనుంచి పుట్టింది), బుధ్ధి దేవి (బ్రహ్మ వాక్కునుంచి పుట్టింది) అనే వారిని వివాహం చేసుకున్నాడుట.   అందుకే ఇక్కడ ఈ స్వామిని సేవిస్తే వివాహ విషయాలలో వున్న అడ్డంకులు తొలగి పోతాయని భక్తుల నమ్మకం.

 

స్వామిని చూశారు కదా   చిన్న విగ్రహమే.  ఎంత తెల్లగా వున్నాడో.  చుట్టూ చిన్న మండపం.  అందంగా వున్నదికదా. ఇక్కడ ఎంత చిన్న ఆలయాలయినా సాదా సీదాగా కట్టరండీ.  శిల్పులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.  చూశారుకదా. అటెళ్దాం పదండి.

అదేమిటి  ఇంకో గోపురంలా వున్నదే  అటెళ్ళి చూద్దాం పదండి.  

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)