కుంభకోణం యాత్ర – 15

 

 

 

కుంభకోణం యాత్ర – 15

పళయరాయ్ వడతలి సోమేశ్వరార్

 


                                                                                                             

ఆటోలో బయల్దేరాము.  దోవలో ఇంకేమైనా ఆలయాలు వున్నా చూపించమన్నాము.  అతను అదే పోత పోతున్నాడు కానీ ఆలయాల విషయంలో మాత్రం నా చూపులన్నీ వాటికి సంబంధించిన బోర్డుల మీదే వుంటాయి.  అందుకే ఆ చిన్న బోర్డు నా కళ్ళబడింది.  అదే ధర్మపురీశ్వరార్ కోవెల.  నాకెలా తెలిసిందనకండి. నాకు తమిళం రాదని మీకు తెలుసని నాకూ తెలుసు.  బోర్డు ఇంగ్లీషులో వుండి వుండాలి, లేకపోతే బోర్డు మీద ఆలయం గుర్తు వుంటే నేను అర్జంటుగా ఆటో ఆపేసి వుంటాను.  ఇప్పుడు గుర్తులేదు.  

 

మా ఆటో అతను అక్కడికీ దాని టైమయిపోయిందని ఒకసారీ, అది చిన్న ఆలయం, అది చూస్తూవుంటే మిగతావి మూసేస్తారని ఒకసారీ మొత్తానికి దాటేసే ప్రయత్నం చేశాడు.  కానీ చూడని ఆలయం కనబడితే వదిలేసే పాపపు పని నేను చెయ్యను.  ఇంతా చేస్తే ఆ సందులో చాలా దగ్గరలోనే వుంది ఆలయం.  ముందంతా చెట్లు.  లోపల ఆలయం వున్నది.  కానీ బయట గేట్ మూసేసి, తాళం వేసి వున్నది.  ప్రాంగణం శుభ్రంగానే వున్నది.   సరే బయటనుంచే ఒక ఫోటో తీసుకుని మళ్ళీ బయల్దేరాము.  

 

 

 

ఆటో అతను అప్పటికి శాంతించి చెప్పాడు, ఇది చిన్న ఆలయం, ఎక్కువమంది రారు.  సోమేశ్వరానికి ఎక్కువమంది వస్తారు.  అది 12 అయితే మూసేస్తారు.  మీరు దారాసురం చూడలేరు అన్నాడు.  దారాసురం మూసి వున్నా పర్వాలేదు.  అది పెద్ద ఆలయం.  ఎక్కడో అక్కడ కాసేపు కూచుందాము.   బేగ్ లో ప్రసాదాలు, మంచి నీళ్ళు వున్నాయి, ఆకలి వేస్తే ఇబ్బంది లేదు.

 

 

పట్టీశ్వరంనుంచి 2 కి.మీ.ల దూరంలో, దారాసురంనుంచి 3 కి.మీ.ల దూరంలో, కుంభకోణం – ఆవూరు రోడ్ లో వున్నది సోమేశ్వర ఆలయం.  8 – 9 శతాబ్దాలలో చోళ రాజుల నిర్మాణం. సోమేశ్వరుని గురించి 7వ శతాబ్దంలో తమిళ శైవ కవులు రచించిన తేవరాలలో స్తుతించబడింది.  స్తుతించిన నాయనార్ లు అప్పార్, సంబందార్, సుందరార్.  63 నాయనార్ లలో ఒకరైన మంగయార్ కరసియార్ జన్మస్ధలం ఇదంటారు.

 

ఒక కధ ప్రకారం చంద్రుడు ఇక్కడ శివుణ్ణి పూజించి, ఆయన దర్శనాన్ని పొందాడుట.  ఇంకొక కధ ప్రకారం విష్ణు వాహనం గరుడుడు తన తల్లికోసం అమృతాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు రాక్షసులు అడ్డుపడ్డారుట.  ఆ సమయంలో అమృత భాండంనుంచి మూడు చుక్కల అమృతం ఇక్కడ పడి శివ లింగంగా, అమ్మవారిగా, తీర్ధంగా మారాయి.  గరుక్మంతుడు ఆ తీర్ధంలో స్నానం చేసి రాక్షసులను జయించాడు.  ఆ తీర్ధాన్ని జడాయు తీర్ధం అంటారు.

 

 

ఈ ఊరు (పళయరాయ్) చోళ రాజుల రాజధానులలో ఒకటి  క్రీ.శ. 871 – 907 మధ్య ఆదిత్య చోళుడు తిరుపరంబియమ్ యుధ్ధ విజయానికి చిహ్నంగా కావేరీ నది ఒడ్డున నిర్మించిన అనేక ఆలయాలలో ఇదొకటి. ఆలయ రాజ గోపురం 12 – 13 శతాబ్దాలలో చోళులచే నిర్మింపబడిందంటారు.  ప్రస్తుతం శిధిలావస్తలో వున్నది.  చుట్టూ గోడ గ్రనైట్ తో కట్టబడింది. సోమేశ్వర ఆలయం లోపల ఇదివరకు చూసిన ఆలయాలలోలా గొప్ప శిల్పాలు లేవు.

 

 

 

అమ్మ సోమేశ్వరికి ఆలయం ముందు ప్రత్యేక ఆలయం వుంది.  ఈ ఆలయం ముందు అరుగునుంచి నేలదాకా వున్న గోడమీద నరసింహ స్వామి ప్రహ్మాదుడికి ప్రత్యక్షమవటం, హిరణ్యకశిపుణ్ణి చంపటం వగైరా శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ ఆలయంలో నిత్య పూజలు, సోమవారం, శుక్రవారం వగైరా వార పూజలు, పక్ష పూజలేకాక ఏప్రిల్ – మేనెలలలో (తమిళ మాసం చత్తిరై)లో బ్రహ్మోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది.

 

రాజరాజ చోళుడి బాల్యం ఇక్కడే గడిచిందంటారు.  తంజావూరుకన్నాముందు ఇది చోళరాజుల రాజధాని. రాజ రాజ చోళుడు బాల్యంలో ఈ ఆలయానికి రోజూ వచ్చేవాడుట.  ఇంత చారిత్రాత్మక ప్రాముఖ్యతవున్న ఈ ఆలయం సరిగా పరిరక్షింపబడలేదని అక్కడివారికి కొంత బాధ వున్నది.  1962లో ప్రభుత్వం  శ్రధ్ధ తీసుకుని కొంత బాగు చేయించింది.

 

కుంభకోణానికి 6 కి.మీ. ల దూరంలోనే వున్న ఈ ఆలయం గురించి మిగతా వాటి గురించి తెలిసినట్లు ఎక్కువ మందికి తెలియదనీ, అందుకే ఇక్కడికొచ్చే భక్తుల సంఖ్య తక్కువనీ, ఇక్కడివారు అంటారు.  పురాతనంగా ప్రసిధ్ధి చెందిన ఆలయాలు ఇప్పుడు వెలాతెలా పోతుంటే, అవి ఎక్కడున్నాసరే నేనూ అదే బాధ పడతానండీ.  అంతేకాదు..వాటి గురించి అందరికీ తెలియజేయాలని తాపత్రయ పడతాను.  

 

ఇక్కడే కాదు.  మన దగ్గర కూడా తమలో ఎన్నో గాధలు నింపుకున్న తర తరాల ఆలయాలు, సరైన ఆదరణ లేక దిక్కూ మొక్కూ లేనట్లున్నాయి.  అందుకే మనమందరం రోజూ సమీపంలో వున్న ఆలయానికి వెళ్ళటం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.  ఏమంటారు?  

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)