కుంభకోణం యాత్ర – 9
కుంభకోణం యాత్ర – 9
అభిముఖేశ్వరస్వామి ఆలయం
ఈ కనిపిస్తున్న సువిశాలమైన పుష్కరిణే మహామహం అని చెప్పానుకదా. అదిగో ఆ తూర్పు వైపున వున్న ఆలయమే అభిముఖేశ్వరాలయం. మహామహానికి ఎదురుగా వున్నందున ఆ పేరన్నారు. అమృత కలశంలోని కొబ్బరికాయ ఇక్కడ పడి కొబ్బరి చెట్టయింది. కొబ్బరికాయని నారికేళం అని కూడా అంటారు కదా. ఈ క్షేత్రం నారికేశ్వరం అయింది. ఇక్కడ శివుడు తూర్పు ముఖంగా, మహామహానికి అభిముఖంగా వున్నాడు. మహామహంలో నవకన్యలు స్నానం చేయటానికి వచ్చినప్పుడు వారికి దర్శనమివ్వటానికి ఎదురుగా వున్నాడని అభిముఖేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ ఆలయం చిన్నదే అయినా చక్కని శిల్పాలున్నాయి.
ఈ స్వామిని సేవించి మత్స్యదేశ రాజు మూగ కుమార్తెకు మాటలు వచ్చాయని, సుతపాన అనే బ్రాహ్మణుడికి శరీరంమంతా వ్యాపించిన కుష్టురోగం తగ్గిందని పురాణ కధలు. ఇక్కడికి వెళ్ళేసరికి సమయం దాదాపు 12 గం.లయింది. అక్కడివారు ఆలయం మూసేస్తారు, ముందు దర్శనం చేసుకోండి అంటే హడావిడిగా వెళ్ళాము. ఈ ఆలయం గురించి ఇంతకన్నా ఎక్కువ వివరాలు తెలియలేదు
మహామహం
ఈ మహామహంలో 12 ఏళ్ళకొకసారి పది రోజులపాటు మహామహం వేడుకలు అత్యద్భుతంగా సాగుతాయి. ఫిబ్రవరి, మార్చి మధ్యలో గురువు సింహరాశిలో, సూర్యుడు కుంభరాశిలో ఉండగా మఖ నక్షత్రం, పౌర్ణమి కలిసొచ్చే రోజే మహామహం. (పుష్కరిణి పేరే ఉత్సవం పేరుకూడా.) ఇది 12 ఏళ్లకొకసారి వస్తుంది. మహామహం కాలంలో ఈ మహామహం పుష్కరిణిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మహామహం ఉత్సవాలు దక్షిణాది కుంభమేళాగా కూడా ప్రసిధ్ధిపొందాయి.
ఈ ఉత్సవం గురించి నేను సేకరించిన విషయాలు కొన్ని చెబుతాను....
ఈ సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీకునుంచి 22వ తారీకు వరకు జరిగాయి. అప్పటి విశేషాలు.... కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిస్వామి తొలిరోజు విచ్చేసి పుణ్యస్నానమాచరించారు. ఆలయాలలో ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయినట్లే ఈ ఉత్సవం కూడా ధ్వజారోహణంతో ప్రారంభమయింది. మొదటి రోజు మహామహం స్ధల పురాణంతో సంబంధం వున్న ఐదు శివాలయాల్లో ధ్వజారోహణ జరుగింది. వాటిలో మొదట పుష్కరిణికి అభిముఖంగా వున్న అభిముఖేశ్వరాలయంలో ధ్వజారోహణ జరుగగా తర్వాత ఆది కుంభేశ్వర, కాశీ విశ్వనాధ, కాళహస్తీశ్వర, సోమేశ్వర ఆలయాల్లో జరుగాయి. తర్వాత ఐదు వైష్ణవాలయాలలో ధ్వజారోహణ వగైరా కార్యక్రమాలు మొదలయ్యాయి.
ఈ సందర్భంగా 20 నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలను వూరేగింపుగా తీసుకొచ్చి మహామహం పుష్కరిణిలో కలిపారు. ఆది కుంభేశ్వర ఆలయం నుంచి అమృతనీటి కలశాన్ని అద్దాల పల్లకిలో ఉంచి మేళతాళాల మధ్య మహామహం పుష్కరిణికి తీసుకొచ్చారు. ఈ కలశంలోని పుణ్యజలాలను అర్చకులు ప్రత్యేక అభిషేకం నిర్వహించి పుష్కరిణిలో కలిపారు. ఆ తర్వాత భక్తులపై మహామహం పుష్కరిణలోని జలాలను చిమ్మడంతో పాటు కలశంలో ఆ నీటిని సేకరించి మళ్లీ అద్దాల పల్లకిలో ఆది కుంభేశ్వర ఆలయానికి వూరేగింపుగా తీసుకెళ్లారు. మహామహంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కుంభకోణం చేరుకోవడంతో వేడుకలు జరిగే పుష్కరిణి ప్రాంతం మొదలుకుని నగరంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్ కిటకిటలాడాయి. మహామహం వేడుకలను పురస్కరించుకుని కుంభకోణంలోని పాఠశాలలకు పది రోజుల స్థానిక సెలవు ప్రకటించారు.
పుణ్య నదులు సైతం తమలోని పాపాల ప్రక్షాళనకు పుణ్య స్నానాలు ఆచరించిన తటాకం మహామహం. మహామహం పుణ్యకాలంలో సకల దేవతలు ఈ పుష్కరిణిలో స్నానం చేసేందుకు వస్తారని విశ్వాసం. అందుకే 12 ఏళ్లకు ఓసారి జరిగే ఈ వేడుకలకు లక్షలాది మంది ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయటానికి దేశం నలుమూలలనుంచి వస్తారు. వీరికోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుపుతారు.
స్ధల పురాణం
మహా ప్రళయంలో బ్రహ్మ దేవుడు శివుడి ఆజ్ఞ ప్రకారం ఏర్పరిచిన అమృత కుంభం ఈ ప్రాంతానికి కొట్టుకు వచ్చిందని చెప్పానుకదా. శివుడు అందులోని వస్తువులు, అమృతము అన్ని చోట్లా పడాలనే ఉద్దేశ్యంతో బాణంతో కొడితే అవ్వన్నీ అనేక చోట్ల పడ్డాయి. అందులోని అమృతం ఇక్కడ పడిన చోట అమృత తీర్ధం అయింది. ఈ తీర్ధంలో నవ కన్యలు శివుని సలహాతో ప్రతి మహామహం రోజున స్నానం చేసి, తమ పాపాలను పోగొట్టుకుంటారు. పవిత్రమైన నదీమ తల్లుల పాపాలే పోగొట్టగలిగినంత పవిత్రమైనది కనుకే ఈ తీర్ధానికి మహామహం అని కూడా పేరు వచ్చింది.
నవ కన్యల కధ
నవ కన్యలంటే తొమ్మిది మంది నదీమ తల్లులు. వారు 1. గంగ, 2. యమున, 3. నర్మద, 4. సరస్వతి, 5. కావేరి, 6.గోదావరి, 7. కృష్ణ, 8. తుంగభద్ర, 9. సరయు. ప్రజలు వచ్చి ఈ పుణ్య తీర్ధాలలో స్నానం చేసి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు. కానీ ఆ పాపాలన్నీ నదీమ తల్లులకు వచ్చి వారికి మోయలేని భారంగా అయ్యాయి. వారు విశ్వేశ్వరుడిని తమ భారం తీరే మార్గం చెప్పమని ప్రార్ధించారు. ఆయన మహామహం రోజున కుంభకోణంలోని మహామహంలో స్నానం చేస్తే వారి పాపాలు పోతాయని సలహా ఇచ్చాడు. వారికి మార్గం తెలియకపోతే స్వయంగా వచ్చి సహకరించాడుట. పాపాలు పోగొట్టుకున్న నవ కన్యలు పరమేశ్వరుడిని అక్కడే వెలిసి భక్తుల అభీష్టాలు తీర్చమని ప్రాధేయ పడ్డారని, వారి కోరిక మీద శివుడు కాశీ విశ్వేశ్వరుడి పేరుతో అక్కడే వెలిశాడని చెబుతారు. అంతేకాదు నవ కన్యలు కూడా ఈ తీర్ధంలో శక్తులను నింపారని దీనిని కన్నియార్ తీర్ధం అని కూడా అంటారు.
కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో నవ కన్యల కధలు, వారి విశేషాలు, మహిమలు కాశీ విశ్వేశ్వరుని గురించి, కుంభకోణం యాత్ర – 8 .. కాశీవిశ్వనాధాలయంలో తెలుసుకున్నాము కదా. ఇంక ఈ మహామహం నిర్మాణం గురించి కూడా తెలుసుకుందాము.
నిర్మాణం
మహామహం చుట్టూ గట్టు చూడండి, ఎంత బాగా కట్టారో. లోపలకి దిగటానికి వీలుగా మెట్లు వున్నాయి. దీనిలో ఎప్పుడూ నీరు వున్నా, మహామహం సమయంలో శుభ్రం చేసి, భక్తులకు ఇబ్బంది కలుగకుండా కొంత లోతుదాకా మాత్రమే నీరు నింపుతారు.
ఈ తీర్ధం చుట్టూ వున్న చిన్న చిన్న మండపాలు చూశారా? అవి 16 వున్నాయి. ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క పేరుతో శివుడు విరాజిల్లుతున్నాడు.టైము 12-15 అయింది. మనం ఆటోలో తిరిగాము కనుక ఇన్ని ఆలయాలు చూడగలిగాము. ఈ సమయంలో అన్ని ఆలయాలు మూసి వుంటాయి. మనం కూడా హోటల్ కి వెళ్ళి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందాం. చాలా అలసిపోయాం కదా.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)