శ్రీకృష్ణుడు మోహినీ రూపం దాల్చి వివాహం చేసుకున్న కథ తెలుసా?
శ్రీకృష్ణుడు మోహినీ రూపం దాల్చి వివాహం చేసుకున్న కథ తెలుసా?
రామాయణ, మహాభారతాలు భారతీయులకు చాలా నేర్పిస్తాయి. వీటిలో ముఖ్యంగా మహాభారతం ఒక విస్తారమైన జ్ఞాన నిథి అని చెప్పవచ్చు. తవ్వేకొద్దీ జ్ఞానం అన్నట్టు ఇందులో తెలుసుకునేకొద్దీ బోలెడు విషయాలు ఉంటూనే ఉంటాయి. ప్రతి వ్యక్తి వెనుకా ఓ గతం, ఓ కథ ఉంటాయి. అయితే అందరూ ఒక ఎత్తు అయితే ఆ శ్రీకృష్ణ పరామత్మ మరొక ఎత్తు. మహావిష్ణువు మోహీనీ అవతారం ఎత్తి అమృతాన్ని సంపాదించిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు మోహీనీ అవతారం ఎత్తి వివాహం చేసుకున్న కథ బహుశా చాలా కొద్దిమందికే తెలిసి ఉంటుంది.
మహాభారత యుద్దంలో చాలామంది వీరులు మరణించారు. కౌరవుల కుట్రపూరిత యుద్దంలో పాండవుల సైన్యం పతనం కావడం మొదలైంది. ఈ సందర్బంలో ఓ వీరుడు చేసిన త్యాగం శ్రీకృష్ణుడిని కంటతడి పెట్టించిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. పాండవులకు మహాభారత యుద్దంలో విజయం చేకూరాలంటే చాముండికి ఒక గొప్ప యోధుడిని బలి ఇవ్వాలని చెబుతారు. ఈ సందర్భంలో చాముండికి ఎవరిని బలి ఇవ్వాలో పాండవులు తేల్చుకోలేకపోతారు. కానీ అర్జునుడికి, ఉలూపికి కుమారుడు అయిన ఇరావణుడు తనకు తాను బలికి సిద్దమవుతాడు.
ఉలూపి నాగరాజు కౌరవ్య కుమార్తె. అర్జునుడి నలుగురు భార్యలలో ఈమె రెండవది. అర్జునుడు ఇంద్రప్రస్థంలో బహిష్కరణకు గురై భూప్రదక్షిణకు వెళ్లినప్పుడు గంగాతీరాన జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఉలూపిని వివాహం చేసుకుంటారు. వారిద్దరి కుమారుడు ఇరావనుడు. ఇరావనుడు పాండవుల విజయం కోసం తనకు తాను చాముండికి బలి కావడానికి సిద్దమయ్యాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇరావనుడు చాలా శక్తివంతమైన యోధుడు. మాయా ఆయుధాలలో మంచి నైపుణ్యం కలిగినవాడు. విలువిద్యలో గొప్ప ప్రతిభ కలిగినవాడు. అలాంటి యోఢుడిని బలి ఇవ్వడానికి పాండవులకు మనసొప్పలేదు. కానీ ఇరావనుడు మాత్రం పాండవులకు విజయం చేకూరాలంటే బలి తప్పనిసరి కాబట్టి తననే బలి ఇవ్వమని చెబుతాడట.
కానీ.. ఇరావనుడికి వివాహం కాలేదు.. బ్రహ్మచారిగా మరణించడం ఇష్టం లేదని తనకు వివాహం చేసుకోవాలనుందనే చివరి కోరికను వెలిబుచ్చుతాడు. అయితే మరణిస్తాడని తెలిసి కూడా తమ తమ కుమార్తెలను ఇరావనుడికి ఇచ్చి వివాహం చేయడానికి ఏ రాజు సిద్దం కాడు. దీంతో పాండవులలో విచారం నెలకొటుంది. ఈ సందర్బంలోనే ఇరావనుడి కోరిక తీర్చడం కోసం శ్రీకృష్ణుడు మోహినీ అవతారం ఎత్తుతాడు. ఇరావనుడిని వివాహం చేసుకుంటాడు. వీరిద్దరి వివాహం జరిగిన మరుసటి రోజు ఇరావనుడు చాముండి దేవికి బలి ఇవ్వబడ్డాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇరావనుడు మరణించిన తరువాత మోహినీ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు వితంతువులా మారాడాని. వితంతు రూపంలోనే భర్త కోసం విలపించాడని కూడా కథనాలున్నాయి.
ఇప్పటికీ కిన్నర్ సమాజంలో ఇరావనుడిని పూజిస్తున్నారట. ఇరావనుడి విగ్రహంతో వివాహం జరిగిన మరుసటిరోజు వితంతు రూపంలో విలపిస్తారట. ఇది అక్కడ ఆచారంగా వస్తోందట. తమిళనాడులోని వేలుపురంలో ఉన్న ఈ నంపుసక వర్గానికి చెందిన ప్రజలు ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట.
*రూపశ్రీ.