Sages also attracts

 

ఎంతవారైనా కాంతకు దాసులే...

Sages also attracts

 

"నీ కూతురి స్వయంవరానికి తప్పకుండా వస్తానని రాజును, రమాదేవినీ ఆశీర్వదించి అక్కడినుంచి సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు నారదుడు. శ్రీదేవి పాదాలు వత్తుతుంటే, మెత్తనైన శేషతల్పంపై శయన భంగిమలో ఉన్న శ్రీమహావిష్ణువును దర్శించి భక్తిగా నమస్కరించాడు.

 

మునీంద్రుని చూసిన శ్రీహరి ఉచితరీతిన సత్కరించి కుశలప్రశ్నల అనంతరం నారదుడు ''స్వామీ! లోకంలో నిన్ను పోలిన అదృష్టవంతులు మరెవరూ లేరు. హాయిగా ఇష్టం వచ్చిన రీతిలో సుఖభోగాలను అనుభవిస్తూ అందమైన జీవితాన్ని గడుపుతున్నావు. భార్యవల్ల కలిగే సుఖం ముందు ఇంకే సుఖమైనా తృణప్రాయమే అంటారు. నేనా, సన్యాసిని. భార్య సుఖమేమిటి? అసలు స్త్రీ ఊసే తెలీనివాణ్ణి. అదేం చిత్రమో కానీ, ఇన్నాళ్ళకు నాకు స్త్రీపైనా, సంసారంపైనా ధ్యాస మళ్ళింది. అందులోనూ, మొన్న కల్యాణపురం రాకుమారి రమాదేవిని చూశాక అది మరీ ఎక్కువైంది. ఇంతెందుకు ఆమెపై నేను మనసుపడ్డాను. ఎలాగైనా సరే! ఆమెనే పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాను. ఇందుకు నీ సహకారం కావాలి'' అన్నాడు.

 

ఆ మాటలకు విష్ణువు ఆశ్చర్యపోయాడు. ''అదేమిటి నారదా! ఇంద్రియాలను జయించానని పెద్ద ఎత్తులో ప్రగల్భాలు పలికావు కదా! మళ్ళీ ఇప్పుడు వ్యామోహం, పెళ్ళి, సుఖమూ, సంతోషమూ లాంటి ఐహిక వాంఛలతో కూడిన తుచ్చమైన పదాల్ని ఉచ్చరిస్తున్నావేమిటి?’’ అన్నాడు విష్ణువు.

 

''ఇప్పటికీ నేను అదే మాట మీదున్నాను స్వామీ! అన్ని విషయాలపైనా అవగాహన ఉండడం మంచిదంటారు కదా, గృహస్థాశ్రమంలోని సుఖాన్ని కూడా అనుభవించి అందులోని సారాన్ని గ్రహిద్దామనే ఈ ఆలోచనకు వచ్చాను తప్ప మరేమీ కాదు. ఇప్పటికీ నేను ఏ మాయకూ లొంగనివాణ్ణే. ఇందులో ఎంత మాత్రం అసత్యంలే దు'' అన్నాడు గర్వంగా.

 

''మాయను జయించినవాడికి అతివలపై దృష్టి మళ్ళడమేమిటి? ఇది మాయకంటే కూడా మరింత ప్రమాదకరమైనది. అయినా సంసారబంధంలో ఒకసారి చిక్కుకున్నావంటే దాన్నుంచి బయటపడడం నీవనుకున్నంత సులభసాధ్యం కాదు. మరొక్క సారి ఆలో చించు కో’'' అన్నాడు నారాయణుడు.

 

''వేలమంది భార్యలతో స్వర్గసుఖాలు అనుభవించే నీవు సంసారం గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. నీరజాక్షా! నన్ననుగ్రహించి నీ సుందరమైన మోహనాకారాన్ని నాకు ఒక్కసారి వరంగా ప్రసాదించు. ఎందుకంటే, ఆ రమాదేవి కూడా నీపైన ఇష్టం పెంచుకుని ఉంది. నీ రూపంతో కనుక నేను అక్కడికి వెళ్తే ఆమె తప్పకుండా నన్ను వరిస్తుంది. ఇక్కడ నీవు భ్రమిస్తున్నట్టు నేను ఏ మాయకూ చిక్కుకోలేదు. శివ, విష్ణు మాయలు నన్ను ఏమీ చేయలేవు. కాబట్టి నా పై దయ తలచి నాకీ సహాయం చెయ్యి. ఇంతవరకూ నిన్ను నేనేమీ అడగలేదు. ఈ ఒక్క కోరికా మన్నిం'' అంటూ చేతులు జోడించి ప్రార్ధించాడు నారదుడు.

 

''నీ కోరిక మన్నించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మరోసారి ఆలోచించు. తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం ’’ విష్ణుమూర్తి ప్రశాంతంగా.

 

''నీ అనుగ్రహం ఉంటే దేన్నయినా సాధించగలను. ఈ కోరికను కాదనకుండా తీర్చు. ఆపై అంతా మంచే జరుగుతుంది. ఇందులో అనుమానిం చాల్సిన పనిలేదు’’ అన్నాడు నిశ్చయంగా నారదుడు.

 

''తథాస్తు'' అన్నాడు నారాయణుడు. ఇంకా ఉంది...

 

shiva purana part 12, Brahma manasa putrulu, hindu God's Creation, brahmadeva complete details, brahma in Shiva Purana, auspicious shiva purana in telugu, shiv purana among 18 epics