Read more!

మాహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని ఇచ్చింది ఈయనే!!

 

మాహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని ఇచ్చింది ఈయనే!!

దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. అలాగే మహావిష్ణువును తల్చుకోగానే సుదర్శన చక్రం గుర్తొస్తుంది. అయితే మహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని ఇచ్చింది మహేశ్వరుడే, అది ఎలా జరిగింది అంటే.

ఒకానొక సమయంలో-దైత్యులూ, దానవులూ అఖండ బలవంతులై ముల్లోకాలలో ఉండే అందరినీ హింసించసాగారు. దేవతలంతా కలిసి విష్ణువుని చేరి దైత్య దానవులను అణిచివేయ వలసినదిగా ప్రార్ధించారు. ఆలోచించాడు విష్ణువు "ఇది కాలమహిమే గాని, వేరే ఏమిగాదు. కాబట్టి కాలశాసనుడైన కంఠేకాలుణ్ణి ఆరాధించి యీ కష్టం గడిచే విధానాన్ని సాధిస్తాను" అని దేవతలను ఊరడించి పంపాడు.

ఆ తరువాత  విష్ణువు కైలాసం దగ్గరలో ఒక గుండాన్ని నిర్మించి అగ్నులు రగిల్చి వేద మంత్రయుక్తంగా హోమం చేయసాగాడు. నిత్యం పార్థివ లింగార్చన చేశాడు. మానస సరోవరం నుంచి పద్మాలను తెచ్చి పార్థివ లింగాన్ని సహస్ర కమలాలతో అర్చించేవాడు. ఒకనాడు విష్ణువు మానస సరోవరానికి వెళ్ళి వెయ్యి కమలాలు తెచ్చి పెట్టుకున్నాడు. శివ సహస్రనామ స్తోత్రం చదువుతూ పూవ్వులతో పూజ చేస్తూండగా - నామమునకు ఒక పువ్వు కొరపడింది. తొమ్మిదివందల తొంబైతొమ్మిది నామాలు పూర్తయ్యాయి. పువ్వులు అయిపోయాయి. మరొక నామం వుండిపోయింది. ఏం చెయ్యడమా అని ఆలోచించాడు విష్ణువు. లోకులందరూ తనని "పద్మాక్షుడు" అనీ అంటారుగదా! అందువల్ల, తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని (కన్నును)  పెకలించి వుంచబోయాడు. చటుక్కున ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు. విష్ణువును వారించాడు. 

"శ్రీహరి ఇప్పటిదాకా  నువ్వు చేసింది చాలు. నేను ఎంతో సంతోషించాను నీ పూజకు, అలాగే పద్మం తక్కువైనందుకు నీ కన్నునే పెకిలించబోయిన నీ భక్తి కూడా నన్ను సంతోషపెట్టింది. ఏం కావాలో కోరుకో" అని అడిగాడు శివుడు. 

“హే సర్వేశ్వరా! పరమేశ్వరా!! ఈ కాలాన్ని శాసించేవాడివి కాలకంఠుడివి నువ్వు. దైత్యుల వర్గం, దానవుల వర్గం రెండింటిలో చెడు చాలా పెరిగిపోయింది. దేవతలు వాళ్ళ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చేసే యుద్ధాలు మూడు లోకాలను గందరగోళం చేస్తున్నాయి.  ఆదిత్యులు అవస్థలపాలై పారిపోయారు. శత్రువులను నివారించేందుకు నా దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవడం లేదు. ఏమి చేయాలో దిక్కుతోచక నీకోసం ఇలా పూజిస్తూ నిష్ఠగా ఉంటున్నాను. నువ్వే ఏదో ఒకటి చెయ్యి పరమేశ్వరా!!" అని ఆ మహావిష్ణువు వేడుకున్నాడు శివుడిని. 

 అప్పుడు వెంటనే శివుడు సొంతంగా తయారుచేసిన సుదర్శనం అనే చక్రాన్ని విష్ణువుకు యిచ్చాడు. అప్పటి నుండి విష్ణువు చక్రధరుడు అయ్యాడు. . చక్రధరుడు, చక్రపాణి, చక్రి- అనే పేర్లు కూడా వచ్చాయి. అసలు ఈ సుదర్శన చక్రం ఒకటే కాదు శివార్చనా నిమిత్తం పెకలించుకో బోయిన పుండరీకాక్షునికి  చిహ్నంగా చేతిలో పద్మమును పట్టుకుని పద్మధరుడిగా ప్రసిద్ధి చెందాడు విష్ణువు, శంఖచూడుడిని సంహారించినప్పుడు అతని అస్థికల ద్వారా ఆవిర్భవించిన వాటిలో శ్రేష్ఠ శంఖాన్ని శివుడి వల్ల పొంది, శంఖహస్తుడనే కీర్తిని సాధించాడు విష్ణువు.

ఇలా శివ ప్రసాదంగా అనేక అస్త్ర, శస్త్రాలను  పొందాడు ఆయన. ఆ తరువాత శివుడు ప్రసాదించిన సుదర్శన చక్రంతో శత్రువుల ఆట కట్టించి స్థితికర్తగా యెనలేని ఖ్యాతిగడించాడు మహావిష్ణువు. 

◆ వెంకటేష్ పువ్వాడ