Narada's Dream

 

నారదునికి జరిగిన అవమానం

Narada's Dream

 

సభామండంపంలో ఉన్నవారి వీనులకు లయబద్ధమైన సవ్వడి వినిపించింది. అది రాకుమారి నడుస్తున్నప్పుడు ఆమె కాలి అందియల నుండి వచ్చిన సవ్వడో, లేదా ఆమె వస్తున్నదన్న ఆనంద పారవశ్యంతో స్వయంవరానికి వచ్చినవారి గుండెలు మరింత వేగంగా కొట్టుకోగా వచ్చిన ధ్వనో వాళ్ళకు అర్థం కాలేదు. ఇక నారదునికైతే తండ్రి ఆనతి మేరకు రమాదేవి తనవైపు కదలిరావడం ఒక్కటే కనిపించింది. అతని మనస్సంతా ఊహాప్రపంచంలో తేలి యాడిపోతోంది....

 

ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ సరాసరి నారదుని దగ్గరకే వస్తోంది. రావడమేమిటి? ఆ చేతిలోని వర(విరి)మాలను ఏమాత్రం ఆలోచించకుండా మెడలో వేసెయ్యడమేమిటి.. అంతా క్షణంలో జరిగిపోయింది.

 

పట్టలేని ఆనందంతో ఆమె మృదువైన కరకమలాన్ని తన చేతిలోకి తీసుకుని వెంట తీసుకుపోయేందుకు ప్రయత్నించాడు నారదుడు. ఇంతలో ''వదులు ... వదులు'' అన్న పెనుగులాటతో నారదుడు బాహ్యస్మృతిలోకి వచ్చాడు. అప్పటికే రాజులందరితోపాటు వారి మధ్యలో కోటి సూర్యప్రభాసమానుడై వెలుగొందుతున్న శ్రీమహావిష్ణువును రమాదేవి చూడడం, పులకించిన మదితో తన హృదయనాథుడైన శ్రీహరి గళసీమలో పుష్పమాలను అలంకరించడం జరిగిపోయింది.

 

వెంటనే విష్ణువు తన వాహనమైన గరుడునిపైన ఈమెను ఎక్కించుకుని వైకుంఠానికి తరలిపోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు నారదుడు, తన పక్కనున్న రాకుమారుని చేయి పట్టుకుని తీసుకుపోయేందుకు ప్రయత్నించగా వదలమని కేకలు వేసింది అతనే.

 

ఈ దృశ్యం చూసి అక్కడ ఉన్నవారంతా పకపకా నవ్వసాగారు. ఆ నవ్వుతో నారదుడు తాను చేసినదేమిటో గ్రహించి సిగ్గుపడి తలవంచుకుంటాడు. అయినప్పటికీ రాజులు నవ్వు ఆపకపోవడంతో ఎందుకు నవ్వుతున్నారంటూ కోపంగా ప్రశ్నించాడు.

 

''నీ శరీరాకృతి చూసేందుకు శ్రీహరిలా కనిపిస్తున్నప్పటికీ ముఖం మాత్రం ఎలుగుబంటును, కోతిని పోలివుంది. ఇక నిన్ను చూసి నవ్వక ఏం చెయ్యమంటావు?’’ అని ఎదురు ప్రశ్నించారు.

 

అంతే! తనకు జరిగిన ఘోరమైన ఈ అవమానానికి ఏం చెయ్యాలో తెలియక, తోకతొక్కిన తాచులా కూర్చున్న చోటునుంచి సర్రున లేచి అక్కడినుంచి కోపంతో వైకుంఠానికి బయల్దేరి వెళ్ళాడు.

 

వైకుంఠంలో రమాదేవితో ఉన్న విష్ణువును చూడగానే నారదుడి కోపం నషాళానికి అంటింది. ఇక వేరే ఏమీ ఆలోచించకుండా ఉక్రోషం, ఉద్వేగంతో ఊగిపోతూ గద్గదస్వరంతో ఇలా చెప్పడం ప్రారంభించాడు.

 

ఇంకా ఉంది.....

 

shiva purana part 8, Narada's dream in shiva purana, brahma vishnu and maheswara in Shiva Purana, auspicious shiva purana telugu, shiv purana in 18 epics, shiv purana and salvation