కర్మలు చేయడం తప్పనిసరి ఎందుకు?
కర్మలు చేయడం తప్పనిసరి ఎందుకు?
"కర్మ చెయ్యమని నాకు హితం చెప్పావు. మరి బ్రహ్మజ్ఞానమే పరమోత్కృష్ట జీవితమని అంటున్నావు. కృష్ణా, కర్మకంటే జ్ఞానమే ప్రశస్తమని నీ అభిప్రాయమైతే, కర్మ చెయ్యమని నాకు ఎందుకు చెప్పావు?" అని భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడిని అడుగుతారు.
అందుకు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇది:
"అనాదినుండి ఈ రెండు విధానాలూ మనకు వస్తున్నాయి. సాంఖ్యులకు జ్ఞానయోగం, యోగులకు కర్మయోగం. కాని కర్మను చెయ్యకపోయినంత మాత్రం చేత పురుషుడికి నైష్కర్మ్యం సిద్ధించదు. ఈ జీవితంలో ఎవరూ క్షణమైనా పనిచెయ్యకుండా ఉండలేరు. ప్రకృతి గుణవశుడై, ప్రతివ్యక్తీ కర్మ చేస్తూంటాడు. కర్మ చెయ్యటం మానుకొని, అదే సమయంలో సదా కర్మనే స్మరిస్తూండే వాడు దేన్నీ సాధించుకోలేదు. పైగా అతడు నయ వంచకుడౌతాడు. ఎవడు మనస్సుచేత ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని, సంగరహితుడై, కర్మేంద్రియాలచే కర్మయోగాన్ని అనుష్టిస్తాడో వాడు విశిష్ఠుడు. కాబట్టి నువ్వు నియతమైన కర్మ ఆచరించు.
"నీకు కర్తవ్యం అనేది లేదని, నువ్వు ముక్తుడివి అనే రహస్యం నీకు తెలిసినా పరోపకారార్థం నువ్వు కర్మ చెయ్యవలసిందే. శ్రేష్ఠుడు ఏదేది ఆచరిస్తాడో సామాన్య ప్రజలు దాన్నే ఆచరిస్తారు. చిత్త శాంతి, ముక్తీ బడసిన శ్రేష్ఠుడు కర్మాచరణాన్ని మానుకొంటే, ఆ జ్ఞానమూ, శాంతీ బడయని ఇతరులంతా అతణ్ణి అనుకరిస్తారు. అంతట గందరగోళం ఏర్పడుతుంది."
"అర్జునా! చూడు, ముల్లోకాల్లో నేను పొందనిది. పొందవలసింది ఏదీ లేదు. అయినా నేను కర్మలోనే ప్రవర్తిల్లుతున్నాను. క్షణమైనా నేను కర్మలు చెయ్యకపోతే ఈ లోకులు నశిస్తారు. అమాయకులు సంగసహితులై ఎలా కర్మలను చేస్తారో, అలా వివేకవంతుడు సంగరహితుడై లోక సంగ్రహం మీద దృష్టిఉంచి కర్మలను ఆచరించాలి."
నువ్వు జ్ఞానివే అయినా, అజ్ఞుల శిశూచిత అమాయక విశ్వాసాన్ని చెదరగొట్టకు. అంతేకాదు నువ్వు వారి స్థాయికి దిగి ఒక్కోమెట్టుగా వారిని పైకి తీసుకురా. అని అంటాడు.
అది ఎంతో శక్తివంతమైన భావం. ఇదే భారతదేశానికి ఆదర్శప్రాయమైనది. ఇందుచేతనే గొప్ప గొప్ప తత్త్వజ్ఞులు సైతం దేవాలయాలకు వెళ్ళి. విగ్రహాలను పూజిస్తుంటారు. ఇది నయవంచకత్వం కాదు.
పైన అలా చెప్పిన తరువాత మళ్ళీ శ్రీకృష్ణుడిలా అంటాడు: "పరదేవతా భక్తులై, శ్రద్ధాన్వితులై ఆరాధించేవారు నిజానికి నన్నే (అవిధిపూర్వకంగా) పూజిస్తున్నారు."మానవుడి పూజలను అందుకొనేది భగవదవతారమూర్తే దేవుణ్ణి తప్పు పేరుతో సంబోధిస్తే అతడు ఆగ్రహిస్తాడా? అయితే, అతడు దేవుడే కాడు! మానవుడు తన హృదయ పీఠం మీద దేన్ని అధిష్టింపచేసుకొంటాడో, అదే దైవం అనే విషయం మీరు గ్రహించలేరా? అతడు రాయిని పూజించినా సరే. దాని వల్ల తప్పేమిటి!
మతం సిద్ధాంతాల్లో ఉంటుందనే భ్రమను దులిపివేసుకొంటే, మనకు ఈ విషయం మరింత స్పష్టమౌతుంది. ఆదాం ఆపిల్ పండును తినటంవల్ల ఈ లోకమంతా పుట్టిందనీ, ఇక్కణ్ణుండి తప్పించుకొనే దారి లేదనీ ఒక మతాశయం. జీససు క్రైస్తును నమ్ము. ఫలానా మానవుడి మరణాన్ని నమ్ము! భారతీయుల అభిప్రాయం దీనికంటె పూర్తిగా భిన్నమైనది. అక్కడి వారికి మతమంటే సాక్షాత్కారమే. మరేమీ కాదు. ఒకడు నాలుగు గుర్రాల బండిమీద వెళ్ళవచ్చు, ఒకడు విద్యుత్ శకటంలో పోవచ్చు, ఒకడు వీథిలో దొర్లుకుంటూ పోవచ్చు. గమ్యమేమో అందరికీ ఒక్కటే. భయంకరుడైన దేవుడి ఆగ్రహానికి గురికాకుండా తప్పించుకోవటం ఎలా అనేది క్రైస్తవుల సమస్య. కోల్పోయిన ఆత్మ తత్త్వాన్ని తిరిగి పొందటం ఎలా? పారమార్థిక స్వరూపాన్ని పొందటం ఎలా? అనేది భారతీయుల సమస్య. అంటే వేరు వేరు వ్యక్తులు, వేరు వేరు మతాలు వేరు వేరు నమ్మకాలు కానీ అందరి గమ్యం మాత్రం ఒకటే….. ఆ గమ్యం వైపు వెళుతూ వ్యక్తి కర్మలు చేయాల్సిందే.
◆నిశ్శబ్ద.