Read more!

కుంభకోణం ఆలయాలు – 20

 

 

 

కుంభకోణం ఆలయాలు – 20

సారనాధ్ ఆలయం, తిరుచెరి

 


                                           
                                     

ఇవాళ తారీకు 27 కదూ.  ఇంక మనకి ఇవాళా, రేపే వున్నది ఏమైనా చూడటానికి సమయం.  ఎల్లుండి పొద్దున్నే బయల్దేరితేగానీ, సాయంకాలానికి చెన్నై చేరుకోము.  ఎందుకైనా మంచిది కొంచెం ముందే చేరుకోవటం.  ఇదివరకోసారి శ్రీమూష్నం నుంచి ఇలాగే కారులో వస్తూ రైలు తప్పిపోయి, వేరే బస్ లో ఇంటికి చేరాం.  అందుకని ఆ రోజు ఇంకేమీ చూడటానికి వీలుకాదు.  ఇవాళా, రేపూ, ఓపిక చేసుకుని అన్నీ చూద్దాము.

 

ఇవాళ ముందు తిరుచెరి వెళ్దాము.  అక్కడిదాకా బస్ లోనే వెళ్దాము.  అక్కడనుంచీ చూద్దాము.  బస్ టికెట్ మనిషికి 8 రూ. లే చూశారా.  దాదాపు 20 కి.మీ.ల దూరంలో వున్నది.   టాక్సీలో అయితే వేలు పొయ్యాలి.  అవసరమైతే తప్పదుకానీ, ఇక్కడ బస్సులు చాలా సౌకర్యంగా వున్నాయి.  మాటల్లోనే వచ్చేశాము.  అదిగో అదే ఆలయం.  దిగండి.  అస్సలు వెతుక్కోనక్కరలేకుండా, గుడికి ఎంత దగ్గరలో ఆగుతాయో బస్సులు.

 

7వ శతాబ్దంనుంచీ 9వ శతాబ్దందాకా వైష్ణవ భక్తులు (ఆళ్వారులు) దర్శించి, ఆ దేవుళ్ళమీద భక్తి గీతాలు పాడిన క్షేత్రాలే వైష్ణవులకి అత్యంత పవిత్రమైన 108 దివ్య క్షేత్రాలు.  అందులో ఇది కూడా ఒకటి.  అంటే స్వామి సృష్ట్యాదినుంచి వున్నా, భక్తుల చేత కీర్తింపబడి, ఆలయాలు నిర్మింపబడింది, మనకి తెలిసినంతవరకూ ఆ ప్రాంతాలనుంచే.

 

ఈ ఆలయం ప్రత్యేకత స్వామి ఇక్కడ ఐదుగురు లక్ష్ములతో దర్శనమిస్తారు.  శ్రీదేవి, భూదేవి, మహాలక్ష్మి, సారనాయకి, నీలాదేవి.  ఇక్కడ భూమి చాలా సారవంతమైనదట.  అందుకే స్వామి పేరు సారనాధుడు.  ఈ క్షేత్రానికి అసలు పేరు తిరు చెరం.  తర్వాత తిరుచేరి అయింది.  ఇక్కడ స్వామిని పాటలతో ఆరాధించినది తిరుమంగళ ఆళ్వార్.

 

 

జనవరి – ఫిబ్రవరి మాసాలలో పది రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.  చివరి రోజు రధోత్సవం జరుగుతుంది.  కావేరీ నదీ మాతకు స్వామి ఇక్కడ దర్శనం ఇచ్చారుట.  గురుడు ఒక రాశినుంచి ఇంకొక రాశికి మారే సమయంలో ఈ సంఘటన జరిగింది.  ఇలా గురువు ఒక రాశినుంచి ఇంకొక రాశికి మారటం 12 సంవత్సరాలకొకసారి జరుగుతుంది.  ఇది తమిళ మాసం తాయ్ లో వస్తుంది.  ఆ సమయంలో సార పుష్కరిణిలో స్నానం చేస్తే కుంభకోణంలో మహామహం ఉత్సవంలో మహామహంలో స్నానం చేసినదానికి సమానం అంటారు.

 

ఇదే ఆలయం రాజ గోపురం. ఐదు అంతస్తులతో అలరారుతోంది చూశారా?  దీని ఎత్తు 90 అడుగులని ఒకరూ, 120 అడుగులని ఒకరూ అంటారుగానీ, మనకి నికరంగా తెలిసే ఆధారాలు లేనప్పుడు  అలాంటి విషయాలు మనకొద్దులెండి. ఆలయానికి ఎదురుగా సార పుష్కరిణి.  దానికి పడమటి ఒడ్డున అగస్త్యుడు, బ్రహ్మ, కావేరీ మాతలకు ఆలయాలున్నాయి.  (ఆటో వాళ్ళు ఇవ్వన్నీ చూపించరు.  మీరు అడిగి చూడండి).  


స్వామి తూర్పు ముఖంగా నుంచుని దర్శనమిస్తాడు.  దాదాపు 12 అడుగుల ఎత్తయిన విగ్రహం. స్వామి ముందు సంతాన కృష్ణుని విగ్రహం వుంటుంది.  స్వామి ఉత్సవ విగ్రహం ముగ్గురు దేవేరులు, శ్రీదేవి, భూదేవి, నీలాదేవులతో వుంటుంది.   ఆలయ విమానం సార విమానం.  స్వామి సారనాధుడు.  అమ్మ సారనాయకి.  ఇక్కడ మట్టి చాలా సారవంతమయినదిట.  బ్రహ్మదేవుడు ప్రళయానికి ముందు కుంభం తయారు చేయటానికి అనేక చోట్ల మట్టిని పరీక్షించి, ఇక్కడ మట్టి చాలా సారవంతంగా వున్నదని దీనితో తయారు చేశాడుట.  అందుకే ఆ పేర్లు.

 

ఆలయం లోపల శ్రీనివాసుడు, శ్రీరాముడు, రాజగోపాలస్వామి, ఆంజనేయస్వామి, ఆండాళ్, రుక్మిణి, సత్యభామ, నరసింహ స్వామి, బాలసారనాధుడు, ఆళ్వారులు, రామానుజులకు ఉపాలయాలున్నాయి, చూస్తూ నడవండి.  పాప ప్రక్షాళనకు భక్తులు స్వామిని సేవిస్తారు.  ఒకసారి ఈ స్వామిని సేవిస్తే వందసార్లు కావేరీ నదీ స్నానం చేసిన ఫలితం వస్తుందట.

 

గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయిగనుక గంగానదిని పరమ పవిత్రమైనదిగా భావిస్తారుకదా.  కావేరీమాత తాను కూడా అంత పవిత్రమైనది అని అనిపించుకోవాలని సార పుష్కరిణి ఒడ్డున స్వామికోసం తపస్సు చేసింది.  ఆమె తపస్సుకి మెచ్చిన భగవంతుడు చిన్న బాబుగా ఆమె ఒళ్ళో వెలిశాడుట.  ఆమెకి కావలసినది అది మాత్రమే కాదుకదా.  ఆవిడ తన తపస్సు కొనసాగించిందిట.  భగవంతుడు ఐదుగురు దేవేరులతో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు కావేరీమాత కోరిన కోరికవల్లనే స్వామి ఆవిడకి దర్శనమిచ్చిన సమయంలో అక్కడ పుష్కరిణిలో స్నానం చేసినవారికి, సర్వ పాపాలూ పోతాయనీ, ఈ స్నానం మహామహం రోజున అక్కడ చేసిన స్నానమంత ఫలితం ఇస్తుందనీ వరం ఇచ్చారు. కావేరీ మాత కోరిన ఇంకొక కోరిక, స్వామిని అక్కడ అలానే ఐదుగురు దేవేరులతో కొలువుతీరమని ప్రార్ధించింది.  ఆవిడ ప్రార్ధన ఫలితంగా స్వామి అక్కడ తన ఐదుగురు దేవేరులతో కొలువుతీరారు.  అంతేకాదు.  గర్భగుడిలో తన ఎడమవైపు కావేరీమాతకి చోటిచ్చాడుట.  గర్భగుడిలో మనం చూస్తున్న ఆ విగ్రహం కావేరీ నదిదే.  స్వామికి కుడివైపు మార్కండేయ మహర్షి.  ఆయన భూదేవిని పెంచిన తండ్రి.  ఆ కధ మనం ఉప్పిలియప్పన్ ఆలయానికి వెళ్ళేటప్పుడు చెబుతాను.

 

పూర్వం మనవాల నాయకన్ అనే రాజు, మన్నార్ గుడిలో రాజగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రాళ్ళని బళ్ళల్లో పంపాడు.  ఆ బళ్ళన్నీ ఈ మార్గంలోనే వెళ్ళేవి.  సారనాధుని భక్తుడు నరస భూపాలన్ అనే ఆయన  ఒక్కొక్క బండిలోంచి ఒక్కొక్క రాయి తీసి ఈ ఆలయాన్ని పునరుధ్ధరించాడుట.  నాయక రాజుకి ఇది తెలిసి విచారణకి వచ్చాడు.  నరస భూపాలుడు స్వామిని ప్రార్ధిస్తే స్వామి నాయకన్ కి రాజగోపాల స్వామిగా దర్శనమిచ్చాడుట.  సంతోషించిన నాయకన్ ఈ ఆలయాన్ని కూడా పునరుధ్ధరించాడుట.  

 

ఇదే కధని ఇంకొక విధంగా కూడా చెబుతారు.  నరస భూపాలన్ నాయక రాజు మంత్రి.  ఆయన సారనాధుడి భక్తుడు. సారనాధుని ఆలయం నిర్మించాలని ఒక్కొక్క బండిలోంచి ఒక్కొక్క రాయి దింపించి, ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఉపయోగించాడు.  అయితే ఆయన తెలివిగా నాయక రాజు రాజగోపాలుని భక్తుడు కనుక రాజగోపాలునికి కూడా ఉపాలయం కట్టించాడుట.  నాయక రాజు రాళ్ళ సంగతి తెలిసి, వచ్చి, రాజగోపాలుని ఆలయం చూసి సంతోషించి, సారనాధుని ఆలయాన్ని కూడా పునర్నిర్మింపచేశాడుట.

 

ఆలయంలో అన్నీ చక్కగా చూశారుకదా.  ఇంక వెళ్దామా?  ఇక్కడనుంచీ మనం ఇంకో నాలుగు ఆలయాలు చూడవచ్చు. ఉండండి ఆటో అడుగుతాను.  నాచియార్ కోవెల, ప్రత్యంగిరా, తిరు నాగేశ్వరం, చూపించి ఉప్పిలియప్పన్ కోవెల దగ్గర దించటానికి 250 రూ. అన్నాడుగానీ 200 రూ. కి వస్తాడుట.  వెళ్దాం.  ఇవ్వన్నీ బస్సుల్లో తిరగటానికి మనకి అన్ని రూట్లూ తెలియవుకదా.  కుంభకోణంలో అంటే బస్ స్టాండ్ నుంచి గనుక వచ్చేశాము.  ప్రస్తుతం మనకి సమయం కూడా సరిపోవాలి.  అందుకే ఆటోలో వెళ్దాం పదండి.

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)