కుంభకోణం యాత్ర – 17
కుంభకోణం యాత్ర – 17 (బ్రహ్మన్ కోవెల)
పొద్దున్న దారాసురంలో అద్భుతమైన శిల్పాలు చూశాం కదా. సాయంకాలం 7 గం.లయింది. దగ్గరలో ఏదన్నా గుడికి వెళ్ళి వద్దాము. ఊళ్ళోనే బ్రహ్మన్ కోవెల వున్నది. ఆటో అడిగాను. 60 రూ. ట. వెళ్ళొద్దాము పదండి. ఇవాళ కృష్ణాష్టమి. ఇంట్లో వుంటే కృష్ణుడికి పూజ చేసుకునే వాళ్ళం అనుకుంటున్నారా? మీ భక్తికి మెచ్చి అదిగో ఆ కృష్ణ పరమాత్ముడే మీకు దర్శనమివ్వటానికి వస్తున్నాడు చూడండి. కృష్ణాష్టమికదా. దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. ఇంట్లో వుంటే ఇలాంటి ఊరంగింపు చూడగలమా?
గుడి వచ్చేలోపు, గుడి గురించి నేను తెలుసుకున్నది చెబుతాను....
మన పురాణాల గాధల ప్రకారం బ్రహ్మ దేవుడికి పూజలుగానీ, గుళ్ళుకానీ లేవుకదా, ఒక్క పుష్కర్ లో తప్ప. తమిళనాడులో ఈ కోవెలకి బ్రహ్మన్ కోవెల అని పేరు వచ్చేసిందిగానీ, దీనిలో కూడా బ్రహ్మదేవుడు ముఖ్య మూర్తి కాదండోయ్. ఈ ఆలయంలో ముఖ్య దేవుడు వేద నారాయణుడు. తన దేవేరులు శ్రీదేవి, భూదేవులతో భక్తులకు అభయమిస్తూ వుంటాడు.
ఇక్కడ బ్రహ్మ ఆలయానికి వెనక కధ ఏమిటంటే బ్రహ్మకి కొంచెం అహం కలిగింది. మహావిష్ణువుకి కేవలం రక్షించటమే తెలుసునని, శివుడికి నాశనం చెయ్యటంతప్ప ఇంకేమీ తెలియదని, తాను సృష్టించ గలడు కనుక తానే అందరికన్నా గొప్పనుకున్నాడు. ఈ గర్వాన్ని చూసి శివుడు, విష్ణు నవ్వుకున్నారు. ఆ సమయంలో మహా విష్ణు నుదురునుంచి ఒక మహా శక్తి పుట్టి రాక్షసుడిగా మారింది. ఆ రాక్షసుడు బ్రహ్మ దగ్గరనుంచి నాలుగు వేదాలు లాక్కున్నాడు. దానితో బ్రహ్మకున్న జ్ఞానము, సృష్టి చేసే శక్తికూడా పోయాయి. తన శక్తులన్నీ పోవటంతో బ్రహ్మ దిగులు పడ్డాడు. వేదాలు, తన శక్తులు తిరిగి పొందటానికి ఏమి చేయాలా అని తీవ్రంగా ఆలోచించాడు.
ఆ సమయంలో నారద మహర్షి కుంభకోణంలో యజ్ఞం చేయమని సలహా ఇస్తాడు. నారద మహర్షి సలహా ప్రకారం బ్రహ్మ కుంభకోణంలో సరస్వతీ దేవి, గాయత్రీ దేవులతో వరదరాజ స్వామి కోసం యజ్ఞం చేస్తాడు. యజ్ఞంలో ఆహుతులివ్వటానికి యజ్ఞ కుండంలో అగ్ని రాజుకోలేదు. బ్రహ్మ, ఆయన భార్యలు కారణమేమిటా అని దిగులు పడ్డారు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై యజ్ఞం చెయ్యటంలో ఏదో హెచ్చు తగ్గులున్నాయి అని చెప్పాడు.
అప్పుడు సరస్వతీ దేవి చెప్పింది .. గాయత్రీ దేవికి ఐదు తలలు వున్నాయి కానీ బ్రహ్మ దేవుడికి నాలుగు తలలే వున్నాయి. అక్కడ హెచ్చు తగ్గులు వచ్చాయని. దానితో గాయత్రీమాత తన శక్తితో తన ఐదవ తలని బ్రహ్మ నాల్గవ తలమీద పెట్టగా బ్రహ్మ నాల్గవ తలతో లీనమయిపోయింది. దానితో యజ్ఞం పూర్తవుతుంది. యజ్ఞాగ్నినుంచి వరదరాజస్వామి ప్రత్యక్షమై బ్రహ్మకి వేదాలు తిరిగి ఇచ్చి, ఆయన శక్తులు కూడా ఆయనకి ప్రసాదిస్తాడు. అప్పుడు బ్రహ్మ దేవుడు వరం అడిగాడు. తాను చేసిన బ్రహ్మ సంకల్ప పూజ చేసిన వారికి పోయిన వస్తువులన్నీ తిరిగి రావాలనీ, వారికి అన్ని శుభాలూ జరగాలనీ. తధాస్తు అన్నాడు వరదరాజస్వామి. స్వామి ఇక్కడ వేద నారాయణుడిగా వుండటానికి కారణం అది.
బ్రహ్మ తనకి అహం తిరిగి రాకుండా చెయ్యమని కూడా వేద నారాయణుడిని ప్రార్ధిస్తాడు. దానికి ఆయన యోగ నరసింహుని ఆశ్రయించమంటాడు. తనని ఆశ్రయించిన బ్రహ్మదేవుడికి నరసింహస్వామి భక్తుల దృష్టి సంబధమయిన అన్ని దుష్ట శక్తులను నాశనం చేస్తానని వరమిస్తాడు. అందుకే ఇక్కడ నరసింహస్వామి కూడా వుంటాడు.తపస్సిధ్ధి తర్వాత బ్రహ్మ, ఇతర దేవతలు, స్నానం చేయటానికి విష్ణు తన గదతో ఒక నదిని సృష్టించాడు. దాని పేరు హరి నది. ఆలయంలో పూజలయిన తర్వాత పూజారి అక్కడ ఉపయోగించిన పాత్రలను నదిలో శుభ్రపరిచేవాడు. నదిలోని నీరు పాత్రలకి తగిలి ... హరి .. హరి .... అనే శబ్దం వచ్చేది. దానితో పూజారి ఆ నదికి హరి సొల్లారు అని పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ పేరు అరసలారు నది అయింది
ఆలయం వచ్చేసింది .. దిగండి. అవునూ, ఇదేదో సందులో వున్నట్లుంది. మళ్ళీ ఇక్కడనుంచి ఆటోలు దొరుకుతాయో లేదో. ఇతన్నే వుండమని చెబుదాము. ఇక్కడికి దగ్గరలోనే ఇంకో రెండు ఆలయాలు వున్నాయి, వరాహ స్వామి, చక్రపాణి. అవ్వి రెండూ చూపించి, హోటల్ దగ్గర దింపటానికి రూ. 140 అడుగుతున్నాడు. సరే వుండమనండి. మనం ఆలయం చూసి వద్దాము. చిన్న ఆలయమే. ఆలయ కమిటీ మెంబర్లనుకుంటా, గుళ్ళో ఆ పక్కన ఏదో చర్చిస్తున్నారు. ఎక్కడనుంచి వచ్చారు అని అడుగుతున్నారు. మనం కొత్తవాళ్ళంగా కనబడ్డాము కదా. అంత దూరంనుంచి ఆలయ దర్శనం కోసం వచ్చామని తెలిసి సంతోషించారు చూశారా?
ఈ ఆలయంలో మధ్యలో వేద నారాయణుడు దేవేరులతో, ఆయనకి కుడివైపు బ్రహ్మ సరస్వతి, గాయత్రి దేవులతో, వేద నారాయణునికి ఎడమవైపు ఆలయంలో నరసింహస్వామి ఇరు పక్కన దేవేరులతో కొలువు తీరి వున్నారు. ఇలా ఒకే ఆలయంలో ముగ్గురు దేవుళ్ళని ప్రతిష్టించటం కాకతీయులు నిర్మించిన ఆలయాలలో ఎక్కువ చూస్తాము. వీటిని త్రికూట ఆలయాలు అంటారు. ఇక్కడ విద్యా, వ్యాపారాభివృధ్ధులకోసం బ్రహ్మ సంకల్ప పూజ చేస్తారు. తమ పిల్లల్ని పాఠశాలలో చేర్చే ముందు ఇక్కడ బ్రహ్మకి, సరస్వతికి, గాయత్రీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. శుక్రువారం మహలక్ష్మికి, శనివారం వేదనారాయణునికి, తమ ఋణ విముక్తి కోసం పూజిస్తారు. భక్తులు తమ 60, 70, 80 పుట్టిన రోజుల సందర్భంగా నరసింహస్వామికి హోమాలు చేస్తారు.
యజ్ఞం చేస్తున్నప్పుడు గాయత్రీదేవి తన ఐదవ ముఖాన్ని బ్రహ్మ నాల్గవ ముఖంలో లీనం చేసింది అని తెలుసుకున్నాం కదా. అందుకే ఇక్కడ బ్రహ్మ నాల్గవ ముఖం గాయత్రి ముఖంగానే దర్శనమిస్తుంది. అదిగో వెనుక వైపువున్న గాయత్రీ దేవి ముఖాన్ని పూజారిగారు అద్దం పెట్టి చూపిస్తున్నారు చూడండి. ఆవిడ ముక్కెర దర్శనం చేసుకుంటే సకల పాపాలూ నాశనమవుతాయిట. అందుకే ప్రత్యేకించి ముక్కెర అని కూడా చెబుతున్నారు చూడండి. చదువులతల్లి సరస్వతీ దేవి, గాయత్రీ దేవి బ్రహ్మ పక్కనే వుంటారు.
దర్శనాలు బాగా అయ్యాయి కదా. ఇంక వెళ్దామా. అదిగో ఆ పండు ముత్తయిదువ మనల్నే పిలుస్తున్నట్లుంది ఏమిటో చూద్దాము. అటుకులు, బెల్లం కలిపిన ప్రసాదం ఇస్తున్నారు, కన్నయ్య ప్రసాదమని. చూశారా? కృష్ణుడు అడుగడుగునా మీకెలా కనిపిస్తున్నాడో! ఇందాక ఊరేగింపులో దర్శనమిచ్చాడు. ఈ ఆలయంలో వేద నారాయణుడుగా, నరసింహస్వామిగా దర్శనమిచ్చాడు. ఇప్పుడు ప్రసాదంకూడా ఇప్పిస్తున్నాడు. సంతోషమేగా...ఇంక బయల్దేరుదామా .. ఆటో ఇక్కడే వున్నది. ఎక్కుదాము. అదిగో గుళ్ళోంచి ఆయన ప్రసాదం అంటూ వస్తున్నారు. తలో పేకెట్ చేతిలో పెట్టారు. సరే రూమ్ కి వెళ్లాక చూద్దాము. ఇవాళ ప్రసాదాలే ప్రసాదాలు.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)