Mahalingodbhavam

 

మహా లింగోద్భవం

Mahalingodbhavam

 

బ్రహ్మదేవునికి సరైన సమాధానం లభించలేదు. తన పుట్టుకకు కారణమైన వారెవ్వరూ ఆయనకు కనిపించలేదు. దాంతో బ్రహ్మ ''నేను పద్మోద్భవుడిని, నా పుట్టుకకు నేనే కారణమ''న్న నిర్ణయానికి వచ్చేశాడు. అసలే తమోగుణంతో ఉన్నవాడేమో ఆ భావం బ్రహ్మలో అహంకారాన్ని జనింపచేసింది. అయినా అసలు ఈ పద్మం ఆద్యంతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామని బయలుదేరాడు. ఈ ప్రయత్నం కూడా బ్రహ్మకు నిరాశనే మిగిల్చింది. దిగులు పడుతున్న బ్రహ్మదేవునికి ''నాయనా! నీకు అసలు సంగతి బోధపడాలంటే ప్రణవశబ్దమైన ఓంకారాన్ని జపించు. తప్పక నీకు మార్గం లభిస్తుంది అంటూ పలికిన అశరీరవాణి స్వరం వినిపించింది.

 

అంతే! అశరీరవాణి చెప్పిన విధంగా బ్రహ్మ తన భార్య సరస్వతీదేవితో కూడి ఓంకారాన్ని జపించసాగాడు. అప్పుడు వారికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షం అయ్యారు.

 

అయితే బ్రహ్మదేవుడికి తాను పుట్టినప్పటినుంచీ ఇంతవరకూ ఏ రూపమూ కనిపించకపోవడంతో తనముందు ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణుల్ని గుర్తుపట్టలేదు. దాంతో ‘ ''ఎవరు మీరు? అని ప్రశ్నించాడు.

 

అందుకు మహావిష్ణువు ‘’ఈ సృష్టిని జని౦పచేసేందుకు సాయంగా నిన్ను నేను అవతరింపచేశాను. నువ్వు నా నాభిలో ఉన్న పద్మంలోంచి ఉద్భవించావు'' అన్నాడు. తామసగుణం ఆవరించి ఉన్న బ్రహ్మ అందుకు అంగీకరించక ''చాల్లే! నీవల్ల నేను ఆవిర్భవించడం ఏమిటి? నాకు నేనే స్వయంగా జన్మించాను. నా జన్మకు కారకులంటూ ఎవరూ లేరు'' అన్నాడు అహంకారంతో.

 

అందుకు విష్ణుమూర్తి నవ్వుతూ ''నువ్వు పొరపడుతున్నావు, నీకు వేదాల రహస్యాన్ని వివరించి అపార జ్ఞాన సంపదను అందించేందుకు నీ వద్దకు వచ్చాను’'' అన్నాడు. ఆ మాటలను బ్రహ్మ ససేమిరా అంగీకరించలేదు.

 

దాంతో ''సరే! నీతో నాకు వాదం ఎందుకు? మన జన్మకారడుకైన పరమేశ్వరుని ధ్యానించి ఆయన్ను ప్రసన్నం చేసుకుందాం. ఆయనే వచ్చి అసలు నిజం నీకు విశదపరుస్తా డు’’ అన్నాడు.

 

బ్రహ్మకీ సలహా నచ్చడంతో ఇద్దరూ పరమేశ్వరుని ''నమశ్శివాయ'' మంత్రంతో ధ్యానం చేశారు. దాంతో .... పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో వీరిముందు సాక్షాత్కరించాడు.

 

అత్యంత ఉన్నత ప్రమాణంలోనూ, అత్యద్భుతమైన ప్రకాశవంతంగాను ఉన్న ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఆశ్చర్య పోయారు. అసలు ఆ లింగానికి మొదలు, తుది ఎక్కడ ఉందో కూడా వారికి అవగతం కాలేదు. దాంతో వీటిని కనుగొన్నవారే మన ఇద్దరిలో గొప్పవారన్న నిర్ణయానికి వచ్చారు బ్రహ్మవిష్ణువులు. ఆ అభిప్రాయానికి రాగానే ఒకరు పాతాళానికి, మరొకరు ఊర్ద్వలోకానికి పయనం సాగించారు. విష్ణుమూర్తి యజ్ఞవరాహరూపంలో పాతాళం వైపునకు తన అన్వేషణ మొదలుపెట్టగా, బ్రహ్మదేవుడు హంస ఆకారంలో గగన మార్గంవైపు బయలుదేరాడు.

 

అలా వీరిద్దరూ దాదాపు కొన్ని వేల సంవత్సరాలు అన్వేషణ సాగించారు. అయినప్పటికీ వీరిద్దరికీ ఆ మహాలింగంయొక్క తుది, మొదలు కనుపించలేదు.

 

shiva purana part 14, Mahalingodbhavam, vishnu maya, creation of the world, brahmadeva complete details, brahma in Shiva Purana, auspicious shiva purana in telugu, shiv purana among 18 epics