శ్రీకృష్ణుడు కొన్ని సందర్భాలలో కాల నియమాన్ని ఉల్లంఘించాడని మీకు తెలుసా?
శ్రీకృష్ణుడు కొన్ని సందర్భాలలో కాల నియమాన్ని ఉల్లంఘించాడని మీకు తెలుసా?
మహావిష్ణువు అవతారం అయిన శ్రీకృష్ణుడు ప్రతి భారతీయునికి గొప్ప గురువుతో సమానం. ఆయన దేవుడని అందరూ అంటారు కానీ దేవుడికంటే కూడా గొప్ప గురువు, ఆధ్యాత్మికత వైపు ప్రజలను నడపడానికి అవతరించిన పరమాత్మ అని చెప్పవచ్చు. ధర్మ సంస్థాపన సంరక్షణ కొరకు ప్రతి యుగంలోనూ జన్మిస్తానని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. ఆయన కురుక్షేత్ర భూమిలో అర్జునుడికి చేసిన గీతాబోధన ప్రతి వ్యక్తి తన జీవితంలో తెలుసుకుని, అర్థం చేసుకుని వాటిని వాస్తవ జీవితంలో అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు చాలా కాల నియమాలను ఉల్లంఘించాడు. కాలచక్రాన్ని కూడా తలకిందులు చేశాడు. అవేంటో తెలుసుకుంటే..
కాల నియమం ప్రకారం మనిషిగా పుట్టిన ఏ వ్యక్తి కూడా శాశ్వతంగా జీవించలేడు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అశ్వత్థామను అమరత్వంలో ఉండమని శపించాడు. అది శాపమే అయినా అశ్వత్థామకు మరణం లేకుండా చేయడం సృష్టి విరుద్ద కార్యం. ఇలా కాల నియామాన్ని ఉల్లంఘించాడు శ్రీకృష్ణుడు.
సాందీపుడు శ్రీకృష్ణుడి గురువు అనే విషయం అందరికీ తెలిసిందే.. అయితే విద్య పూర్తైన తర్వాత గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి ఏం అడిగినా ఇస్తామని చెబుతారు శ్రీకృష్ణుడు, బలరాముడు. యమలోకంలో యముడి దగ్గర ఉన్న తన కుమారుడిని తెచ్చివ్వమని సాందీవుడు అడుగుతాడు. ఈ కారణంగా సాందీపుని కుమారుడిని శంఖాసురుడు అనే రాక్షసుడు తిన్నాడని తెలుసుకుని అతన్ని వధించి మరీ సాందీపుని కుమారుడిని తెచ్చి గురువుకు అప్పగిస్తాడు. ఇలా కాల నియమాన్ని ఉల్లంఘించాడు.
కృష్ణుడు జన్మించడానికి పూర్వం దేవకి, వసుదేవులకు జన్మించిన 6మంది శిశువులను కంసుడు బలి తీసుకుంటాడు. అయితే కృష్ణుడి అభ్యర్థన మీద బలి రాజు మరణించిన ఆరుగురు శిశువులను కృష్ణుడికి అప్పగిస్తాడు. దేవకి, వసుదేవులతో పాటూ ఆ ఆరుగురు స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇలా మరణించిన వారిని తిరిగి స్వర్గానికి పంపి శ్రీకృష్ణుడు కాల నియమాన్ని ఉల్లంఘించాడు.
మహాభారత యుద్దం తర్వాత అర్జునుడు అశ్వమేధ యాగం చేశాడు. అర్జునుడు వదిలిన గుర్రం నేటి మణిపూర్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడి రాజుకు, అర్జునుడికి మధ్య యుద్దం జరిగింది. ఆ యుద్దంలో అర్జునుడు మరణించాడని చెబుతారు. కానీ కృష్ణుడు సృష్టికి విరుద్దంగా అర్ఝునుడిని బ్రతికించాడని చెబుతారు.
బ్రహ్మాస్త్రం..
మహాభారత యుద్దంలో కౌరవులు ఓటమి చెందారనే కోపంతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. పాండవ వంశాన్ని నాశనం చెయ్యాలనేది అశ్వత్థామ ఆలోచన.. కానీ కృష్ణుడు తన దివ్య శక్తితో బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని తగ్గించి, అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో పెరుగుతున్న బిడ్డను రక్షించాడు.
భీముడి మనుమడు...
తల నరికిన తరువాత ఏ మనిషి ప్రాణం తిరిగి దక్కదు. కానీ భీముడి మనుమడు బర్భరీకుడిని మహాభారత యుద్దంలో పాల్గొనకుండా చేస్తాడు. యుద్దంలో బర్బరీకుడు పాల్గొమకుండా బర్బరీకుడి తలను మాత్రం ప్రాణంతో ఉంచి కురుక్షేత్ర యుద్దానికి సాక్ష్యంగా మారుస్తాడు. ఇలా కృష్ణుడు కాల నియమాన్ని ఉల్లంఘించాడు. వీటి వెనుక కారణాలు ఎన్ని ఉన్నా.. అవన్నీ లోక కళ్యాణం కోసం చేసినవే అయినా కాలచక్రాన్ని తలకిందులు చేయగలిగినవాడు ఆ పరమాత్ముడే.
*రూపశ్రీ.