కుంభకోణం యాత్ర – 24
కుంభకోణం యాత్ర – 24
మహాలింగేశ్వరస్వామి, తిరువిడైమరుదూర్
మధ్యాహ్నం కాసేపు పడుకున్నారు కదా. కొంచెం అలసట తీరిందా? అయినా ఇక్కడ అలసట వచ్చినా పక్కకి నెట్టేస్తాము. ఈ టెంపుల్స్ అన్నీ ఒకదానిని మించి ఇంకొకటి వున్నాయి కదా. ఎక్కడు ఏది మిస్ అవుతామో, అన్నీ చూసెయ్యాలనే తాపత్రయం కదా. కాఫీ తాగాక మనం తిరువిడైమరుదూర్ అనే ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయాన్ని మహాలింగేశ్వరస్వామి ఆలయం అంటారు. దీనికి ప్రాధాన్యతలూ, ప్రాముఖ్యతలూ చాలా వున్నాయి. ఒక్కొక్కటీ చెబుతాను.
ఇంకో విశేషం తెలుసా!? మేము 2008 లో వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని చూశాము. కానీ దీని విశిష్టత ఆ మధ్య మాటీవీ లో శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రసంగం విన్నాక తెలిసింది. ఈ క్షేత్రం గురించి ఆయన తన శ్రీశైల వైభవం అనే ప్రసంగంలో చెప్పారు. అయితే దీని పేరు ఆయన మధ్యార్జునం అని ప్రస్తావించారు. మాకు తెలిసింది తిరువిడైమరుదూర్. పరమ గురువు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరాచార్యులవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశాలు మధ్యార్జునం, శ్రీశైలం అనీ, మధ్యార్జునంనుంచి ప్రసాదం ఎవరైనా తెస్తే అత్యంత భక్తితో తీసుకుని తలమీద పెట్టుకుని తీసుకునేవారనీ, ఆయన ఎవరేమిచ్చినా తీసుకోరనీ, ఈ ప్రసాదానికి మాత్రం అభ్యంతరం చెప్పేవారుకాదనీ చెప్పారు.
ఇంకా ఇక్కడ ఒక మద్ది చెట్టువున్నదని, అటు వెళ్ళే దోవకి తాళం వేసి పెడతారని, అడిగితే చాలా కష్టంమీద తాళం తీసి చూపిస్తారనీ, వాళ్ళుకూడా అలాగే తాళం తీయించే చూశారనీ..ఆ చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అని చెప్పారు. పైగా ఇటువంటి మద్ది చెట్లు మధ్యార్జునం, శ్రీశైలంలో మాత్రమే వున్నాయని చెప్పారు. శ్రీ చాగంటివారి ప్రసంగం విన్నాక ఆ మధ్యార్జునం గురించి తెలుసుకుని వీలైతే, దర్శించాలని నెట్ లో వెతికాను. మా అదృష్టం. నేను అనుకున్నది నిజమయింది. మేము దర్శించిన తిరువిడైమరుదూర్ అదే. అయితే నాకు ఆ క్షేత్రం పేరు మధ్యార్జునం అని అప్పుడే తెలిసింది. ఇక్కడనుంచీ 8, 9 కి.మీ. లు వుంటుంది. ఇదివరకూ మేము బస్సులోనే వెళ్ళాము. బస్సు ప్రయాణం 40 నిముషాలు పట్టింది. మనం కూడా ఇప్పుడు బస్ లో వెళ్దాము.
ఈ క్షేత్రం పేరు తిరువిదైమరుదూరు అని చెప్పాను కదా. శివుడు మహాలింగేశ్వరుడు. పెద్ద లింగం. చాలా పెద్ద ఆలయం. పెద్ద కారిడార్. అతి పురాతన ఆలయం. చాలా ప్రశాంతంగా, దర్శకుల మనసులో భక్తిభావం పెల్లుబికేలా వుంటుంది. దూరంనుంచే మహాలింగేశ్వరుని చుట్టూ ఆర్చి లో వెలిగించిన దీపాలు కనులవిందు చేస్తుంటే తాదాత్మ్యంగా స్వామిని దర్శించుకున్నాము.
ఆ ఆలయాన్ని చూసి అత్యంత ప్రభావితులమయ్యాముగానీ, భాషారపమైన ఇబ్బందులవల్ల ఇంతటి అపురూప ఆలయాల చరిత్ర సరిగా తెలుసుకోలేకపోయానని అప్పుడు చాలా బాధ పడ్డాను. తెలుసుకున్నంతవరకు సృష్టి మొదలయినప్పుడు భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని. పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి మహాద్భుత లింగమో అని తిరిగి తిరిగి నమస్కారాలు చేస్తూ వచ్చాము.
ఇంకొక విశేషంకూడా మేమక్కడ చూశాము. మేము కుంభకోణంనుంచి అక్కడికి వెళ్ళేసరికి సాయంకాలం 4 గం. లు కావస్తోంది. 4 గం. లకు ఆలయం తీశారు. అప్పుడు మావటివాడు ఆలయ గజరాజాన్ని కొంత లోపలికి తీసుకువచ్చి ప్రదక్షిణ చేయించి తీసుకువెళ్ళాడు.
ఇవి ఇదివరకు మేము చూసినప్పటి విశేషాలు. పదండి. తిరువిడైమరుదూరు బస్టాప్ అదే. బస్ ఎక్కాక ఆలయానికి వెళ్ళేదాకా ఇంకొన్ని విశేషాలు చెబుతాను. ఈ ఆలయానికి సంబంధించి పాండ్యులు, చోళులు, తంజావూర్ నాయక రాజులు, తంజావూర్ మరాఠా రాజులు రాయించిన 149 శాసనాలు లభ్యమయినాయిట. ప్రస్తుతం వున్న ఆలయ రాతి కట్టడం 9వ శతాబ్దంలో చోళరాజులచే నిర్మింపబడింది. తర్వాత 16వ శతాబ్దంలో తంజావూరు నాయకులు పునరుధ్ధరించారు. నాలుగు వైపులా నాలుగు గోపురాలతో అలరారే ఈ ఆలయం రాష్ట్రంలోని పెద్ద ఆలయాలలో ఒకటి. మరి ఇక్కడ శివాలయాలని గురించి చెప్పేటప్పుడు 6 -8 శతాబ్దాలలో ఈ స్వామిని ప్రశంశిస్తూ గానం చేసిన కవుల గురించి కూడా చెప్పాలికదా. వాళ్ళు అప్పార్, కంపంతార్, కుంతరార్.
ఈ మహాలింగస్వామి స్వయంభువుడు. ఈయన ఈ ప్రాంతంలోని అన్ని శివాలయాలకి, సప్త విగ్రహ మూర్తులకు (ప్రముఖ శివాలయాల్లోని 7 ముఖ్య దేవతలు) మధ్యలో కొలువుతీరి వున్నాడు. సప్త విగ్రహ మూర్తులు అంటే, ఈ రాష్ట్రంలోనే, ఈ ఆలయం చుట్టూ ముఖ్య ప్రదేశాలలో వున్న ఆలయాలలో వున్న ఏడు దైవ విగ్రహాలు. అవి 1. చిదంబరంలో నటరాజస్వామి ఆలయంలోని నటరాజు, 2. తిరు చెంగలూరు ఆలయంలోని చండికేశ్వరుడు, 3. తిరువలంజులిలోని వైట్ వినాయకుడు, 4. స్వామిమలైలోని సుబ్రహ్మణ్యస్వామి, 5. శీర్ కాళిలోని సత్తెనాధార్ ఆలయంలో భైరవుడు, 6. నవగ్రహాల ఆలయాలలో ఒకటైన సూర్యుడు, 7. అలాన్ గుడి లోని ఆప్త సహాయేశ్వర్ ఆలయంలో దక్షిణా మూర్తి. ఈ ఆలయం చుట్టూ నాలుగు దిక్కులలో నాలుగు శివాలయాలు, మధ్యలో ఈ ఆలయం వుండటంచేత దీనిని పంచలింగ స్ధలమని కూడా అంటారు. ఆ ఆలయాలు .. తూర్పు వీధిలో విశ్వనాధుడు, పడమట ఋషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఆత్మనాధుడు, ఉత్తర వీధిలో చొక్కనాధుడు.
మహాలింగస్వామి స్వంభువుడు. భక్తితో ఈయన ఆలయానికి ప్రదక్షిణ చేసివారికి ఏ విధమైన మానసిక బాధలైనా తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, వివాహం, పిల్లలు, ఉద్యోగం వగైరా సకల కోరికలూ నెరవేరుతాయట.
అమ్మవారు బృహత్ సుందర కుచాంబాల్ (తమిళంలో పెరునల మామువై అమ్మాళ్). ఇక్కడ ఆలయం ముందు మండపంలో వున్న నంది ఈ జిల్లాలో వున్న అన్ని ఆలయాలలో నందులకన్నా పెద్దది (బృహదీశ్వర ఆలయంకన్నా కూడా). కానీ ఇది ఒకే శిలతో చేయబడలేదు. అందుకే అంత బరువుండదు.
ఈ ఆలయం పక్కనే మూకాంబిక అమ్మవారికి ప్రత్యేక ఆలయం వున్నది. ఆలయంలో మహా మేరువు కూడా వున్నది. మానసిక ఆరోగ్యం కోసం భక్తులు దీనిని పూజిస్తూ వుంటారు. అమ్మవారు ఇక్కడ పద్మాసనంలో తపస్సు చేస్తున్నట్లు వుంటుంది. మూకాసురుణ్ణి చంపటంవల్ల వచ్చిన బ్రహ్మ హత్యా దోషం పోవటానికి ఈవిడ ఇలా తపస్సు చేస్తోందిట. మూకాంబికకు ఎక్కువ ఆలయాలు లేవు. ఈ ఆలయం కూడా కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు మూకాంబిక ఆలయంలాగా ప్రసిధ్ధి చెందింది. ఈమె చాలా శక్తికల దేవత అని భక్తుల నమ్మకం. దంపతులు పిల్లల కోసం, సుఖ ప్రసవం కోసం ఈ దేవిని పూజిస్తారు.
ఈ శివాలయంలోకి ప్రవేశించిన ద్వారం నుంచి బయటకి వెళ్ళరు. దీనికి ఒక కధ వున్నది. ఒకసారి పాండ్య రాజు వరగుణ పాండ్యన్ అడవిలోకి వేటకి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు చాలా చీకటి పడటంతో ఆ చీకటిలో తెలియక అతని గుఱ్ఱం ఒక బ్రాహ్మడుని చంపుతుంది. చంపింది అతని గుఱ్ఱమైనా, యజమానిగా బాధ్యత అతనిదేకదా. అతనికి బ్రహ్మహత్యా దోషం వస్తుంది బ్రాహ్మడుని చంపినందుకు. అతను శివ భక్తుడవటంతో మహా శివుణ్ణి దోష నివారణకు ప్రార్ధించాడు. ఆయన కలలో శివుడు కనిపించి తిరువిడైమరుదూర్ వెళ్ళమని సలహా ఇచ్చాడు. కానీ ఆ సమయంలో ఆ ప్రదేశం చోళ రాజ్యంలో వుండటంతో ఎలా వెళ్ళాలా అని సందేహంలో పడ్డాడు వరగుణ పాండ్యన్. ఆ సమయంలో చోళ రాజు తన సైన్యంతో పాండ్యరాజుమీదకి యుధ్ధానికి వచ్చాడు. అందులో పాండ్య రాజు గెలిచాడు. దానితో ఆయన తిరువిడైమరుదూర్ ఆలయానికి వెళ్ళి తూర్పు ద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేశాడు. అతన్ని అన్ని చోట్లకీ వెంటాడుతున్న బ్రహ్మహత్యా దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం బయటే వేచి వున్నాది, రాజు బయటకి రాగానే తిరిగి ఆయనని పట్టుకోవటానికి.
వరగుణ పాండ్యన్ ఇక్కడ శివుణ్ణి ఆరాధించే సమయంలో ఆయనకి ఒక అశరీర వాణి వినిపించింది. ఆయనని తూర్పు ద్వారంనుండి కాక వేరే ద్వారంగుండా బయటకి వెళ్ళమని ఆదేశిస్తూ. ఆయన అలాగే చేశాడు. బ్రహ్మ హత్యాదోషం మాత్రం తూర్పు ద్వారం దగ్గర అలాగే వేచి వున్నది పాండ్య రాజు కోసం. అందుకనే బ్రహ్మ హత్యాదోషంనుంచి విముక్తి పొందటానికి ఇక్కడ శివుణ్ణి సేవిస్తారు. అంతేకాదు. తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయం బయటకి వేరే ద్వారంగుండా వెళ్తారు. అదే ద్వారంగుండా వెళ్తే బ్రహ్మ హత్యా దోషం పట్టుకుంటుందని భయంతో. ఇప్పటికీ, అక్కడ తెలిసినవారు ఈ పధ్ధతే పాటిస్తారు.
మధ్యార్జునం
ఈ పవిత్రమైన ప్రదేశానికి మధ్యార్జునం అని ఇంకొక పేరు కూడా వున్నదన్నాను కదా. ఆ పేరెలా వచ్చిందంటే, ఉత్తరంలో వున్న శ్రీశైల మల్లికార్జునికి, దక్షిణాన తిరునల్వేలి జిల్లాలో వున్న తిరుపుట్టైమరుదూరు కి మధ్యలో వుండటంతో దీనిని ఇటైమరుదూరు, మధ్యార్జునం అంటారు. అర్జునం అంటే మద్ది వృక్షం. తెల్ల మద్ది వృక్షం ఈ మూడు స్ధలాలలో స్ధల వృక్షం. ఈ మూడింటిలోనూ మధ్యలో వున్నది కనుక ఈ ప్రదేశానికి మధ్యార్జునం అనే పేరు వచ్చింది. శ్రీశైలంలో కూడా మీరు తెల్ల మద్ది వృక్షాలను చూడవచ్చు.
ఒకసారి అగస్త్య మహర్షి ఇతర మహర్షులతో కలిసి మధ్యార్జునానికి వచ్చి ఉమాదేవికోసం తపస్సు చేశాడు. ఆవిడ ప్రత్యక్షమైనప్పుడు, ఆవిడని ప్రార్ధించిన అగస్త్యుడు స్వామి దర్శనం కూడా ప్రసాదించమన్నాడు. అమ్మవారు వారికోరిక మన్నించి, శివుడికోసం తపస్సు చేసింది. శివుడు ఆవిడ కోరిక మన్నించి, ఆవిడకీ, ఋషులకీ ప్రత్యక్షమయ్యాడు. వారిముందు ప్రత్యక్షమైన తర్వాత శివుడు అక్కడవున్న జ్యోతిర్లింగాన్ని పూజించసాగాడు. ఆశ్చర్యపోయిన ఉమాదేవి శంకరుణ్ణి అడిగింది .. స్వామి, భక్తులూ, దేవతలూ మిమ్మల్ని పూజించాలిగానీ, మీరేమిటి మిమ్నల్ని మీరే పూజించుకుంటున్నారు అని. పూజించేవారమూ, పూజలు స్వీకరించేవారమూ మనమే. ఈ ఋషులు మనల్ని పూజించటం మరచిపోయారుగనుక మనని మనమే పూజించుకోవాలి. అందుకే ఇలా చేశాను అన్నాడు. ఆ రోజు నుంచి ఋషులు క్రమం తప్పక భగవంతుణ్ణి పూజిస్తున్నారు. ఇదే భగవంతుడికీ, భక్తుడికీ మధ్య అనుబందం. ఇది ఎడ తెగనిది. భక్తుల పూజలతో భగవంతుడికి శక్తి వస్తుంది, అలాగే భగవంతునికి చేసే పూజలతో భక్తుల న్యాయమైన కోర్కెలు తీరుతాయి. ఇంత మహత్తరమైన ఆలయాన్ని దర్శించటం మన అదృష్టం కదా. ఇప్పుడు ఇంకొక విశిష్ట ఆలయానికి తీసుకు వెళ్తాను పదండి.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)