కుంభకోణం యాత్ర – 13

 

 

 

కుంభకోణం యాత్ర – 13

పట్టీశ్వరం – 2

 


అదిగో అలా కుడివైపు ద్వారం లోంచి వెళ్తే ధేనుపురీశ్వరార్ ఆలయం వస్తుంది పదండి.  ఈ ఆలయానికి 3 ప్రాకారాలు, 5 గోపురాలు వున్నాయి.    సప్తమాత, మహలక్ష్మి, నవగ్రహ వగైరా ఉపాలయాలున్నాయి.  తపస్సు చేస్తున్న పార్వతీ దేవి విగ్రహం కూడా చూడవచ్చు.

 

పూర్వం చోళుల రాజధానులలో పట్టీశ్వరం కూడా ఒకటి.  అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని అనేకసార్లు పునర్నిర్మించటం, విస్తరించటం చేశారు.  అందుకనే ఇక్కడ  నిర్మాణాలలో పల్లవ, చోళ, నాయక రాజుల రీతులు గోచరమవుతాయి.

 

 

పరాశక్తి తపస్సు చేసుకోవటానికి ప్రశాంతమైన ప్రదేశంకోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చి తపస్సు చేసిందిట.  ఆవిడ తపస్సు చేస్తున్న విగ్రహాన్ని ఆలయంలో చూడవచ్చు. పార్వతీ దేవి ఇక్కడ తపస్సు చేస్తున్న సమయంలో దేవతలంతా ఇక్కడ మొక్కలు, చెట్ల రూపంతో వెలిశారు వాతావరణాన్ని చల్లబరచటానికి, అందంగా వుంచటానికి.  ఆవిడకి ప్రత్యక్షమైన శివుడు ప్రత్యేకమైన వేణీబంధంలో దర్శనమిచ్చాడుట.  అందుకే ఆయనని కబర్దీశ్వరార్ అన్నారు.

 

 ఆవిడకి తపస్సు సమయంలో సహాయంగా వుండటానికి కామధేను తన కూతురు పట్టిని పంపింది.  పార్వతీ దేవి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమవటం చూసిన పట్టి తానూ ఒక ఇసుక లింగాన్ని తయారు చేసి ఆరాధించింది.  ఆవిడ భక్తికి మెచ్చిన శివుడు ఆ లింగంలో ఐక్యమయ్యాడుట.  పట్టిని కరుణించాడుగనుక ఈ స్వామి అప్పటినుంచి పట్టీశ్వరుడయ్యాడు, ధేనుపురీశ్వరుడు అయ్యాడు, క్షేత్రం పట్టీశ్వరం అయింది. 

 

 

ఇక్కడ నందీశ్వరుడు స్వామి ఎదురుగా కాక కొంచెం పక్కకి జరిగి వుంటాడు.  దీనికి ఒక కధ వున్నది. తిరుజ్ఞాన సంబంధార్ గురించి శివుడు తన వాహనాన్ని పక్కకి జరగమన్నాడుట.  ఎంత అదృష్టవంతుడండీ ఆయన.  మరి ఆయన కధ ఏమిటంటే ...  ఆయన చిన్న వయసులోనే సాధువులతో కలసి ఇక్కడికి సమీపంలోనే వున్న తిరుసత్తిముత్రంకి వచ్చారు.  అక్కడ స్వామిని సేవించిన తర్వాత పట్టీశ్వరం బయల్దేరారు.  మంచి ఎండాకాలం.  సూర్యారావు తన ప్రతాపం చూపిస్తున్నాడు. శివుడుకి తన భక్తులంటే ఎంత ప్రేమో చూడండి.  ఆయన సంబంధార్, చిన్న పిల్లాడు,  ఆ ఎఱ్ఱని ఎండలో చెమటలు కక్కుకుంటూ తన దర్శనానికి నడచి వస్తుంటే జాలిచెందాడు.   తన గణాలను పంపి ఆయనకి ముత్యాల గొడుగు పట్టించాడు. దానితో ఆయన సుఖంగా నడిచి స్వామి చెంతకు రాసాగాడు.  అయితే స్వామి సంబంధార్ ని చూడటానికి ఆ ఆలస్యాన్ని కూడా తట్టుకోలేక తన ఎదురుగా అడ్డంగా వున్న నందీశ్వరుణ్ణి పక్కకి తప్పుకోమన్నాడుట.  ఆయన మాట విని నందీశ్వరుడు కొంచెం పక్కకి జరగటంతో దూరంనుంచి వస్తున్న సంబంధార్ ని శివుడు చూడగలిగాడుట. సంబంధార్ స్వామిని దర్శించగానే భక్తి పారవశ్యంతో 10 పాటలు పాడాడుట. వీటిని పదిగమ్ అంటారు.  (మేము చిదంబరంలో చూశాము.  ఇద్దరు భక్తులు స్వామి ఎదురుగా ఇలా పాటలు పాడటం.  ఎంత భక్తి పారవశ్యంతో పాడారంటే, స్వామి సంగతేమోగానీ, అక్కడవున్నమేమంతా, భాష తెలియక పోయినా,  ఆ ఆనందాన్ని అనుభవించాము) భక్తులపట్ల భగవంతుడికి వుండే ఆదరాన్ని ప్రత్యేకించి చూపే ఆలయం ఇది.  ఈ విషయంలో కూడా అనేక రకాల కధలున్నాయి.  శివ గణాలు పూల పందిళ్ళు ఏర్పాటు చేశారని, ముత్యాల పందిళ్ళు ఏర్పాటు చేశారని, ముత్యాల గొడుగు పట్టారని, వగైరా.  ఏది ఏమైనా, బాలుడిని ఎండ బాధనుంచి తప్పించారన్నది నిజమనుకుందాం.

 

 

ఈ విశేషాన్ని నేటికీ ఉత్సవంగా చేస్తారు.  జూన్ – జూలైలలో వచ్చే తమిళ మాసం ఆణిలో జరిగే ఈ ఉత్సవం ఆలయ ఉత్సవాలన్నింటిలోకీ ముఖ్యమైనది.  ఆ రోజు ఊరేగింపు తిరుశక్తిముత్రంలో బయల్దేరి పట్టీశ్వరానికి వస్తుంది.  అందులో తిరుజ్ఞాన సంబంధార్ రూపంలో ఒక చిన్న పిల్లాడు కూడా వుంటాడు.  చూశారా భక్తులకోసం భగవంతుడు ఎంత దిగి వస్తాడో

 

 

ఈ క్షేత్రం విశేషాలు ఇంకొన్ని....

పట్టీశ్వరం పేరు దివ్య గోమాత కామధేను కూతురు పట్టి వల్ల వచ్చింది.

రామచంద్రుడు ఇక్కడ శివుణ్ణి పూజించి వాలిని చాటునుంచి చంపిన పాపం పోగొట్టుకొన్నాడు.

రాముని బాణంతో ఏర్పడ్డ బావిని కోటి తీర్ధం అంటారు.  ఈ నీరు ధనుష్కోటిలోని నీటితో సమానమంటారు.

పార్వతీదేవి తపస్సు చేసిన పుణ్యస్ధలం ఇది.

విశ్వామిత్ర మహర్షి గాయత్రీ ప్రభావంతో బ్రహ్మర్షి అయింది ఇక్కడే.

మార్కండేయ మహర్షి ఇక్కడ స్వామిని సేవించాడు.

ఇక్కడ నవగ్రహ మండపంలో నవగ్రహాలు ఆగమ శాస్త్ర ప్రకారం తమ స్ధలాలలో వుండే, సూర్యుడికి అభిముఖంగా వుంటాయి.
భక్తులు తమ చింతలు తొలగిపోయి మానసిక శాంతి పొందటానికి, ఉద్యోగ, వ్యాపారఅవకాశాలు, అభివృధ్ధికోసం ఈ స్వామిని పూజిస్తారు.

 

అమ్మ జ్ఞానాంబికకు పక్కనే ప్రత్యేక ఆలయం వున్నది. ఆలయంలోపల గోడలమీద, కప్పుమీద పైంటింగ్స్ వున్నాయి చూడండి.  ఏ కాలం నాటివో తెలియదుగానీ, పూర్తిగా పాడయిపోయాయి.  ఇలాంటివాటిని పునరుధ్ధరిస్తే ఎంత బాగుంటుందో కదా   ఈ ఆలయం ముందు మండపంలో స్ధంబాల మీద యాలి విగ్రహాలు చెక్కబడి వున్నాయి. 

 

ఇంత అద్భుతమైన ఈ ఆలయాల దర్శనం అయిందికదా.  దుర్గా ఆలయంలోంచే బయటకి వెళ్దాము.  అక్కడ పులిహోర, చక్రపొంగలి ప్రసాదాలు అమ్ముతున్నారు.  తీసుకుందాము.  ఎందుకైనా మంచిది.  ప్రసాదాల కౌంటర్ లో వున్నావిడని ఈ చుట్టుపక్కల ఇంకేమన్నా ఆలయాలున్నాయేమోకూడా అడుగుదాం.  

 

 ఆవిడని అడగటం ఎంత మంచిదయిందో.. మనకొక బోనస్ వచ్చింది.  మేమిదివరకు వచ్చినా ఇక్కడ ఇంకొక ఆలయం వున్నదని మాకు తెలియలేదు.  కొంచెం దూరమే, నడచి వెళ్ళచ్చు అన్నారు కదా.. ప్రసాదాలు బేగ్ లో పెట్టుకుందాము.  ఆ ఆలయం కూడా చూశాక వాటి సంగతి.  చలో చలో తిరుసతిముత్రంకి...       

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)