కుంభకోణం యాత్ర – 11

 

 

 

కుంభకోణం యాత్ర – 11

తండ్రి సహాయం – కొడుకు స్ధిర నివాసం

 


                                                                                              

అదేమిటి?  బయటకి వెళ్ళే ద్వారమా? ఏమిటో!? ఈ రాష్ట్రంలో ఇంతంత పెద్ద దేవాలయాలు వున్నాయిగానీ, మనలాంటి వారికి వివరాలు తెలియవు.  వీళ్ళేమో తమిళం తప్పితే వేరే భాష మాట్లాడరు.  భాషాభిమానం వుండాలిగానీ మరీ ఇలా ఇతరులకి మన గొప్పతనం తెలియనంత అవసరం లేదేమోననిపిస్తుంది.  ఏమంటారు?  చూద్దాం.  ఏముందో అవతల.  బయటకి వెళ్ళేదోవయితే తిరిగి ఇటే వచ్చేద్దాము.  బస్ స్టాప్ ఇటే దగ్గర.  

 

అదేమిటి  అంత పెద్ద మండపం! ఇంకో ఆలయం వున్నట్లుంది ఇక్కడ!  ఇది బోనస్ అన్నమాట మనకు!!  సాధారణంగా మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మేము ప్లాన్ చేసుకున్న వాటికన్నా ఎక్కువ చూస్తే ఆ ఎక్కువ చూసినవన్నీ బోనస్ అనుకుంటాం.  ఈ పూట మా ప్లాన్ లో మరి వైటి వినాయగర్, స్వామి మలై మాత్రమే వున్నాయి.    
ఎంత పెద్ద ఆలయమో!!!!   చాలా పెద్దది!!!  అనేక డిజైన్లు చెక్కిన స్తంభాలతో పెద్ద మండపాలు.  ప్రతి స్ధంబం మీద ఎంత చక్కని డిజైన్లు చెక్కారో!   ఇంకొంచెం ముందుకెళ్దాం.   ఆలయంలో దీపాలు లోకపోవటవల్ల చీకటిగా వున్నది. సాయంకాలం 4-30 అయింది.  బహుశా గుడి తీసే సమయం అయి వుంటుంది.  ఈ లోపల మనం వీలయినంత చూద్దాము.  అదిగో వాళ్ళెవరో వచ్చి దేవుడుకి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు.  బహుశా ఇక్కడివాళ్ళే అయ్యుంటారు.  అందుకే ఎక్కడా ఆగకుండా, చీకటి అని చూడకుండా, గర్భగుడి దగ్గరకెళ్ళి దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు.    

 

 

లోపల లైట్లు లేక పోవటంతో చీకటి వెలుగుల రంగేళిలో అసలే పాత కాలంనాటి ఆలయం ఇంకా పాతగా, అద్భుతంగా కనబడుతోంది కదా.   కొత్త ప్రదేశం, వెలుతురు సరిగా లేక, ఇంత పెద్ద పురాతన ఆలయంలో .. భయం వేస్తోంది అంటారా  నిజమే.  ఇలా చీకటిగా  వున్న చోట్ల వున్న  పెద్ద విగ్రహాలు కూడా కొంచెం భయ పెడుతున్నాయి.  కొంచెం అలవాటయ్యేదాకా కబుర్లు చెబుతూ వుంటాను. నెమ్మదిగా నడవండి.

 

ఎలాగైనా తమిళనాడులో ఆలయానికి వెళ్ళేవాళ్ళ సంఖ్య ఎక్కువేనండీ.  మనం ఆలయానికి వెళ్ళాలంటే అదేదో పిక్నిక్ కార్యక్రమంలాగా ఇంట్లో వాళ్ళనీ, చుట్టుపక్కల వాళ్ళనీ కూడా బయల్దేరదీస్తాము.  దానితో అక్కడా కబుర్లే.  ధ్యాస దేవుడిమీద తక్కువ, కూడా వచ్చినవాళ్ళమీద, వాళ్ళ మాటలమీదా ఎక్కువ.  ప్రశాంతంగా వుండాలనుకునే వాళ్ళని కూడా చికాకు పరుస్తాము.  కానీ ఇక్కడ చాలా మంది ఎవరి దోవన వాళ్ళు వచ్చి వెళ్తారు.  మౌనంగా దణ్ణం పెట్టుకుని, దీపాలు వెలిగించటమో, లేకపోతే వున్న దీపాలలో నూనె పోసో, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుని మౌనంగా వెళ్తారు.  అంతే కాదండోయ్. నాకు నచ్చని మాట ఒకటి మాత్రం వాళ్ళల్లో చాలామంది, అడక్క పోయినా చెబుతారు.  ఫోటోలు తియ్యద్దని. ఫోటోలు తియ్యద్దంటే ఎట్లాగండీ??  మరి రాని వాళ్ళందరికీ ఇక్కడి విశేషాలు చూపించాలా  వద్దా??  నా మంచితనాన్ని అర్దం చేసుకోరు వాళ్ళు.  అందుకే కొన్ని దొంగ ఫోటోలు కూడా తీస్తాను.  చేసిన పాపం చెబితే పోతుందంటారు కదా.  మరి నా దొంగ ఫోటోల పాపం పోవటానికి మీకు చెప్పేశానన్నమాట. 

 

 

అదిగో ఉమ సెల్ లో టార్చ్ లైట్ చూపిస్తోంది.  ఆ వెలుతురులో నెమ్మదిగా చూస్తూ పదండి.  మళ్ళీ ఇంకో ఆలయానికి కూడా వెళ్ళాలికదా.  అదేదో అమ్మవారి విగ్రహంలాగా వున్నది.  కాళిలాగా వున్నది.  చీకట్లో చూస్తుంటే భయం వేస్తోందా  సరే ... 
అటు పదండి.  వెలుతురు బాగా వున్నది.  ఇది లోపలి ప్రాకారం.  ఇలా చుట్టూ తిరిగి చూద్దాము.  ఏమున్నాయో!?  అవిగో, చుట్టూ శివలింగాలు, వినాయకుడి విగ్రహాలు, దేవీ విగ్రహాలు ప్రతిష్టించారు.  పూర్వం ఇక్కడ యజ్ఞం జరిగిందట, ఆసమయంలో వీటిని ప్రతిష్టించారు  అంటారు.

 

 

ఇటునుంచి లోపలకి వెళ్ళచ్చా...లోపల ఎవరో ఒకాయన నుంచున్నట్లున్నది.   ఇటొద్దులెండి.  వెలుతురున్న ప్రదేశంలో వెళ్దాము.  అక్కడో ఉపాలయం వున్నది.  చూద్దాం.  గజలక్ష్మీ అమ్మవారు.  ఎంత చక్కగా వున్నదో.

 

గుళ్ళోకెళ్దాం పదండి.  ఈ మండపాలన్నీ దాటేసరికి వేరే వాకింగ్ అక్కరలేదు.  రోజూ ఇలాంటి గుడికి వస్తే చాలు.  అసలు ఇంత పెద్ద ఆలయాలు ఇన్ని ఒకే ఊళ్ళో ఎందుకు కట్టారంటారా   మరి కధ అక్కడే మొదలయింది కదండీ.  ప్రళయం తర్వాత అమృత భాండం ఇక్కడికి రావటం ...  గుర్తొచ్చాయంటారా.  సరే.  అందుకే ఇన్ని ఆలయాలు ఇంత దగ్గరలో వున్నాయి.  తర్వాత రాజుల దైవ భక్తి, కళాపోసన కారణాలవల్ల ఇంత సుందర ఆలయాలు నిర్మించి వుంటారు.

 

 

గర్భగుడికొచ్చేశాము.  దీపారాధన కాంతిలో శివ దర్శనం చేసుకోండి.  వేరే దేవుళ్లయితే అలంకరణ ఎలా వున్నదో చూడాలని తాపత్రయ పడతాముగానీ, శివుడి దగ్గర ఆ ఇబ్బంది వుండదు.  చిన్న దీపంతోనయినా దర్శించగలుగుతాం పరమేశ్వరుణ్ణి.  ఉమ అటు లైటు చూపిస్తోంది పదండి.  ఇక్కడా శివ లింగం, ఇటు పక్క మునీశ్వరుడు వున్నారు.  ఇంక బయటకి పదండి. ఆలయం ఇంకా తెరవ లేదు.  ఎప్పటికి తెరుస్తారో ఏమో!??  

 

పక్కనే ఇంకో ఆలయం వున్నది.  ఇంత దూరం వచ్చి అది కూడా చూడాలికదా.  పదండి.  అది అమ్మవారి ఆలయంట.  ఆయన చెప్పారు.  అమ్మో ఇది కూడా చాలా పెద్దగా వున్నది.  ఇలా ప్రదక్షిణ చేద్దాము.  అమ్మవారి గర్భగుడికి ప్రదక్షిణ చేసినట్లు అవుతుంది.  గర్భ గుడి చుట్టూ బయట గోడ మీద చూడండి.  ఎంత అద్భుతమైన చిత్రాలు వున్నాయో!!   అవి ఎప్పుడు వేసినవో!   చాలా మటుకు పాడయినాయి.  అమ్మకి దణ్ణం పెట్టుకున్నారు కదా.  ఎంత చక్కని తల్లో!!

 

ఇంక వెళ్దాం పదండి.  5-15 అయింది. అదిగో పూజారిగారు వస్తున్నారు, అన్ని చోట్లా లైట్లు వేస్తూ.  మన మాటలు విన్నారేమో దర్శనం 5 గం. ల నుంచీ అంటున్నారు. అందుకే అంతకు ముందు లైట్లు లేవన్నమాట.  పోనీ గుడి తీసి వుంది.  మనలాంటి వాళ్ళు తిరిగి వెళ్ళకుండా చూశాం.

 

ఇంక ఇప్పుడు స్వామి మలై వెళ్ళే ఓపిక కనబడటం లేదు. పొద్దున్నించీ తిరుగుతున్నాము కదా.  రూమ్ కి వెళ్ళి రెస్టు తీసుకుందాము.  రేపు పొద్దున్నే వెళ్ళచ్చు.తర్వాత ఈ దేవాలయం గురించి నేను సేకరించిన సమాచారం ఇప్పుడు చదవండి. ఇక్కడ ఈశ్వరుడి పేరు తిరువలన్ జులి నాధన్, కపర్దీశ్వరార్.  అమ్మవారు బృహన్నాయకికి (పెరియ నాయకి అని కూడా అంటారు).  ఈశ్వరుడు స్వయం భూ.  అతి పురాతనమైన ఈ ఆలయాలు, కనక చోళుడిచే నిర్మింపబడ్డాయి అంటారు.  అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారే ఈ ఆలయాలకి ఆ పేరు ఎలా వచ్చిందంటే....  

 

ఒకసారి కావేరీ నది అగస్త్య మహర్షి కమండలం నుంచి చోళ రాజ్యం వైపు ప్రవహించసాగింది.  చోళ రాజు హరిధ్వజన్ కావేరీ మాతకి స్వాగతం పలకటానికి సకల సన్నాహాలతో ఈ ప్రదేశానికి వచ్చాడు.  ఇక్కడిదాకా వచ్చిన కావేరీ నది, శివునికి ప్రదక్షిణంగా పయనించి ఈశాన్యం వైపు వున్న ఒక బిలంలోకి ప్రవేశించి అంతర్ధానమయిపోయింది.  రాజు ఆ నదీమతల్లిని పైకి తీసుకురావటానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు.  ఆయన కొట్టాయూర్ లో తపస్సు చేసుకుంటున్న హేరండ మహర్షిని ఆశ్రయించాడు.  హేరండ మహర్షి ఇక్కడికి వచ్చి శివుణ్ణి ప్రార్ధించాడు.  ఆ ప్రార్ధనల ఫలితంగా ఆశరీరవాణి వినిపించింది......  కొన్ని ప్రత్యేకతలు వున్న ఋషిగాని అలాంటి ప్రత్యేకతలే వున్న రాజుగానీ ఆ బిలంలోకి ప్రవేశిస్తే కావేరి కరుణించి భూమిపైకి వస్తుంది అని.  రాజు ఆ బిలంలోకి వెళ్ళటానికి తాను సన్నధ్ధుడయ్యాడుగానీ,  రాజును వారించి,  హేరండ మహర్షి ఆ బిల మార్గంలో ప్రవేశించి తన ప్రాణాలను త్యాగం చేశాడు.  ప్రజలకోసం హేరండ మహర్షి చేసిన త్యాగం ఫలించింది.   తిరిగి కావేరీ నది ‘మేల కావేరి’ అనే చోట భూమి పైకి వచ్చింది.    కావేరి ఇక్కడ శివుని చుట్టి వెళ్ళింది కనుక ఈ ఊరు పేరు తిరువన్ జులి అయింది.   ప్రజలకోసం తన జీవితాన్ని బలిపెట్టిన హేరండ మహర్షి విగ్రహమే మనం ఆ చీకట్లో చూసిన ఋషి విగ్రహం. 

 

శివాలయంలో వున్న కాళీ విగ్రహం  కూడా చూశాం కదా.  పూర్వపు రాజులు ఈ కాళీమాతని పూజించేవారు.  ఈ విగ్రహానికి అతి చిన్న భేదం ఏదో వున్నదని, అందుకనే కొంత సౌమ్యంగా వున్నదనీ, లేకపోతే చాలా భయంకరంగా వుండేదని అంటారు. ముందు వైట్ వినాయగర్ ఆలయం చూశాంకదా.  ఆ వినాయకుడి ఆలయం అక్కడ రావటానికి కారణం ఇక్కడి శివుడే.  ఆ కధ మనం వైట్ వినాయగర్ ఆలయాన్ని దర్శించినప్పుడు తెలుసుకున్నాముకదా.  అంటే అంతకన్నా ముందునుంచే ఈ ఆలయాలు ఇక్కడ వున్నాయన్నమాట.

పురాణాల కాలంనాటి ఈ ఆలయాల దర్శనం కూడా అదృష్టమే.

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)