Read more!

ఎనిమిది విధాల సమ్మేళనమే ప్రకృతి అన్న శ్రీకృష్ణ పరమాత్మ!!

 

ఎనిమిది విధాల సమ్మేళనమే ప్రకృతి అన్న శ్రీకృష్ణ పరమాత్మ!!

 

భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవచు అహంకార జతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా॥

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, ఆహంకారము అని ప్రకృతి ఎనిమిది విధాలుగా విభజింపబడింది. 

 ఈ శ్లోకంలో పరమాత్మ తత్వం గురించి, ప్రకృతి అంటే ఏమిటి అనే విషయం గురించి వివరించబడింది. పరమాత్మ అంటే ఎవరు? ఎక్కడ ఉంటారు? గర్భగుడిలో ఉంటాడా? -పుణ్యక్షేత్రాలలో మాత్రమే ఉంటాడా? కైలాసమా? వైకుంఠమా! ఎక్కడుంటాడు. ఈ విషయాలు అన్నీ ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి. అన్ని ఉపనిషత్తులలో ఒకటే విషయం చెప్పబడింది. ఈ అనంత విశ్వం అంతటికి కారకుడు పరమాత్మ ఈ అనంతవిశ్వంలో ఉన్న ప్రతి వస్తువుకు రెండు కారణాలు ఉంటాయి. ఉదాహరణకు మట్టి కుండ కుండకు కారణం మట్టి, కాబట్టి మట్టి ఉపాదాన కారణము, మట్టి కుండగా తయారవ్వాలంటే దానంతట అదే తయారుకాదు. అది తయారు చేయడానికి కొంత తెలివి, శక్తి, నేర్పు కావాలి. దానినే నిమిత్త కారణం అంటారు. అలాగే ఈ అనంత విశ్వానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి అని చెప్పవచ్చు.

ఈ విశ్వం భూతములతో తయారయింది. అంటే ఈ అనంత విశ్వంలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, ఈ ఐదింటితో తయారయింది. వీటిని ఉపాదాన కారణాలు అనుకుంటే వీటిని తయారుచేయడానికి ఒక శక్తి, నేర్పు అంటే నిమిత్త కారణం ఒకటి ఉండాలి. ఆ నిమిత్త కారణమే ఈశ్వరుడు, పరమాత్మ, భగవంతుడు. మనిషి ఆలోచనను బట్టి, ఎలాగైనా అనుకోవచ్చు.

ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. కుమ్మరి ముందు మట్టిని, సారెను సమకూర్చుకున్నట్టు భగవంతుడు ఈ పంచభూతాలను ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు అని మనం అనుకోవచ్చు. ఈ పంచభూతాలు ఎక్కడి నుండో రాలేదు. ఆయనలోనుండి వచ్చాయి. దీనికి ఉదాహరణ మన ఇంట్లో గూడుకట్టుకునే సాలీడు సాలెపురుగు తన లాలాజలంతో దారాలు అల్లి గూడు కట్టుకుంటుంది. మరలా ఆ లాలాజలాన్ని తనలోకి లాక్కుంటుంది. ఆ గూడు సాలీడులోకి వెళ్లిపోతుంది. అలాగే ఈ అనంత విశ్వం నిరాకారుడు అయిన పరమాత్మలో నుండి వచ్చింది. మరలా ఆయనలో లీనం అవుతుంది. అదే మహా ప్రళయము. అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉంటాడు. నిజానికి పరమాత్మ, ప్రకృతి రెండూ ఒకటే. ఎందుకంటే పరమాత్మలోనుండి ప్రకృతి ఆవిర్భవించింది. మరలా ఈ ప్రకృతి పరమాత్మలో లీనం అవుతుంది.

విజ్ఞానం ప్రకారం మొట్టమొదట ఏమీ లేదు. శూన్యము, శూన్యములో నుండి ఒక పెద్ద విస్ఫోటం, అదే బిగ్ బాంగ్ అందులో నుండి అనంత విశ్వం ఆవిర్భవించింది. బిగ్ బాంగ్ ఎక్కడి నుండి పుట్టిందో అదే ఈశ్వరుడు, వరమాత్మ, నిరాకారుడు. మరలా ఈ విశ్వం అంతా ఆయనలోకి చేరుతుంది. అప్పుడు పరమాత్మ ఒక్కడే ఉంటాడు.

పంచభూతములతో ఏర్పడిన ఈ అనంత విశ్వం, దీనిని సృష్టించిన పరమాత్మ ఈ ఇద్దరి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈశ్వరుడు ఒకడే. అతడే సత్యము అని. తెలుసుకున్నాము కదా, అద్వైతుడుగా ఉన్న ఈశ్వరుడు రెండు అయ్యాడు. దానికి పరాప్రకృతి, అవరా ప్రకృతి అని పిలుస్తాము. పరాప్రకృతి అంటే ఈశ్వరుడు అపరా ప్రకృతి అంటే ఆ ఈశ్వరుడిలో నుండి వచ్చిన పంచభూతాత్మకము అయినదే ఈ అనంత విశ్వము. దీనినే మనము అర్ధనారీశ్వరతత్వము అని పిలుచుకుంటాము. ఈశ్వరుడు పరమాత్మ అయితే అంబ ప్రకృతి, నిజానికి ఇద్దరూ ఒకరే. కాని మనకు రెండుగా కనపడుతున్నారు..

మొట్ట మొదట ఒకటిగా ఉన్న పరమాత్మ రెండుగా అయ్యారు. ఆ రెండింటి పేర్లు పరా ప్రకృతి  అపరా ప్రకృతి. పరాప్రకృతి చైతన్య వంతమైనది. దానికి ఎటువంటి గుణములు లేవు, గుణరహితము, నిర్గుణము, ఇది ఎటువంటి మార్పుచెందదు అంటే నిర్వికారమైనది. స్వతంత్రమైనది. దేని మీద ఆధారపడనిది. నిత్యము సత్యము. అందుకే బ్రహ్మసత్యం జగన్మిధ్య అన్నారు..

అపరా ప్రకృతి అచేతనము, జడము. దీనికి గుణములు ఉన్నాయి. సగుణాత్మకము, వికారములు కలిగినది అంటే నిరంతరం మార్పుచెందుతూ ఉంటుంది. దీనికి స్వతంత్రత లేదు. మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది. మిధ్య అంటే లేదు అని కాదు అర్థం. ఇప్పుడు ఉన్న స్థితిలో మరుక్షణం ఉండదు. నిరంతరం మార్పుచెందుతూ ఉంటుంది అని అర్థం. పరాప్రకృతి సత్యము నిరాకార నిర్గుణమైన విశ్వదైతవ్యము అయితే అపరా ప్రకృతి అంటే ఏమి ? అవి ఏవి? అనే విషయం ఇమిడి ఉంటుంది.

అవరా ప్రకృతి తనకు తానుగా ఎనిమిది విధాలుగా విభజించుకుంది. అవే..... భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు ఇవి ఐదు పంచభూతములు ఇవి మొట్ట మొదట సూక్ష్మరూపంలో తత్వాలుగా ఉన్నాయి. ఆకాశ తత్వం, వాయుతత్వం, జలతత్వము, అగ్నితత్వము, భూమి తత్వము, ఈ తత్వాలు ఒక్కసారిగా ఆవిర్భవించలేదు. ఒకదానిలో నుండి మరొకటి వచ్చాయి. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, కాలము నుండి భూమి, ఇలాగా ఒక దానిలో నుండి మరొకటి ఉద్భవించాయి. మనసు, బుద్ధి, అహంకారము కూడా సూక్ష్మ తత్వాలే. ఈ సూక్ష్మతత్వాలు పరిణామ క్రమంలో స్థూల రూపాలు సంతరించుకున్నాయి. ఒక్క ఆకాశం, అందులో నుండి వచ్చిన వాయువు తప్ప మిగిలిన మూడు తత్వాలు కంటికి కనిపించే రూపాలు సంతరించుకున్నాయి. అలాగే మనస్సు, బుద్ధి అహంకారము, ఈ మూడు సూక్ష్మ తత్వాలు. కంటికి కనిపించవు. ఈ విధంగా అపరా ప్రకృతి ఎనిమిది విధాలుగా ప్రకటించబడింది.

◆ వెంకటేష్ పువ్వాడ