కుంభకోణం ఆలయాలు - 19

 

 

 

కుంభకోణం ఆలయాలు - 19

ఆది వరాహ స్వామి ఆలయం
                                                                                 

 

 

చక్రపాణి ఆలయం నుంచీ మనం ఇప్పుడు ఆది వరాహ స్వామి ఆలయానికి వెళ్తున్నాము.  దీనితో ఇవాళ్టి ఆలయాల రౌండప్ అయిపోతుంది.  మనవైపు వరాహ స్వామికి ఆలయాలు తక్కువైనా, తమిళనాడులో కనబడతాయి.  వీటిలో శ్రీమూష్నం చాలా ప్రసిధ్ధి చెందింది.

 

ప్రళయం తర్వాత అమృత భాండం ఇక్కడికి రావటం, పరమ శివుడు దానిని బాణంతో కొట్టడం వల్ల ఆ భాండం పగిలి, అమృతం అన్ని వైపులా చింది, అనేక ఆలయాలు ఏర్పడ్డాయని మొదట్లో చెప్పాను కదా.  ఈ ఆలయం వాటికన్నా ముందునుంచీ, ఇక్కడ వున్నదంటారు.

 

 

పురాణాల ప్రకారం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చెరబట్టి పాతాళ లోకానికి తీసుకు పోవటం మీకు తెలుసుకదా.  భూదేవి, శ్రీమహా విష్ణుని ప్రార్ధించింది.  ఆవిడ ప్రార్ధన విన్న మహా విష్ణు భీకరమైన వరాహ రూపాన్ని ధరించి, హిరణ్యాక్షుడిని వధించి, భూదేవిని రక్షించి నీటి పైకి తీసుకు వస్తాడు.  ఆ సమయంలో ఋషుల ప్రార్ధనలు మన్నించి, భూదేవితో సహా ఇక్కడ కొలువు తీరాడుట.  అంతే కాదు.  మహా ప్రళయానికి ముందునుంచీ కూడా ఆది వరాహస్వామి ఇక్కడ వున్నాడుట.  మహామహం ఉత్సవాలు కూడా ఈ స్వామి ఇక్కడ వెలిసి తర్వాత ప్రారంభింపబడినవే అంటారు.  ఈ ప్రాంతంలో మొట్ట మొదటి వైష్ణవ దేవుడు ఆది వరాహ మూర్తే.  

 

 

ఆలయం చిన్నదే అయినా రంగు రంగుల గోపురంతో అందంగా వుంటుంది.  స్వామి కూర్చున్న భంగిమలో వుంటారు. స్వామి ఎడమ కాలుపై  భూదేవి వుంటుంది.  తల్లి స్వామి వైపు చూస్తూ, ఆయనని ధ్యానిస్తున్నట్లుంటుంది. ఉత్సవ విగ్రహం రూపం కూడా వరాహస్వామిదే.  (కొన్ని చోట్ల ముఖం వరాహానిది వుండదు).  ఎడమకాలు ఆది శేషు మీద పెట్టి నిల్చున్నట్లుంటాడు.  వరాహ సాలగ్రామం, శంఖ చక్రాలతో స్వామి ముందు వుంటుంది.  నిత్యం అభిషేకం సాలిగ్రామానికే చేస్తారు. 

 

ముందు మండపంలో విష్వక్సేనుడు, వైష్ణవ ఆచార్యలు నిగమానంద మహాదేశికన్ కొలువు తీరారు. నాగేంద్రుడు తులసి కోట కింద ప్రతిష్టించ బడ్డాడు.  రాహు కేతువుల దోషాలున్నవాళ్ళు ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. బయట వరాహ తీర్ధం వుంది. రాత్రికి చేసే చివరి పూజలో భూమిలో చాపలు అల్లటానికి పనికి వచ్చే గడ్డి కింద పెరిగే వేళ్ళని పౌడర్ లాగా చేసి దానిలో నెయ్యి, బెల్లం కలిపి స్వామికి నివేదిస్తారు.  మరునాడు ఉదయం భక్తులకు దానిని ప్రసాదంగా పంచి పెడతారు.  స్వామి భూదేవిని పాతాళంనుంచి రక్షించారుగనుక కృతజ్ఞతగా, భూమి అడుగున పెరిగే వేళ్ళనుంచి వచ్చిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.

 

మహామహం ఉత్సవాలతో సంబంధం వున్న వైష్ణవ ఆలయాలలో ఇది కూడా ఒకటి. మహామహం రోజున కుంభకోణంలో వున్న వైష్ణవ దేవుళ్ళు సారంగపాణి, చక్రపాణి, వరదరాజస్వామి, రాజ గోపాల స్వామి, ఆది వరాహ స్వాములను కావేరీ నదిదాకా ఉరేగింపుగా తీసుకెళ్తారు.

 

 

కొంచెం దూరంలోనే వైష్ణవులకు పుణ్య దేశాలయిన 108 ఆలయాలలో రెండు సారంగపాణి, చక్రపాణి ఆలయాలున్నాయి. ఇంకొక విశేషం.  చైత్ర మాసంలో 7వ రోజు ఈ స్వామిని దర్శించటానికి సారంగపాణి, చక్రపాణి వస్తారుట.  శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఈ ప్రదేశంలోనే పైకి తీసుకు రావటం వల్ల ఇది అవివాహితులకు ప్రార్ధనా స్ధలం అయింది.  ఇక్కడ స్వామిని ప్రార్ధిస్తే భూమి, ఇంటికి సంబంధించిన అన్ని వివాదాలూ పరిష్కారమవుతాయి.

 

ఆలయ సమయాలు

ఉదయం 8 గం.ల నుంచీ 11-30 దాకా, తిరిగి సాయంత్రం 5 గం. ల నుంచి 8 గం. ల దాకా.  కుంభకోణం బస్ స్టాండు నుంచీ 3 కి.మీ. ల దూరంలో వుంటుంది ఆలయం.  ఇవాళ్టికి మనం ప్లాన్ చేసుకున్న ప్రకారం అన్ని ఆలయాలు చూసేశాం.  కష్ణాష్టమి కదా, ప్రసాదాలు దండిగా దొరికాయి. ఇందాక బ్రహ్మన్ కోవెలలో కూడా తలొక పొట్లం ఇచ్చారుకదా.  ఏమిటో చూద్దా.  బియ్యపు రవ్వ ఉప్మా, చింతపండు పచ్చడి.  సుబ్బరంగా లాగించేసి, మజ్జిగ తాగి పడుకుందాం.  ఆరోగ్యానికి మంచిది.  మళ్ళీ రేపు చూద్దాం ఎక్కడికి వెళ్ళాలో. 

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)