కుంభకోణం యాత్ర – 21
కుంభకోణం యాత్ర – 21
నాచియార్ కోయిల్
మనమిప్పుడు నాచియార్ కోవెలకొచ్చాము. కుంభకోణంనుంచి ఇది 6 కి.మీ. ల దూరంలో వున్నది. అంటే మనం ముందు దూరంగా వున్న తిరుచెరిలో సారనాధ కోవెల చూసి ఇటు వచ్చామన్నమాట. ఈ ఆలయం కూడా వైష్ణవుల 108 దివ్య దేశాలలో ఒకటి. ఈ ఆలయం గురించి బోలెడు విశేషాలున్నాయండీ. ఒక్కొక్కటీ చెబుతాను.
ఈ స్వామి గురించి గానం చేసినవారు తిరుమంగై ఆళ్వార్. ఈ ఆలయం, ఈ ఊరు ఆయన జీవితంతో అల్లుకుపోయాయి. ఆయన ఈ ఊరిలోని కుముదవల్లి అనే కన్యని ప్రేమించాడు. ఆవిడ నారాయణుని భక్తురాలు. కుముదవల్లి తిరుమంగై ఆళ్వార్ ని వివాహం చేసుకోవటానికి ఒక షరతు విధించింది. ఆళ్వార్ 1008మంది వైష్ణవులకు భోజనం పెట్టి, పంచ సంస్కారాలు చేయించుకుని, పూర్తిగా విష్ణు భక్తుడు కావాలని. తిరుమంగై ఆళ్వార్ కి పంచ సంస్కారాలకోసం తగిన గురువు దొరకక ఈ నారాయణుని కోవెలకు వచ్చాడుట. ఇక్కడి నారాయర్ నంబిని (ఆలయంలో వెలసిన భగవంతుని పేరు) తన గురువుగా భావించి కోమలవల్లి షరతులన్నీ పూర్తి చేశాడుట. నారాయర్ నంబి, ఆళ్వార్ తనయందుంచిన నమ్మకానికి, భక్తికి సంతోషించి స్వయంగా ఆయన భుజాలమీద శంఖు, చక్రాల ముద్రలు వేశాడుట.
ఇంకొక కధ ప్రకారం తిరుమంగై ఆళ్వార్ పూర్వ నామం నీలన్. ఆయన తన సంపద అంతా స్వామి సేవలో వినియోగించాడు. కానీ ఆయన సేవలని ఎవరూ గుర్తించలేదు. దిగులుపడ్డ ఆళ్వార్ ఇక్కడ స్వామిని తనని ఆయన భక్తునిగా గుర్తించమని వేడుకున్నాడు. భక్తుని ప్రార్ధనను ఆలకించిన నారాయణమూర్తి ఆయనని ముద్రాంకితుణ్ణి (శంఖ, చక్రాల ముద్రలు భుజాలమీదు వెయ్యటం) చేశాడు. ఏ కారణంతోనైనా, ఇక్కడ స్వామి తిరుమంగై ఆళ్వార్ ని ముద్రాంకితుణ్ణి చేశాడు అనే మాట అందరూ చెబుతారు.108 దివ్య దేశాలలో, ఇక్కడ మాత్రమే స్వామి గురువుగా వచ్చి భక్తుణ్ణి ముద్రాంకితుణ్ణి చేశారు. గురువుగా వచ్చాడు కనుక ఇక్కడ స్వామి రెండు చేతులతో మాత్రమే దర్శనమిస్తాడు. శంఖ, చక్రాలు వెనక వైపు వుంటాయిట.
నాచియార్ అంటే అమ్మవారు. ఇక్కడ స్వామి వున్నా అమ్మవారి పేరుతో, అమ్మవారి ప్రాముఖ్యతతో అలరారుతున్న అతి తక్కువ క్షేత్రాల్లో ఇది ఒకటి. దాని కధేమిటంటే ఈ ప్రదేశం పూర్వం మేధావి మహర్షి ఆశ్రమం. ఆయనకి విష్ణుమూర్తిని తన అల్లుడుగా పొందాలనే కోరిక వుండేది. ఆయన వంజుల వృక్షం కింద మహాలక్ష్మి కోసం తపస్సు చేశాడుట, ఆవిడని కుమార్తెగా పొందటానికి. కరుణించిన మహలక్ష్మి చిన్న పాపగా ప్రత్యక్షమయింది. ముని ఆ పాపకి వంజుల వృక్షం (ఈ వృక్షాన్ని మనమేమంటామో ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలియజేయండి) కింద దర్శనమిచ్చింది కనుక ఆ పాపకి వంజులా దేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు.
పెరిగి పెద్దదయిన మహాలక్ష్మిని వివాహం చేసుకోవటంకోసం విష్ణుమూర్తి ఐదు రూపాలు ధరించి భూలోకానికి వచ్చాడుట మహలక్ష్మిని వెతుక్కుంటూ. ఆ రూపాలు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుధ్ధ, పురుషోత్తమ మరయు వాసుదేవ. ఐదుగురూ ఐదు వైపుల వెళ్ళి మహలక్ష్మి కోసం వెతికారు కానీ ఆవిడ వాళ్ళకి కనబడలేదు. విష్ణుమూర్తి కూడా వచ్చిన గరుక్మంతుడు లక్ష్మీదేవి జాడ కనిపెట్టి తన స్వామికి చెప్పాడుట. స్వామి మేధావి మహర్షిని ఆయన కూతురుని తనకిచ్చి వివాహం చేయమని అడిగాడుట. మహర్షి సంతోషించాడు, కానీ కూతురు క్షేమంకోసం ఒక షరతు పెట్టాడు. తన కూతురికి అన్ని విషయాలలోనూ అధికారం వుండాలని కోరాడు. విష్ణుమూర్తి అంగీకరించి వివాహం చేసుకుంటాడు.
దానికి నిదర్శనంగా అమ్మవారు ఇక్కడ గర్భగుడిలో అయ్యవారికన్నా కొంచెం ముందుకి వుంటారు. ఉత్సవాల సమయంలో కూడా ఊరేగింపులలో అమ్మవారి విగ్రహం ముందు కదులుతుంది. అయ్యవారి విగ్రహం అమ్మవారి వెనకే. ఈ కోవెల పేరు, ఊరు పేరు కూడా అమ్మవారి పేరుమీదే నాచియార్ కోయిల్. పూజలు, నైవేద్యం, అన్నీ అమ్మవారికే ముందు. వీరి వివాహం చేయించిన బ్రహ్మ, లక్ష్మీదేవిని వెదకటానికి వచ్చిన పంచ రూపాలు, ప్రద్యుమ్న, అనిరుధ్ధ, పురుషోత్తమ, సంకర్షణ, మూర్తులను వాసుదేవుని మూర్తితోబాటు గర్భగుడిలో చూడవచ్చు.
మామగారు కోర్కె ప్రకారం ఆ ఆలయంలో లక్ష్మీ దేవికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలిగనుక, తన భక్తులను తన బదులు ఆశీర్వదించమని గరుడుని ఆదేశించాడుట. అందుకే ఇక్కడ గరుక్మంతుడికి ప్రాధాన్యత ఎక్కువ. ఇంకొక విశేషం ఉత్సవ విగ్రహాలలో అమ్మవారి విగ్రహం చేతిలో ఒక చిలుక వుంటుంది. అంతే కాదు, నడుముకి తాళాల గుత్తి వుంటుంది. ఆవిడ లోకాలకే అధినేత. లోక పరిపాలన బాధ్యత అంతా ఆవిడమీదే వున్నది కనుక ఆ తాళాల గుత్తిట. దేవతా మూర్తులు తాళాల గుత్తితో దర్శనమిచ్చే ఆలయం బహుశా ఇదేనేమో.
ఇంకొక విశేషం గర్భ గుడి ముందు వున్న పెద్ద గరుక్మంతుడి విగ్రహం. ఈయనకి ప్రతి గురువారం భక్తులు శీఘ్ర కళ్యాణం కోసం, సర్ప దోష నివారణకు, గ్రహాల అనుకూలతకూ పూజలు చేస్తారు. ఈ విగ్రహం రాతితో చేయబడిందిట. అన్నిటికన్నా విశేషమేమిటంటే ఊరేగింపు సమయంలో స్వామివారిని ఊరేగించటానికి ఈ గరుక్మంతుడి విగ్రహాన్ని బయటకి తీస్తారు. గుడిలోంచి బయటకి వచ్చేటప్పుడు నలుగురు మనుషులు మొయ్యగలిగిన విగ్రహం క్రమేపీ 8, 16, 32 అలా ఎక్కువమంది మోస్తేకానీ కదలనంత బరువు వుంటుందిట. ఆరు గంటల పాటు సాగే ఊరేగింపు పూర్తయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు కూడా ఈ విగ్రహం బరువు అంచెలంచలుగా తగ్గి, ఆలయం లోపలకి వచ్చే సమయానికి నలుగురు తీసుకు వచ్చే బరువుతో వుంటుందిట. పైగా గరుక్మంతుడికి ధరింప చేసిన బట్టలు చెమటతో తడిసి వుంటాయిట.
దీనికి కారణంగా చెప్పేదేమిటంటే, స్వామి ఇక్కడ అమ్మవారికే అన్ని విధాలా ప్రాముఖ్యత వుంటుందని మాట ఇచ్చారు. స్వామి వాహనం గరుక్మంతుడు వేగంగా వెళ్ళగలవాడు. మరి అమ్మవారి వాహనం హంస. హంసకి గరుక్మంతుని అంత వేగం వుండదు. అందుకే గరుక్మంతుడు అమ్మవారికన్నా ముందు వెళ్ళకుండా అలా బరువు పెరిగి తన నడకని నియంత్రించుకుంటాడుట.
అన్నట్లు ఈ ఉత్సవంలో స్వామి తరఫు గరుక్మంతునికి నూతన వస్త్రాలు, ఆభరణాలు కానుకగా వస్తాయిట.చోళ రాజు కొచెంగనన్ శివ భక్తుడు. నాయన్మార్లల్లో ఒకరు. ఆయన తన జీవిత కాలంలో 70 శివాలయాలు నిర్మించాడు. ఆయనకి మహా విష్ణువుని చూడాలనిపించి ప్రార్ధిస్తే ఆయన రెండు చేతులతో దర్శనమిచ్చి, తనకి ఆలయం నిర్మించమని ఆదేశించాడుట. ఈ ఆలయం కొచెంగనన్ నిర్మించినదే. కారణ తెలియదుకానీ, ఈ ఆలయన్నీ శివాలయం నమూనాలోనే నిర్మించాడుట. తర్వాత పాండ్య రాజు సదావర్మ సుందర పాండ్యన్ పనులు పూర్తి చేసి ఆలయానికి భూరి విరాళాలిచ్చాడు. తర్వాత తంజావూరుకి చెందిన నాయక రాజు రఘునాధ నాయకన్ అమ్మవారికి మండపం నిర్మించాడు. పంచ కృష్ణ స్ధలాలలో ఇది ఒకటి. అలాగే వైష్ణవులు ముక్తి ధామాలుగా భావించే 12 క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. ఆలయ ప్రదక్షిణ మార్గంలో దశావతారాల విగ్రహాలు, నరసింహుడు, రంగనాధ స్వామి విగ్రహాలను చూడండి.
ఉత్సవాలు
తమిళ మాసం మార్గైలో (డిసెంబరు – జనవరి) 10 రోజులు బ్రహ్మోత్సవాలు, ఫన్గుని (మార్చి – ఏప్రిల్) లో గరుడ సేవ వైభవంగా జరుగుతాయి.
దర్శన సమయాలు
ఉదయం 7-30నుంచీ 12-30 దాకా తిరిగి సాయంత్రం 4-30 నుంచీ రాత్రి 9 గం. ల దాకా.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)