కుంభకోణం యాత్ర – 16
కుంభకోణం యాత్ర – 16
ఐరావతేశ్వరాలయం
కుంభకోణంనుంచి 3 కి.మీ.ల దూరంలో దారాసురంలో వున్న ఐరావతేశ్వరాలయం రాజరాజచోళుడు-II నిర్మించినది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్. ఇంత దూరంనుంచి చూస్తుంటేనే చాలా బాగుందికదూ. చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ. ముందు గోతిలో వున్నట్లు చిన్న మండపం. ఎందుకిట్లా గోతిలో కట్టారో. ఆలయం విమానం ఎత్తు 85 అడుగులు. ఆలయం గుర్రాలు లాగుతున్న రధంలాగా వుంది చూశారా? శిల్ప కళా వైభవాన్ని ఇక్కడ చూడచ్చు
చోళులు 10 – 12 శతాబ్దాలలో నిర్మించిన అపురూప ఆలయాలు మూడు .. తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురంలో గంగైకొండ చోళేశ్వరాలయం, దారాసురమ్ లో ఐరావతేశ్వరాలయం. ఈ మూడూ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్సే. దారాసురమ్ లో ఐరావతేశ్వరాలయం మిగతా వాటి అంత పెద్దది కాక పోయినా వాటికీ దీనికీ పోలికలుంటాయి. ఈ ఆలయం ముఖ ద్వారం తూర్పుగా వుంటుంది. ప్రదక్షిణ బయటనుంచే చెయ్యాలి. గర్భగుడి లోపల ప్రదక్షిణ మార్గం లేదు. ఇక్కడ వున్న శిలా శాసనం ప్రకారం ముందు మండపం పేరు రాజ గంభీరన్ తిరు మండపం.
ఇంక స్ధల పురాణం ఏమిటంటే...
ఇంద్రుడి వాహనం ఐరావతం స్వఛ్ఛమైన శ్వేత వర్ణంలో వుంటుంది. పూర్వం దూర్వాస మహాముని శాపం వల్ల ఆ రంగు మారటంతో ఐరావతం ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి, శివుణ్ణి సేవించి, తన శాపాన్ని పోగొట్టుకున్నదట. ఐరావతం మీద ఇంద్రుడు వున్న విగ్రహం ఆలయంలో వున్నది. యమధర్మరాజు కూడా ఇక్కడ శివుణ్ణి సేవించాడని అంటారు. ఆయనకి ఒక మునీశ్వరుడి శాపం వల్ల శరీరమంతా మంటలతో బాధపడ్డాడు. ఆయన ఇక్కడ తీర్ధంలో స్నానం చేసి, శివుణ్ణి పూజించి ఆ శాపంనుంచి విముక్తి పొందాడు. అప్పటినుంచీ ఆ తీర్ధం యమతీర్ధం అయింది. దీనిలోకి నీరు కావేరి నది నుంచి వస్తుంది. భక్తులు ఇక్కడ స్నానం చేసి స్వామిని సేవించి తరిస్తారు.
ఆలయ గోడలమీద వున్న శిలా ఫలకాల ద్వారా పూర్వం ఈ శివుణ్ణి రాజరాజేశ్వరన్ అనీ, ఈ స్ధలాన్ని రాజరాజపురమనీ అనేవారు.అమ్మ దేవనాయకి. ముందు మండపంలో ఉపాలయంలో వుంటుంది. ఆలయం బయట ప్రాకారానికి అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి. వీటిలో పురాణగాధలేకాక భరత నాట్య భంగిమలు, జిమ్నాస్టిక్స్ వగైరా అనేక శిల్పాలున్నాయి. పై కప్పుమీద తామర పువ్వులో శివ పార్వతుల అద్భుత శిల్పం చెక్కబడివుంది.
ఈ శిల్పాలవల్ల అప్పటి ప్రజల జీవన విధానం, పూర్వం గ్రామాలలో పరిస్ధితులుకూడా కొంత మటుకు తెలుసుకోవచ్చు. రావణుడు కైలాస పర్వతాన్ని పెకిలిస్తున్నట్లు చెక్కిన అద్భుతమైన శిల్పం. బుధ్ధుడు, భిక్షాటన మూర్తి, వీణ లేకుండా సరస్వతి, అర్ధనారీశ్వరుడు, బ్రహ్మ, సూర్యుడు, ఇంకా అనేక పౌరాణిక గాధలు .. ప్రతి ఒక్క శిల్పమూ అద్భుతమైన శిల్ప కళా చాతుర్యానికి నిదర్శనమే. చోళుల శిల్పకళా ప్రాభవానికి చక్కని ఉదాహరణే.
ఆ సమయంలోనే శైవుల ప్రాముఖ్యం తగ్గి, శరభేశ్వరుడు ప్రాభవంలోకొచ్చాడు. శరభేశ్వరుడు సింహం తల, పక్షి శరీరం, ఒడిలో నరసింహుడు. దీనికి గుర్తుగా ఆలయం గోడలో బయటవైపు ఆయనకీ ఒక మండపం వున్నది. ప్రవేశ ద్వారంలో వున్న ద్వార పాలకులు శంఖనిధి, పద్మనిధి చక్కని శిల్పాలు. ఆలయం ముందు ఒక చిన్న మండపం గొయ్యిలో వున్నట్లుంటుందన్నాను కదా. ఆ మండపానికి వున్న మెట్లు చిన్నగా కొడితే సప్త స్వరాలు పలుకుతాయట. అయితే ప్రస్తుతం మనం ఆ శబ్దాలను వినే అవకాశం లేదు. అక్కడికి వచ్చే ప్రజలనుంచీ వాటిని కాపాడటానికి ఆ మండపం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎవరూ వెళ్ళకుండా చేశారు.
ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఈ ఆలయంలో తప్పనిసరిగా గైడ్ పెట్టుకోండి. అక్కడే వుంటారు. సాధారణంగా వాళ్ళే టూరిస్టులను వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళు కొంతమటుకైనా వివరంగా చెబుతారు. మనం ఏదో చూస్తాము, కొన్ని శిల్పాలని గుర్తుపడతాము, శిల్పం బాగుందని వచ్చేస్తాము. గైడ్ వీలయినంత పౌరాణిక, చారిత్రక, సాంఘిక వివరాలు చెబుతాడు. మీకు నచ్చిన శిల్పాల గురించి, అతను చెప్పక పోయినా మీరు అడిగి తెలుసుకోండి.
ఇంకొక్క విషయం మరచి పోవద్దు. ఇక్కడికి ఆదరాబాదరాగా వెళ్ళి శివుడికి దణ్ణం పెట్టుకుని వచ్చెయ్యద్దు. కొంత సమయం కేటాయించి నెమ్మదిగా అక్కడి శిల్పాల సోయగాలు చూడండి. మరి మనం పెట్టుకున్న గైడ్ అన్నీ చూపించానని చెప్పి వెళ్ళిపోయాడుకదా. మనకిప్పుడు విశ్రాంతి సమయం. ఈ సమయంలో వేరే ఆలయాలేమీ తీసి వుండవు. కనుక ఇక్కడే కొంచెం సేపు కూర్చుని, ప్రసాదం తిందాము. తర్వాత మళ్ళీ ఇంకొకసారి తీరిగ్గా అన్ని శిల్పాలు చూద్దాం.
ఆ అబ్బాయి ఏమిటి బయట గేటు వేస్తాం బయటకి వెళ్ళండి అంటాడు. అతను భోజనానికి వెళ్ళాలేమో. పూజారిగారు ఇటే వస్తున్నారు. అడుగుదాం. ఏం పర్వాలేదు. పూజారిగారు చెప్పారు. లోపల గుడి తలుపులు వేస్తాముగానీ, బయట గేటు వేసినా చిన్న గేటు తీసి వుంటుంది. పూర్తిగా వెయ్యము అని. ఏం పర్వాలేదు. ఇక్కడే కూర్చుందాము. అంతగా గేటు వేశారనుకోండి, సాయంత్రం 4 గం. లకి వచ్చి మళ్ళీ తీస్తారుగా. అప్పుడు బయటకెళ్దాము.
గేటూ వెయ్యలేదు ఏమీ లేదు. జనం ఇంకా వస్తున్నారు. పాపం వాళ్ళకేమీ తెలియక అలా వెళ్ళిపోతున్నారు. మనకి తెలిసినంతమటుకూ మనం చెబుదాము. ఆ ముంబాయినుంచి వచ్చిన గ్రూప్ ఎంత సంతోషించారో మనం చెప్పినవి చూసి. అదేనర్రా. కొన్ని చోట్ల మనకి తెలియక కొన్ని విశేషాలు చూడకుండా వచ్చేస్తాము. తర్వాత తెలిస్తే, మాకు తెలియలేదు, మేము చూడలేదు అని బాధ పడతాము. అందుకే మనకి తెలిసిన విశేషాలు ఇతరులకి చెబితే ఆసక్తి వుంటే వాళ్ళూ చూసి సంతోషిస్తారు. లేకపోతే లేదు. మనకి పోయేదేమీలేదుకదా. అమ్మ పెరియనాయకికి పెద్ద ఆలయమే వున్నది పక్కనే. అయితే దానిలో ఇంత శిల్ప విన్యాసం లేదు.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)