కుంభకోణం యాత్ర – 22

 

 

 

కుంభకోణం యాత్ర – 22

ప్రత్యంగరా దేవి ఆలయం

 


                                                                                              

ఇప్పుడు మనం ఆయ్యావడి వెళ్తున్నాము. అదొక చిన్న పల్లెటూరు.  తంజావూరు జిల్లాలోదే.   ఈ ఊరి పేరు మొదట్లో అల్వర్ పడి.  ఒక కధనం ప్రకారం పాండవులు తమ ఆయధాలను ఇక్కడ ఒక చెట్టుకింద పెట్టి, మహా ప్రత్యంగరను పూజించి అడవుల్లోకి వెళ్ళారుట.  పాండవులు పూజ చేసిన ప్రదేశం కనుక ఈ ప్రదేశం అల్వార్ పడి అయి, కాలక్రమేణా అయ్యావడి అయిందట.  మనం అక్కడవున్న ప్రత్యంగరా దేవి ఆలయానికి వెళ్తున్నాము.  ఆవిడేనండీ, ఎండు మెరపకాయల హోమం చేస్తారూ...ఆవిడే.  ఈవిడని చాలా శక్తి కల దేవతగా పూజిస్తారు.

 

మనకి ఈవిడ పేరు ఈ మధ్యనే తరచూ వినిపిస్తున్నా, ఈవిడ అనాదినుంచి వున్న దేవతే.  మనకి నరసింహావతారం గురించి తెలుసు.  ఆవతారందాకా సరే.  కానీ ఆయనని శాంత పరచింది లక్ష్మీదేవి అని మన కధలు చెబుతాయి.  ద్రవిడ దేశంలో మాత్రం ఆయనని శాంత పరచింది శరభేశ్వరుడు.  ఈయన గురించి ఈయన ఆలయం చూసేటప్పుడు చెబుతాను.  ఆ శరభేశ్వరునితో వచ్చిందిట శక్తి ప్రత్యంగరా రూపంలో.  అప్పుడు ఆవిడ ఆకారం భీకరంగా, నల్లగా, సింహ ముఖంతో, 18 చేతులతో, చేతులలో వివిధ ఆయుధాలు, సంగీత వాద్యాలు ధరించి వున్నదిట.  నుదుటిమీద నెలవంక, పక్కనే లక్ష్మి, సరస్వతులు.  ఇదివరకు అమ్మవారిని చూడటానికి భయపడేవారట.  ప్రస్తుతం మనం చూస్తున్న అమ్మవారు ప్రశాంత వదనంతో, చిరునవ్వుతో, తన బిడ్డలను ఆదరిస్తున్నట్లుంటుంది.   

 

 

రామాయణం మీకందరీకీ తెలిసినదే కదా.  అందులో ఈవిడ ప్రస్తావన వున్నదని మీకు తెలుసా?   రామ రావణ యుధ్ధంలో రావణాసురుడు ఇంద్రజిత్ తప్పితే తన కొడుకులనందరినీ పోగొట్టుకుంటాడు.  ఇంద్రుణ్ణి జయించిన ఇంద్రజిత్ యుధ్ధ విద్యలో ఆరితేరిన వాడు.  రామ రావణుల యుధ్ధ సమయంలో ఇంద్రజిత్ రాముడిని జయించాలనే కోర్కెతో నికుంబళా యజ్ఞం చేయటానికి ప్రారంభించాడు.

 

 

ఆ కాలంలో భీకర యుధ్ధాలని జయించటానికి రాజులు ఎనిమిది దిక్కులా స్మశాన భూమిని ఏర్పాటు చేసి ప్రత్యంగరా దేవి కోసం యజ్ఞం చేసేవారు.  ఈవిడనే అధర్వణ కాళి అని కూడా అంటారు.  ఇంద్రజిత్తు ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టాడు, కానీ పూర్తి చెయ్యలేక పోయాడు.  దానికి కారణం లక్ష్మణుడు, హనుమంతుడు అంటారు కొందరు.  ఇంద్రజిత్తు ఈ యజ్ఞం పూర్తి చేసివుంటే అతనిని జయించటం కష్టమయ్యేది.  ఈ సంగతి తెలిసి  రాముడు కూడా దేవికి ప్రత్యేక పూజలు చేశాడుట.  ఆ తల్లికి తెలియదా ఎవరు దేనికోసం తనని పూజిస్తున్నారో.  అందుకే ఆవిడకి ఇంద్రజిత్తు అధర్మ యుధ్ధానికి సహాయపడటం ఇష్టంలేక రాముణ్ణి యుధ్ధంలో విజయుడై, సీతామాతని రక్షించమని ఆశీర్వదించింది.  అయితే ఇంద్రజిత్తుకూడా ఆవిడ భక్తుడే గనుక అతనికి రామాయణంలో స్ధానమిచ్చిందంటారు.

 

 

ఆలయంలో అమావాస్య వగైరా ప్రత్యేక రోజులలో నికుంబళా యజ్ఞం చేస్తారు.  ఆసక్తి వున్నవారు సమయాలు ముందు కనుక్కోండి.  ఈ యజ్ఞంలో బస్తాల కొద్దీ ఎండు మిర్చి హోమంలో  ఆహుతి చేసినా ఆ పొగ అక్కడి వారికి ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలిగించదట.  ఇది అద్భుతమేకదా.   యజ్ఞం చివరలో ప్రత్యంగరా దేవికి, శరభేశ్వరస్వామికి అభిషేకం చేస్తారుట.  యజ్ఞ సమయంలో భక్తుల సంఖ్య వేలల్లో వుంటుంది.  సమాజంలో తాము పోగొట్టుకున్న స్ధానం కోసం, శత్రు నాశనం, ఋణ విమోచనం, ఉద్యోగ, వివాహాది విషయాలలో సానుకూలత, శని దోష నివారణ వగైరా ఫలితాలకోసం ఇక్కడ యజ్ఞం చేస్తారు.  

 

 

ప్రత్యంగరా దేవి ఉత్తర దిక్కుగా వుంటుంది.  వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యప్ప, భైరవుడు, శరభేశ్వరుడు, శూలిని, వారాహి, సుదర్శన చక్రం, మహాలక్ష్మి వగైరా దేవతలను యజ్ఞ వేదిక చుట్టూ వేదాల ప్రకారం వారి వారి నిర్ణీత స్ధానాలలో ప్రతిష్టిస్తారు.  మధ్యలో ప్రత్యంగరా దేవి.  యజ్ఞంలో 96 రకాల వివిధ ద్రవ్యాలు, నవ ధాన్యాలు, పట్టు చీరె, నెయ్యి వగైరా ద్రవ్యాలను యజ్ఞకుండంలో ఆహుతి చేస్తారు.  చివరకు పెద్ద ప్రమాణంలోనే ఎండు మిరపకాయలు వేస్తారు.  భక్తులందరూ ఈ యజ్ఞంలో పాలు పంచుకోలేకపోయినా, యజ్ఞం కోసం తమ శక్తికొలదీ వస్తువులు సమర్పిస్తారు.

 

శివాలయం

ఇక్కడ శివాలయం వున్నది చూడండి. ఈ స్వామి పేరు అగస్త్యేశ్వరార్ (అగస్త్యేశ్వరుడు).  ఈయన తూర్పు ముఖంగా వుంటాడు.  అమ్మవారు ధర్మ సంవర్ధిని .. దక్షిణ ముఖంగా వుంటుంది. ఈ స్వామిని గురించి కూడా నాయన్మారులు తేవరాలలో ప్రస్తుతించారు.  ఈయన గురించి పాడిన నాయన్మారు జ్ఞాన సంబంధార్.

 

ఇక్కడ వున్న రావి చెట్టు కొమ్మలకి 5 రకాల ఆకులుంటాయి.  (ఒకే కొమ్మకి ఐదు రకాలు కాదు). అదిగో చూడండి.  ఆ చెట్టుకే.  వేరు వేరు జాతి కొమ్మలు కనబడుతున్నాయి చూశారా? ఆలయం విశాలమైన ఆవరణలో వున్నా, అతి ప్రాచీనమైనదైనా, అత్యంత శక్తికల క్షేత్రంగా భక్తులు భావిస్తున్నా, ఆలయ నిర్మాణం మిగతా ఆలయాలంత గొప్పగా వుండదు.  చిన్న ఆలయమే అనిపిస్తుంది. 

 

దర్శన సమయాలు

ఉదయం 6 నుంచీ 11 దాకా, సాయంత్రం 4 నుంచీ 8 గం. ల దాకా.

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)