శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉందట.. దీని వెనుక రహస్యం ఇదే..!

 


 శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉందట.. దీని వెనుక రహస్యం ఇదే..!

 


శ్రీకృష్ణుడు లోకానికి గీతాసారాన్ని బోధించినవాడు. ధర్మసంస్థాపన కోసం యుగయుగంలోనూ జన్మిస్తానని చెప్పినవాడు.  శ్రీకృష్ణుడికి సంబంధించి చరిత్రలోనూ, పురాణాలలోనూ చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి.  కృష్ణుడికి సంబంధించిన ఆలయాలలోనూ, పురాణ స్థలాలలోనూ ఆసక్తికర విశేషాలున్నాయి.  ముఖ్యంగా పూరీ జగన్నాథ రథయాత్ర, పూరీ క్షేత్రం వెనుక చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి.  ఇక్కడ కృష్ణుడు జగన్నాథుడిగా పిలువబడతాడు.  ఇక్కడ విగ్రహం వేప చెక్కతో తయారుచేయబడుతుంది.  ఇది 12 సంవత్సరాలకు ఒకసారి మార్చబడుతుంది.  విచిత్రం ఏమిటంటే ఈ విగ్రహాలలో గుండె ఇప్పటికీ  కొట్టుకుంటూనే ఉంటుందట.  దీని వెనుక ఆసక్తికర విషయాలు తెలుసుకుంటే..


 జగన్నాథుని  రథయాత్ర గురించి స్కంద పురాణం, నారద పురాణం, పద్మ పురాణం,  బ్రహ్మ పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. మత విశ్వాసాల ప్రకారం ఈ రథయాత్రలో పాల్గొని ఈ రథాన్ని లాగిన వారికి వంద యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. గ్రంధాల ప్రకారం, నేటికీ జగన్నాథుని విగ్రహం లోపల శ్రీకృష్ణుని గుండె కొట్టుకుంటుంది, దాని వెనుక ఒక పురాణ కథ ఉంది.


పురాణాల ప్రకారం మహా విష్ణువు ద్వాపరయుగంలో
శ్రీకృష్ణుడిగా అవతరించాడు. సృష్టి నియమాల ప్రకారం ఈ రూపం కూడా అంతం అవుతుంది. శ్రీ కృష్ణుడి  అవతారం ముగిశాక, అతను తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళాడు. కానీ పాండవులు తన అంతిమ సంస్కారాలు చేసినప్పుడు శ్రీ కృష్ణుడి శరీరం మొత్తం అగ్నిలో ఆహుతి అయ్యింది.. కానీ  గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంది.  అగ్ని ఆ బ్రహ్మ పదార్థాన్ని  కాల్చలేకపోయాడు. ఈ దృశ్యాన్ని చూసి పాండవులు ఆశ్చర్యపోయారు. ఇది బ్రహ్మ పదార్థం దీన్ని సముద్రంలో ప్రవహించనివ్వండి అని  అశరీర వాణి మాటలు వినిపించాయి. దీంతో పాండవులు శ్రీకృష్ణుని హృదయాన్ని సముద్రంలో వదిలిపెట్టారు.

 నీటిలో ప్రవహించే శ్రీకృష్ణుని హృదయం దుంగలాగా మారి నీటిలో తేలుతూ ఒరిస్సా తీరానికి చేరుకుందని ప్రతీతి. అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఇంద్రద్యుమ్నుడు అనే  రాజుకు కలలో కనిపించి తన హృదయం దుంగ రూపంలో సముద్రతీరంలో ఉందని చెప్పాడు. ఇంద్రద్యుమ్నుడు ఉదయం నిద్ర లేవగానే శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. అతను దుంగకు నమస్కరించి తనతో తీసుకువచ్చాడు. ఇంద్రద్యుమ్న రాజు ఆ దుంగను జగన్నాథుని విగ్రహం లోపల ప్రతిష్టించాడు.  అప్పటి నుండి అది అక్కడే ఉంది.


12సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడి విగ్రహాన్ని మారుస్తారు.   ఆ సమయంలో పాత విగ్రహంలో బ్రహ్మ పదార్థాన్ని  తీసి కొత్త విగ్రహాంలోకి మారుస్తారు.  ఈ తంతు చేసేటప్పుడు ఆలయ పూజారులు తమ కళ్లకు గంతలు కట్టుకుని ఉంటారు. అలాగే చేతులకు కూడా గుడ్డలు  కట్టుకుని ఉంటారు.  పైగా పూరీ క్షేత్రం అంతా  విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.  భారతదేశంలో అత్యంత రహస్యంగా జరిగే దైవ కార్యం ఇదే. ఆలయ పూజారుల ప్రకారం వారు మార్చే బ్రహ్మ పదార్థం మృదువుగా ఉంటుందట.  దీన్ని ఎవరైనా నేరుగా కళ్లతో చూస్తే  ప్రాణాలకు ముప్పు  వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే దీన్ని ఎవరూ చూడరు.

- రూపశ్రీ