Read more!

Narada's Temptation in Shiva Purana

 

రాజకన్యను మోహించిన నారదుడు

Narada's Temptation in Shiva Purana

 

వైకుంఠం నుంచి భూలోకం వచ్చిన నారదునికి లోపల మాత్రం గర్వం పోలేదు. తన మాటను అంగీకరించి ఎంతగానో ప్రశంసిస్తారని భావించిన త్రిమూర్తులు ముగ్గురూ ఒకరకంగా హెచ్చరికలు లాంటివే చేసి పంపించారు. అది నారదునికి రుచించలేదు. అహం కారణంగా నారదుడు ఆ విషయాన్ని సవ్యమైన రీతిలో జీర్ణించుకోలేదు. దాంతో చాలా అసహనం కలిగింది. ఎంత ముక్కు మూసుకుని అడవుల్లో తపస్సు చేసుకునే మహర్షినైనా అహం అనేది ఆవహిస్తే ఇలానే ఉంటుంది అని నారదుని పరిస్థితి మరోసారి నిరూపించింది. తరతమ విచక్షణ, జయాపజయాలతో పనిలేని కాలం దాని పంథాలో అది గిరగిరా సాగిపోతోంది.

 

భూలోకంలో కళ్యాణపురం అనే ఒక పట్టణం ఉంది. సస్యశ్యామలమై దేనికీ కొరత లేకుండా ఉన్న ఆ పట్టణంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు. ఆ పట్టణ రాజుకు అతిలోక సౌందర్యరాశియైన ఒక కూతురు ఉంది. ఆమె పేరు రమాదేవి. సృష్టిలోని అందాన్నంతా రాశిపోసి, బ్రహ్మ ఆ ఒప్పులకుప్పను సృష్టించాడేమో అనిపించేలా ఉంటుందామె.

 

దానికి తగినట్టుగా ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. పున్నమి చంద్రునిలాంటి ముఖారవిందంతో, నిండైన ఒంపుసొంపులతో ఆమె మగవారినే కాదు స్త్రీలను కూడా చూడగానే ఆకర్షిస్తుంది. ఒకసారి ఆమెను చూసినవారెవరైనా మరోసారి చూడకుండా ఉండలేనంత గొప్ప అందం ఆమెది.

 

అలాంటి రమాదేవికి స్వయంవరం చాటించాడు రాజు. అయితే రమాదేవి మాత్రం తన మనస్సును ఏనాడో శ్రీమన్నారాయణుడికి అంకితం చేసింది. లోకాలను యేలే లోకేశ్వరుడినే పెళ్ళి చేసుకోవాలన్న గట్టి తలంపుతో ఉందామె.

 

ఇలా ఉండగా, కల్యాణపురం రాజు కూతురి పెళ్ళికోసం స్వయంవరం చాటి౦చాడన్న విషయం నారదునికి తెలిసి అక్కడికి వచ్చాడు. నారద మునీంద్రుని చూసిన రాజు సింహాసనం దిగివచ్చి ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో గౌరవించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి సకల మర్యాదలు చేశాడు. యవ్వనవతి అయి పెళ్ళికి సిద్ధంకాబోతున్న తన కూతురిని పిలిచి ఆశీర్వదించమని నారదుని అర్ధించాడు రాజు. ఆమె కదలివస్తుంటే శతకోటి మయూరాలు తరలి వస్తున్నాయా అనిపించింది. ఆమె ప్రతీ కదలికలోనూ ఏదో తెలియని ఆకర్షణ ఉంది.

 

ఇంద్రియాలను నిగ్రహించడంలో నా అంతవాడు లేడని విర్రవీగుతున్న నారదుని మనస్సు ఒక్క నిమిషం ఈమెను చూడగానే చలించిపోయింది. సంయమీంద్రునిగా పేరుపొందిన నారదుడు ఈ లావణ్యవతిని చూడగానే తబ్బిబై పోయాడు. రెప్పవాల్చకుండా ఆమె అందాన్ని జుర్రేస్తున్న నారదుణ్ణి వింతగానూ, భయంగానూ చూసిందామె.

 

రాజు కూడా ముని ప్రవర్తనకు ఒకింత సిగ్గుపడుతూ ''స్వామీ! మా అమ్మాయిని మీరు నిండుమనస్సుతో మంచి వరుడు దొరకాలని ఆశీర్వదించండి. సర్వసంగ పరిత్యాగులయిన మీలాంటి యోగులు దీవిస్తే అది తప్పక ఫలిస్తుం ది’’ అన్నాడు.

 

ఆ మాటతో ఉలిక్కిపడ్డ నారదుడు – ''రాజా! మీ అమ్మాయి అందానికి నేను ముగ్ధుడనైపోయాను. ఆ వివశత్వం నుంచి బయటకు రాలేకుండా ఉన్నాను. వరుడికోసం స్వయంవరం ఎందుకు? నీవు ఇ ష్టపడితే నేనే ఈమెను పెళ్ళి చేసుకుంటాను’'' అన్నాడు.

 

అందుకా రాజు ముందు ఆశ్చర్యపోయినా, దాన్ని ముఖంలో కనిపించనీయకుండా ''మునీంద్రా! మీరు అన్నది సబబుగానే ఉంది. స్వయంవరం ఎలానూ చాటించాను కదా. రేపు మీరూ దానికి హాజరుకండి. అప్పుడు నా కూతురు ఒకవేళ మిమ్మే వరించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. నా కూతురు రమాదేవి శ్రీహరిని బాగా ఇష్టపడుతోంది. ఎలాగైనా ఆయన్నే పెళ్ళి చేసుకోవాలని భావిస్తోంది. మరి తన అదృష్టం ఎలా ఉందో.. ఈ స్వయంవరం తేల్చేస్తుంది. కనుక అక్కడికి రండి’' అని వినయంగా సెలవు తీసుకున్నాడు రాజు.

 

ఇంకా ఉంది.....

 

shiva purana part 7,  knowing about brahma vishnu and maheswara in shiva purana, Narada Temptation in Shiva Purana, auspicious shiva purana telugu, divine epic shiv purana, shiv purana and salvation