Read more!

తితిక్ష లక్షణాన్ని తెలిపిన శ్రీకృష్ణ భగవానుడు!!

 

తితిక్ష లక్షణాన్ని తెలిపిన శ్రీకృష్ణ భగవానుడు!!

 

కొన్ని సార్లు కొన్ని పనులు చేయడానికి మనసు నిరాకరిస్తుంది. అందులో ఉన్న అసంబద్ధతను ఎంచి మరీ అనుకూలంగా మార్చుకుని వాదించి, దాన్ని చేయకుండా ఉండాలని చూస్తారు. కానీ అది కచ్చితంగా చేయవలసిన పని అయినపుడు, దాన్ని చేయడం ద్వారా కలిగే నష్టాన్ని తలచుకుని బాధపడకుండా పని యొక్క లక్షణాన్ని, ఆ పని ప్రాముఖ్యతను తెలుసుకోవడం ముఖ్యం. గీతలో కృష్ణుడు అర్జుడికి అదే భోదిస్తాడు కింది విధంగా….

మాత్రా స్పర్శాస్తు కౌత్తేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాప్తం స్తితిక్షస్వ భారతః॥

అర్జునా! మనకు ఇంద్రియములు ఉన్నాయి కదా! వాటికి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు లక్షణములు. శరీరములో ఉన్న జ్ఞానేంద్రియములు ఈ లక్షణములతో కలిసినపుడు, సుఖము(మనకు అనుకూలంగా జరిగితే), దుఃఖము (మనకు ప్రతికూలంగా జరిగితే), ఉష్ణము (వేసవి కాలంలో), శీతలము (విపరీతమైన చలికాలంలో), మనకు వస్తూ పోతూ ఉంటాయి. కంటికి కొన్ని ఇంపుగా, మరి కొన్ని అసహ్యంగా కనిపిస్తాయి. అలాగే చెవులకు కొన్ని మాటలు వీనుల విందుగా, మరి కొన్ని మాటలు కంటకంగా వినిపిస్తాయి. అలాగే మంచి వాసనలు, చెడు వాసనలు. ఇంక చర్మం అసలైనది. శీతోష్ణములను భరించేది అదే. ఎండ కాస్తే ఉక్క, వానాకాలంలో చిత్తడి, శీతాకాలంలో చలి వీటిని తిట్టుకోవడం. కాని ఎండాకాలం పోగానే శీతాకాలం వస్తుంది. శీతాకాలం పోగానే ఎండా కాలం వస్తుంది. అలాగే సుఖము పోగానే దుఃఖము, దుఃఖము పోగానే సుఖము వస్తుంటాయి. ఇలా వస్తూ పోతూ ఉంటే పరిణామాలకు, అనిత్యమైన పరిణామాలకు, ఓర్చుకోవాలే గానీ, శోకించకూడదు అనే జ్ఞానం ఉంటే శీతోష్ణాలు ఏమీ చేయవు. అన్నీ సంతోషంగానే అనిపిస్తాయి. కాబట్టి అన్నిటినీ సమదృష్టితో చూడాలి. సహించడం నేర్చుకోవాలి. ఓర్పువహించాలి. ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే వృద్ధాప్యం తరువాత వచ్చే మరణానికి కూడా శోకించకూడదు. ఎందుకంటే మరణం కూడా శరీరానికి కలిగే ఒక అనివార్యమైన పరిణామము. అది శరీరానికే కానీ ఆత్మకు కాదు. భీష్ముడు మొదలగు వారు వృద్ధులు, వారు యుద్ధం జరిగినా జరగకపోయినా, చావడం తప్పదు. వారి మరణం కోసం శోకించడం తగదు అని కృష్ణుని బోధ.

వాతావరణంలో కలిగే మార్పులను, సుఖదుఃఖములను సహించడమే విజ్ఞుల లక్షణము, వాటి గురించి ఆలోచించక పోవడం, పట్టించుకోకపోవడం ఉత్తమం. శీతాకాలంలో చలిగా ఉండటం, ఎండా కాలంలో వేడిగా ఉండటం వాటి సహజ లక్షణాలు. మనకు అసౌకర్యంగా ఉందని అవి తమ సహజ లక్షణాలు మార్చుకోవు. మనమే వాటికి అనుగుణంగా మనలను మనం మార్చుకోవాలి. అంటే వాటిని సహించాలి. అలాగే యుద్ధం చేయడం క్షత్రియుని సహజ లక్షణం. అది ఎన్నటికీ పోదు. యుద్ధంలో హింస కూడా సహజమే. యుద్ధానికి, హింసకు తగ్గట్టు నీవు మారాలి, అంతే కాని యుద్ధంలో హింస జరుగుతుంది కదా అని అస్త్ర శస్త్రములకు మారుగా పూలు చల్లుకోరు.

కాబట్టి అర్జునా! బయట ఉన్న సహజ లక్షణములకు నిన్ను నీవు అనుకూలంగా మార్చుకోవాలి కాని అవి మారవు కాబట్టి వాటిని ఓర్పుతో సహించడం నేర్చుకోవాలి. దానినే తితిక్ష అని అంటారు. మంచి చెడు, సుఖము దుఃఖము, శీతోష్టాలు, జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి, వాటిని ఏ మాత్రం ద్వేషం లేకుండా, సంతోషంగా సహించడమే విజ్ఞుల లక్షణము. అంటే సుఖం వచ్చినపుడు ఎగిరి గంతెయ్యడం, దుఃఖం వచ్చినపుడు కుంగిపోవడం, శోకించడం పనికిరాదు. అని బోధించాడు కృష్ణుడు.

దీనిని బట్టి మనిషి దేన్నీ ఎలా తీసుకోవాలి, దేనికి ఎలా స్పందించాలి, స్పందించకూడదు అనే విషయాలను ఎంతో బాగా అర్థం చేసుకోగలుగుతాడు.

◆ వెంకటేష్ పువ్వాడ