Read more!

కుంభకోణం యాత్ర – 14 (తిరుసతిముత్రం)

 

కుంభకోణం యాత్ర – 14 తిరుసతిముత్రం
                                     

                                            

బోనస్ దొరికిందికదా.  హుషారుగా అడుగులు వెయ్యండి.  ఇంకెంత దూరం వుందో అంటారా?  ఆవిడ చెప్పారు కదా.  ఆటో అక్కరలోదు, నడిచి వెళ్ళచ్చని.  చూద్దాం.  దుర్గ గుడినుంచి నేరుగా వెళ్ళమన్నారు.  అంటే అదే .. ఆ రోడ్ లో వెళ్ళాలి.  ఇక్కడెవరో వున్నారు.  అడుగుదాం వుండండి .. మనం సరైన దోవలోనే వెళ్తున్నామో లేదో.  ఆ .. ఆ .. ఇటే వెళ్ళాలిట.  ఇంకొంచెం ముందు ఎడమవైపు సందు తిరగాలిట.  అదిగో అక్కడ గోపురం కనబడుతున్నది.  బహుశా అదే అయివుంటుంది.  పదండి.  అదిగో వీళ్ళూ చెబుతున్నారు.  అదేట.  ఎక్కువ దూరం లేదు కదా.  ఇదివరకు వచ్చినప్పుడు ఇంత దగ్గరలో ఈ ఆలయం వున్నదని తెలియలేదు.  సరే ఇప్పుడన్నా తెలిసింది.  సంతోషం.  పదండి.  అంతా చూద్దాం.

 

ఇది మరీ పెద్ద ఆలయమేమీ కాదు.  నేరుగా లోపలకెళ్దాం.  అదిగో శివలింగం.  పూజారిగారు లేరే.  సరే, మనకి అలవాటయిందికదా, తెచ్చిన పూలదండ ఇక్కడే పెడదాం.  పూజారిగారు వచ్చాక దేవుడికి పెడతారు.  మిగతావి చూద్దాం పదండి.  ఇదేమిటి  ఈ ఉపాలయంలో శివ లింగాన్ని కౌగిలించుకుని పార్వతీ దేవి వున్నది.  పూజారిగారు వచ్చారు.  ఇది చాలా విశేషమైన ఆలయం అన్నారుకదా.  పూజ చేయించుకుందాము.  పూజ అయింది.  పూజారిగారు వేరే వారికి పూజ చేయించే హడావిడిలో వున్నారు.  మీరు ఆలయం చుట్టూ తిరిగి ఏమి వున్నాయో చూసి రండి.  ఈ లోపల నేను ఆలయ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.

చుట్టూ చూసొచ్చారా  రండి.  కూర్చోండి.  ఆలయం గురించి చెబుతాను.
పూర్వం పార్వతీ దేవి ఇక్కడ తపస్సు చేసిందిట.  పట్టీశ్వరంలో కూడా పార్వతి తపస్సు చేసిందని చెప్పారు కదా.  అక్కడ శివుడు తొందరగా కరుణించినట్లున్నాడుగానీ, ఇక్కడ ఆవిడ శ్రధ్ధా భక్తులను పరీక్షించ దలచి తొందరగా ప్రత్యక్షం కాలేదుట.  అదేమిటి ఆవిడ ఆయనలో సగ భాగం కదా ఇంకా పరీక్షలేమిటి అని అంటారా?  ఇవ్వన్నీ వాళ్ళకోసం కాదు.  మనలాంటివారికోసం వాళ్ళు ఆచరించి చూపిస్తారు.  మనం దణ్ణం పెట్టగానే దేవుడు కరుణించలేదని ఆయన మీద అలగక, ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి మనం ఆయనకి ప్రీతికరమైన విధంగా నడుచుకోవాలి.  

 

సరే కధలోకి వద్దాము.  ఆయన తాత్సారం చెయ్యటానికి కారణం తెలుసుకున్న పార్వతీ దేవి తన తపస్సు తీవ్రతను పెంచింది.  ఒంటికాలిమీద నుంచుని తపస్సు చేసింది.  శివుడికీ సరదా వేసింది.  ఆయన పార్వతీదేవి ముందు ప్రత్యక్షమైనాడుకానీ, అదెలా ప్రత్యక్షమయ్యాడంటే అగ్ని జ్వాలలాగా ప్రత్యక్షమయ్యాడు.  పార్వతి మాత్రం తక్కువ తిన్నదా?  ఆ ప్రత్యక్షమైన జ్వాల పరమ శివుడే అని గ్రహించి దానిని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నదట.  వెంటనే శివుడు లింగం రూపంగా మారాడు.  వారి ఆ భంగిమ ఇక్కడ వున్నది.   స్వామి శక్తి వనేశ్వరార్ అయితే, అమ్మవారు స్వామిని కౌగలించుకుంది గనుక క్షేత్రం తిరుసతిముత్రం అయింది.

ఇక్కడ పూజ ఈ విగ్రహానికే, మూల విరాట్ కి హారతిస్తారు.
ఆలయానికి రెండు ప్రాకారాలున్నాయి.  మొదటి ప్రాకారంలో వల్లభ గణపతి, వసంత మండపం, నందీశ్వరుడిని చూశాం కదా మనం వస్తుండగా.  రెండవ ప్రాకారంలో వినాయకుడు, మురుగన్, నృత్యమండపం, అమ్మవారు, సోమస్కందార్ వగైర ఉపాలయాలను చూడవచ్చు.  అమ్మ పెరియనాయకి ఉపాలయంలో కొలువు తీరింది.

 

పట్టీశ్వరానికీ, దీనికీ ఎక్కువ దూరం లేకపోయినా అది వేరే ఊరు, ఇది వేరే ఊరు.

క్రీ.శ. 1000 లో ఉత్తమ చోళుడి తల్లి సెంబియన్ మాదేవి ఈ ఆలయాన్ని రాతితో నిర్మింపచేశారు.  రాజరాజ చోళుడు II, కుళోత్తుంగ చోళుడు III, విజయనగర రాజులు రాయించిన శాసనాలు ఇక్కడ వున్నాయి.  అంటే వీరంతా కూడా ఈ ఆలయ అభివృధ్ధికి దోహద పడ్డారన్నమాట.  నాయనార్ లలో అప్పార్ ఈ దైవం గురించి స్తుతి చేశారు.

 

విశేషాలు
అవివాహితులు మంచి సంబంధం రావటానికి ఇక్కడ పూజలు చేస్తారు.  అంతేకాదు, ఉద్యగ రీత్యా విడిగా వున్న భార్యా భర్తలుకానీ, స్పర్ధలు వచ్చినవారు, విడాకులు వగైరా ఏ కారణం వల్లనైనా భార్యా భర్తల మధ్య సఖ్యత లేకపోతే ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తే వారి మధ్య సామరస్యం కుదురుతుందిట.  ప్రత్యేక పూజలంటే భార్యా భర్తలు ఇరువురుకానీ, వీలుకాకపోతే ఒకరు గానీ, ఆలయం శుభ్రం చేసి, స్వామికి అభిషేకం చేసి, వస్త్రాలు సమర్పించుకుంటే వారి ఇబ్బందులు తొలగి పోతాయి అని భక్తుల నమ్మకం. ఇందాక చెప్పానుకదా.  తిరు జ్ఞాన సంబంధార్ ఇక్కడనుంచే పట్టీశ్వరానికి వెళ్ళేటప్పుడు శివుడు ఆయన మీద అంత కరుణ చూపించాడు. అందుకే, ఆ సంఘటనకి సంబంధించిన ముత్తు పండాల్ ఉత్సవం ఊరేగింపు ఇక్కడనుంచే ప్రారంభమవుతుంది.

ఇంక బయల్దేరండి.  బయటకెళ్ళి చూద్దాము. దారాసురం ఇక్కడికి దగ్గరే.  వీలయితే అది చూస్తే ఈ పక్కవి అయిపోతాయి. ఆటో వుంది.  అడుగుతానుండండి.  ఇందాక గుళ్ళో ఆవిడ చెప్పింది, దారాసురం వెళ్లే లోపల కీల పళయార్ సోమేశ్వరార్ ఆలయం వున్నదని.  అదీ ఇంకేమన్నా దోవలో వుంటే చూపించి దారాసురంలో దింపేయటానికి రూ. 130 అడుగుతున్నాడు.  వెళ్దాం పదండి.  మనకు సమయం కూడా ముఖ్యం.

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)