కుంభకోణం యాత్ర – 12

 

 

 

కుంభకోణం యాత్ర – 12

పట్టీశ్వరం – దుర్గా ఆలయం

 


                                                                                            

గుడ్ మార్నింగ్.  లేచారా?  పదండి.  బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఇవాళ్టి ప్రోగ్రాం చెప్పుకుందాం. సరిగా తినండి.  ఇక్కడ గుళ్ళల్లో నడవటానికి అలసి పోతాము.   వడ వేడిగా బాగుంది.  ఇంకోటి వేసుకోండి.  ఇక్కడ టిఫెన్లు బాగున్నాయికదా.  బ్రేక్ ఫాస్ట్ చక్రవర్తిలా చెయ్యమంటారు.  చక్రవర్తిలా చెయ్యమని ఎంత సామెత చెప్పినా, హోటల్ వాళ్ళు ఎన్ని రకాలు పెట్టినా మనం తినగలగాలిగా.  బహుశా తినాలని కాదేమో వాళ్ళ ఐడియా.  రుచి చూడాలనేమో.  ఏదో ఒకటి.  కడుపు నిండింది.  ఇవాళ పట్టీశ్వరం వెళ్దాము.  బస్ లో వెళ్ళచ్చు.  బస్ స్టాండ్ కి వెళ్దాం పదండి.

 

 

పట్టీశ్వరం అని అక్కడ రాసి వున్నది.  మినీ బస్ రెడీగా వున్నది.  గుడిదాకా వెళ్ళాలంటే మినీ బస్ ఎక్కాలని ముందే తెలుసుకున్నాముగదా.  ఎక్కుదాం పదండి.  ఏమిటి టికెట్ 5 రూపాయలేనా!!  ఎంత చౌకో.  5 రూపాయలేనా అని అడిగితే ఎక్కువ తీసుకుంటున్నాడని మనం అన్నామనుకుని ఎనిమిది కిలోమీటర్లుందికదా అంటున్నాడు  కండక్టర్.  వాళ్ళనొక్కసారి మన సిటీ బస్ లు ఎక్కించాలి.  ఇలాంటి సరదాలు, రికమెండేషన్లు చాలా వున్నాయిగానీ, మన మాట పట్టించుకునేదెవరు?

 

ఉమ ఇంకా ఏమిటి కండక్టరుతో చెబుతోంది?  బస్ టికెట్లు చాలా చౌకగా వున్నాయంటోంది చూశారా!  మెచ్చుకోవాల్సిన చోట మెచ్చుకోవాలనేది తన తత్వం.    ఇక్కడ బస్సుల్లో ఇంకో సంగతి గమనించారా?  బస్సులు ఎన్నున్నాయో తెలియదుగానీ, బస్ కోసం ఎక్కువ సేపు చూడక్కరలేదు.  ఎంత పెద్దవారయినా సీటు లేకపోతే నిటారుగా నుంచుంటారుగానీ, కూర్చున్నవాళ్ళమీద పడిపోయినట్లు నుంచోవటం, జరుక్కోమనటం, ఇలాంటివి లేవు.

 

 

సమయం 9—15 అయింది.  పట్టీశ్వరం వచ్చింది.  దిగండి.  అదిగో అదే దుర్గ గుడి గోపురం.  దోవకి అటూ ఇటూ పూల కొట్లు చూశారా?  ఎంత చక్కని పూల దండలున్నాయో!  అక్కడ చూడండి .. తెల్ల కలువలు, ఎఱ్ఱ తామరలు దండలు వేళ్ళాడదీశారు.  చాలా బాగున్నాయికదా.

 

గోపురం దాటి లోపలకి ప్రవేశించగానే దుర్గాదేవి దర్శనం.  ఇక్కడ మూడు ఆలయాలున్నాయి.  ముందు దుర్గాదేవిని దర్శించి తర్వాత వేరే ఆలయాలకి వెళ్దాము. విఘ్ననివారణకి విఘ్నేశ్వరుడిని పూజించినట్లు, శతృసంహారానికి, కష్టాలు కడతేరటానికీ పురాణ కాలంనుంచీ నేటిదాకా దుర్గా పూజ ఆనవాయితీగా వస్తోంది.  పురాణకాలంలో శ్రీరాముడు, పాండవులనుంచి నేటి కాలందాకా అనేకమంది ఆపద సమయంలో దుర్గాదేవి శరణుజొచ్చి అభీష్ట సిధ్ధి  పొందుతున్నారు.

 

 

దుష్ట శక్తులను దునుమాడటానికి దేవతలంతా దుర్గామాతకి అనేక శక్తులిచ్చారు.  దుర్మార్గులను దునుమాడటానికి సకల దేవతా శక్తులతో ఆవిర్భవించిన మహా శక్తి దుర్గామాత.   ఆవిడ ప్రజలను దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది.  తన భక్తులలోని దురాలోచనలు, స్వార్ధం, అసూయ వగైరా దుర్బుధ్ధులన్నింటినీ నాశనం చేసి వారిని సరైన దోవలో నడుపుతుంది.  

 

అదిగో .. దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి.  ఎంత చక్కగా వున్నదో దుర్గాదేవి.  చాలా చక్కగా అలంకరించారు కదా.  ప్రసన్న వదనం, ఎనిమిది చేతులు, ఆ చేతుల్లో విల్లంబులు, ఖడ్గము, శంఖము, చక్రం, వగైరా ఆయుధాలున్నా, అమ్మ ముఖం ఎంత ప్రశాంతంగా వున్నదో.  సింహారూఢ అయిన ఈవిడ పాదాలు మహిషాసురుడి తల మీది వున్నాయి.   వాహనం సింహం తల ప్రతి చోటా వున్నట్లు అమ్మవారి కుడి చేతి వైపుకాక ఎడమ చేతి వైపు వుంటుంది.  కారణం తెలియదు.  ఈవిడ విష్ణు దుర్గ.  ఈవిడని దుర్గా లక్ష్మి, నవ శక్తి నాయకి, నవరత్న నాయకి, నవయోగ నాయకి, నవగ్రహ నాయకి వగైరా పేర్లతో కొలుస్తూ వుంటారు భక్తులు.

 

ఈ దుర్గాదేవి ఒక వంద సంవత్సరాలపాటు రాజ రాజ చోళుడితో సహా అనేక చోళ రాజుల కుల దేవతగా పూజలందుకుంది. పట్టీశ్వరంలో వాళ్ళ రాజ భవనంలో ఉత్తరం దిక్కుగా ఈవిడని ప్రతిష్టించి నిత్య పూజలు చేసేవారు. పక్కనే అదిగో అక్కడ భైరవుడి విగ్రహం వున్నది చూడండి.  అదీ, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి ఈ విగ్రహాలన్నీ కూడా అమ్మవారితోబాటే రాజ భవనంలో వుండేవి.   ఈ దేవతలంతా కోట నాలుగు ద్వారాలను కాపాడతారని నమ్మేవారు ఏదైనా యుధ్ధానికి వెళ్ళేటప్పుడు, ఏ విషయంలోనైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు చోళ రాజులు ఈ అమ్మవారిని ప్రార్ధించి ఆవిడ అనుమతి తీసుకునేవారుట.  వారి రాజ్యం పతనమైన తర్వాత ఈ విగ్రహాలను ఇక్కడికి తీసుకువచ్చి ఈ ఆలయంలో ప్రతిష్టించారంటారు

 

ఇవాళ శ్రావణ శుక్రవారం కదా.  ఉమ అమ్మవారికోసమని చీరె తెచ్చింది.  మళ్ళీ అమ్మవారికన్నా ఎవరన్నా ముత్తయిదువకి ఇస్తే కొంతకాలం కట్టుకుంటారు కదా అనుకున్నది.  అదిగో  ఆవిడకిస్తోంది.  చూద్దాం పదండి.  అబ్బ  ఎంత సంతోషంగా తీసుకున్నదో  ఆవిడ  ఉమ ఇచ్చిన వాయనం.  ఆవిడ ముఖంలో సంతోషం చూస్తే అమ్మవారే ఆవిడ రూపంలో వాయనం తీసుకుంటున్నట్లుందికదా.  మనకి కూడా చాలా సంతోషంగా వుంది. 

 

రాహు కేతు దోష పరిహారార్ధం ఇక్కడ రాహుకాలంలో అమ్మవారికి పూజలు చేస్తారు.  పిల్లలు లేనివారు, పెళ్ళికానివారు ఇక్కడ పూజ చేస్తే వారి కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.  వారి కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి నిమ్మకాయల దండలు, నూతన వస్త్రాలు సమర్పిస్తారు.  ఈ అమ్మవారు చాలా శక్తికల తల్లిగా నమ్మి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఆలయం ఎంత పరిశుభ్రంగా వుంచారో చూశారా?  అనేక రంగులతో అందంగా అలంకరించారు కదూ.  సరే ..  ఇప్పుడలా కుడివైపు పదండి.  అక్కడ శివాలయం వున్నది..చూద్దాము.


 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)