వివేకానందుడి సింహావలోకనం అంతరార్థమిదే..!

 

వివేకానందుడి సింహావలోకనం అంతరార్థమిదే..!

మనుషుల ప్రవర్తనను గొట్టెలమంద మనస్తత్త్వంతో పోలుస్తారు. మొదటి గొట్టె ఏం చేస్తే మందలోని మిగతా గొట్టెలన్నీ అదే చేస్తాయి. దేనినైనా గ్రుడ్డిగా అనుసరించడం వలనే అనేక కష్టాలు వస్తాయని స్వామి వివేకానంద ఓ కథలో చెప్పినట్టు సింహం పిల్ల గొర్రెల మధ్య గొర్రెలాగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. 'వేదాంత సింహం' స్వామి వివేకానంద గొర్రెల్లాగా జీవిస్తున్న మానవాళిని 'మీరు సింహాలు!' అని సంబోధించి, వారి నిజస్వరూపాన్ని గుర్తుచేసారు.

సింహానికి ఉన్న ప్రత్యేక గుణం ఏమిటి? అడవికి రాజు 'సింహం'. రాజసం ఉట్టిపడే ఈ మృగరాజు ఎప్పుడూ వర్తమానంలో జీవిస్తుంది. అయినప్పటికీ తన సుదీర్ఘ పయనంలో అప్పుడప్పుడు వెనక్కు తిరిగి తను ఉన్న పరిస్థితిని పూర్తిగా ఆకళింపు చేసుకుంటుంది. ఈ ప్రక్రియను 'సింహావలోకనం' అని అంటారు. కానీ నేటి సమాజంలో అధిక శాతం వర్తమానానికి దూరమై, భూతకాలపు గోతులలో పడి ఆందోళన, మానసిక క్షోభలకు గురవుతున్నారు. చివరకు శరీరంలో చేవలేక, నిరుత్సాహ హృదయాలతో జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నారు. ఈ కోవకు చెందిన వారు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. వారి ఆలోచనలన్నీ నెగిటివ్ దృష్టికోణం నుండే ఉంటాయి. దీనినే 'brooding over the past' అని అంటారు.

కానీ 'సింహావలోకనం' దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఇది విశ్లేషణాత్మకమైన ఆలోచన ఇది పూర్తిగా పాజిటివ్ ఆలోచన. దేనికీ భయపడకుండా ధైర్యంగా, పట్టుదల విశ్వాసాలతో వర్తమానాన్ని ఎదుర్కొంటూ, గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా అప్రమత్తత కలిగి ఉన్న ధీమంతుల కార్యసాఫల్యానికి 'సింహావలోకనం' మకుటాయమానం. 

1897వ సంవత్సరంలో విదేశీ పర్యటన ముగించుకొని, మళ్ళీ తన పవిత్రమైన భారతభూమిపై కాలు పెట్టగలుగుతున్నానని వివేకానంద స్వామి మనస్సు ఆనందంతో పొంగిపోయి ఇలా అన్నారు “నేనిక్కడికి రాక ముందు నా దేశాన్ని ప్రేమించేవాడిని. ఇప్పుడు నా దేశపు గాలి, నీరు, ధూళి కూడా నాకు పవిత్రమూ, పూజ నీయమూ అయ్యాయి. నా మాతృదేశం ఇప్పుడొక మహాతీర్థ స్థానం." ఇది స్వామీజీ 'సింహావలోకనం'.

స్వామి వివేకానంద ఆలోచనా తీరును గమనించి అర్థం చేసుకుని భారతీయ పౌరులుగా ప్రతి ఒక్కరూ 'సింహావలోకనం' చేసుకొని, నేటి సమాజపు వాస్తవిక స్థితిగతులను తెలుసుకోవాలి. ఇది మన దేశ పురోభివృద్ధికి అత్యావశ్యకం. మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ అధిక శాతం భారతీయులు దీనిని ఒక నామమాత్రపు ప్రజాస్వామ్యంగా పరిగణిన్నారు. ఎందుకూ అంటే..  మన రాజ్యాంగాన్ని సరిగా రూపొందించుకోలేదా? 1949వ సంవత్సరంలో భారత రాజ్యాంగం ఆమోదం పొందడానికి ముందు దాన్ని గురించి వాదనలు, ప్రతివాదనలు, చర్చలు జరుగుతున్న రోజులవి. అప్పుడు డా॥ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని వివరిస్తూ తన అద్భుతమైన ఉపన్యాసంలో ఇలా అన్నారు. 'రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరచేవారు సరిగా లేనప్పుడు, ఆ రాజ్యాంగం సరిగా ఉపయోగపడదు. అదే విధంగా రాజ్యాంగం సరిగా లేకపోయినా, దానిని అమలుపరచేవారు సరైనవాళ్ళు అయినప్పుడు ఆ రాజ్యాంగం దేశాభివృద్ధికి తోడ్పడుతుంది.’ అని. 

ఈ సంగతి మనం మరచిపోయాం. 'ఆడలేక మద్దెల ఓడు' అనే ప్రవర్తనను మనం మార్చుకోవాలి. "మీలోని అనంత శక్తిని తట్టి లేపండి. లేవండి! నడుము బిగించి, హృదయ పూర్వకంగా ఆత్మసమర్పణతో, కార్య నిర్వహణకు దిగండి!" అన్న స్వామి వివేకానందుని పిలుపును నేటి భారతం అందుకోవాలి. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ ప్రేరణా వాక్యంగా తీసుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి, దేశము కూడా చైతన్యం అవుతుంది.

                                   ◆నిశ్శబ్ద.