About Lord Shiva

 

మహాశివుని మహిమలు

About Lord Shiva

 

మునులంతా కలసి చేసిన వినమ్ర పూర్వకమైన అర్ధింపునకు సూత మహర్షి ఎంతగానో సంతోషించాడు. ''ముని శ్రేష్టులారా !మీరు సామన్యులు కారు. ప్రతి నిమిషం భగవంతుని ఆరాధనలో తనువూ ,మనసులను విలీనం చేసిన తపస్వులు మీరు. నియమనిష్ఠలతో కూడిన సదాచార సంపన్నులు, సచ్చీలురు. నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా ,ఏది కోరినా అది లోకకళ్యాణం కోసమే అవుతుంది .కాబట్టి మీలాంటి అభిలాష గల వారికి చెప్పగలగడం కూడా ఒక విశేషమే. ఆ భాగ్యం నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం .కాబట్టి నేనూ కూడా ధన్యుణ్ణే''.అన్నాడు సూతుడు.

 

మునులు తల పంకించగా సూతమహర్షి ''ఇంత సౌమ్యంగా నన్ను అర్ధించడంలోనే మీరెంత ఉన్నత చరితులో అర్ధం అవుతుంది .అయినా మీ కోరిక సామాన్యమైనది కాదు. ఆదిపురుషుడైన ఆ పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తరువాత అంతా తెలిసినట్లే ఉంటుంది గానీ, ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నేకాదు, అభిలాషనూ రేకెత్తిస్తుంది. సనాతనుడు, సనూతనుడు, సదాచారుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి. మహాశివుని లీలలు ఎవరికీ అంత తేలిగ్గా అర్ధం కావు. ఆయన గురించి తెలుసుకోవడమంటే ఒకరకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టే ఆయన. ఆయనే సృష్టి.  

 

ఒకసారి మార్కండేయుడనే గొప్ప శివభక్తుడు శివుని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి, వాణి, విరించిలకు (బ్రహ్మ, సరస్వతి) భక్తితో నమస్కరించి ''విధాతా!నాకు పరమేశ్వరుని గురించి, ఆయన మహత్యాన్నిగురించి కూలంకషంగా తెలుసుకోవాలని ఉంది . తెలియజేసి ధన్యుణ్ణి చేయ''మంటూ ప్రార్ధించాడు. అందుకు బ్రహ్మ''నాయనా !శివుడి గురించి తెలుసుకోవాలంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు .కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణుడిని అర్ధించు'' అని చెప్పాడు.

 

బ్రహ్మ మాట విని, మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకున్నాడు .అక్కడ శేషతల్పంపై లక్ష్మిదేవి పాదాలు వత్తుతుండగా శయన రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుని చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్ధనలు చేశాడు మార్కండేయుడు. ఆ స్తోత్రానికి పరవశుడై ''మార్కండేయా !నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది. పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలనే అభిలాష, ఉత్సుకత, సంకల్పం ఎంతో ఉన్నతం. అయితే మహాశివుని ఆసాంతం తెలిసినవారు ఎవరూ లేరు. కాబట్టి నీవు పరమేశ్వరుని దగ్గరికెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి. నీ కోరిక తప్పక తీరుతుంది'' అన్నాడు వైకుంఠవాసుడు.

 

మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలాగైనా తీరుతుంది. ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా, విసిగిపోయి అనుకున్నదాన్ని మధ్యలోనే విడిచిపెట్టకుండా అది తీరేవరకు యత్నిస్తున్నే ఉండాలి. సంకల్పబలం చిత్తశుద్ధి ఉంటే, అది తీరుతుంది. భగవంతుని సాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ భగవంతుని సాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమేనని గ్రహించాలి. మార్కండేయునికి అదే జరిగింది.

 

మహాశివుని మహిమల గురించి తెలుసుకోవాలన్న కోరిక మార్కండేయునిలో బలంగా ఉంది. ఆ ప్రయతంలో ఇప్పటికే బ్రహ్మ,విష్ణువులను అడిగి కొద్దిగా నిరాశకు గురైనా, తన కోరిక తీర్చగలిగే మార్గాన్ని, తీరుతుందన్న భరోసానూ పొందగలిగాడు. దాంతో అతని ఉత్సహం రెట్టింపైంది. అదే సంతోషంతో కైలాసం వైపుకు తన పయనాన్నిసాగించాడు మార్కండేయుడు.

 

ఇంకా ఉంది....

 

shiva purana part 6, knowing about lord shiva, shiva aavirbhavam in shiva purana, auspicious shiva purana telugu version, divine shiv purana, shiv purana gives moksha