Read more!

కుంభకోణం యాత్ర – 8 కాశీ విశ్వేశ్వరాయలం

 

 కాశీ విశ్వేశ్వరాలయం కుంభకోణం యాత్ర – 8

 

కుంభకోణం ఊరి మధ్యలో మహా మహానికి అతి చేరువుగా వున్న కాశీ విశ్వేశ్వరాలయానికి వచ్చాము మనమిప్పుడు. అదిగో ఆ కనబడుతున్న పుష్కరిణే మహామహం.  దాని గురించి తర్వాత చెబుతాను.  ముందు కాశీ విశ్వేశ్వర ఆలయం చూద్దాం పదండి.   2 ఎకరాల స్ధలంలో వున్న ఈ ఆలయానికి రెండు గోపురాలున్నాయి.  ఇందులో పడమర గోపురం ఎత్తు 72 అడుగులు. ఏడు అంతస్తులతో, అందమైన విగ్రహాలతో అలరారుతుంటుంది.

ఆలయంలో మూల విరాట్ కాశీ విశ్వేశ్వరుడు, అమ్మ విశాలాక్షి కాక నవ కన్యలు, వీర భద్రుడు, సూర్యనారాయణ, చంద్రుడు, ఆంజనేయ స్వామి వగైరా దేవతలకి ఉపాలయాలు వున్నాయి.ప్రస్తుతం  వున్న ఆలయం 16 వ శతాబ్దంలో నాయక రాజుల కాలంలో కట్టబడింది.  ఈ ఆలయ ముఖ్య విశేషం నవ కన్యల ఉపాలయం, దానికి వున్న ప్రాముఖ్యత. అందుకే దీనిని కాశీ విశ్వేశ్వరాలయమేకాక నవకన్యల ఆలయం అని కూడా అంటారు. నవ కన్యలంటే తొమ్మిది మంది నదీమ తల్లులు.  వారు  1. గంగ, 2. యమున, 3. నర్మద, 4. సరస్వతి, 5. కావేరి, 6.గోదావరి, 7. కృష్ణ, 8. తుంగభద్ర, 9. సరయు.

తొమ్మిది నదీమ తల్లులు గురించి చెప్పుకున్నాము కదా.  ప్రజలు ఆ నదులలో స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకుంటున్నారు కానీ ఆ పాపాలన్నీ ఆ నదీమ తల్లులకి వస్తున్నాయి.  వాటితో వారు తల్లడిల్లిపోతూ కాశీ విశ్వేశ్వరుని ఆ పాపాలను పోగొట్టుకునే ఉపాయం చెప్పమని ప్రార్ధిస్తారు.  శివుడు మహాకుంభం సమయంలో (12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది)  మహామహంలో స్నానం చేసి ఆది కుంభేశ్వరస్వామిని పూజిస్తే పునీతులవుతారు అని చెబుతాడు. వారు అలాగే చేస్తారు.  వారికి సహాయం చేయటానికి కాశీ విశ్వేశ్వరుడు స్వయంగా ఇక్కడికి వచ్చాడుట.  నవ కన్యలు ఆయనని ఇక్కడ వెలిసి భక్తులను కరుణిచమని కోరగా స్వామి అంగీకరించి ఇక్కడ వెలిశాడు.  అందుకే ఈయనకి కాశీవిశ్వేశ్వరుడని పేరు (కాశీనుంచి వచ్చి ఇక్కడ వెలిశాడు గనుక).  స్వామితో బాటు అమ్మ విశాలాక్షి కూడా.

ఈ నవ కన్యలు ప్రతి 12 సంవత్సరాలకొకసారి జరిగే మహామహంకి (కుంభమేలాలా జరుగుతుంది) వచ్చి ఇక్కడి మహామహంలో (చెరువు/పుష్కరిణి) స్నానం చేస్తారనీ, అందుకే ఆ సమయంలో ఇక్కడ స్నానం చేసినవారికి అన్ని ప్రముఖ నదులలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుందంటారు.  ఇక్కడ ఉపాలయంలో వీరివి పెద్ద విగ్రహాలున్నాయి. ఆడ పిల్లలు వయసు పెరిగినా వివాహ యోగ్యులు కాకపోతే ఈ ఆలయంలో నవ కన్యలను ప్రార్ధిస్తారుట.  వీరేకాక, వివాహం, పిల్లలు ఆలస్యమయినవారు, 16 శుక్రవారాలు నవకన్యలను పూజించి, ఉపవాసం వుంటారు.  దానితో వారి కోరిక తీరుతుందని ఇక్కడి విశ్వాసం.

రామాయణ కాలంలో సీతాన్వేషణ చేస్తూ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఇక్కడికి వచ్చారుట.  ఆసమయంలో అగస్త్య మహాముని సలహాపై శ్రీ రామచంద్రుడు ఇక్కడ శివలింగం స్ధాపించి పూజించి, రుద్రాంశ పొందాడుట.  ఎందుకంటే శ్రీరామచంద్రుడు రావణాసురునితో యుధ్ధం చేసి సీతని విడిపించటానికి తన సాత్విక తత్వాన్ని విడనాడి కొంత ఉగ్ర తత్వాన్ని కూడా తెచ్చుకోవాల్సి వుంది.  అలా అగస్త్య మహాముని సలహా ప్రకారం అక్కడ శివుణ్ణి పూజించి, తగిన శక్తి పొందాడుగనుక ఈ క్షేత్రాన్ని కోరిన కోర్కె సిధ్ధించే సిధ్ధి క్షేత్రంగా  చెబుతారు.

శ్రీరామచంద్రుడు ప్రతిష్టించిన లింగాన్ని ఇక్కడ వేప చెట్టు కింద  చూడవచ్చు. ఈ దైవం గురించి 7వ శతాబ్దంలో తిరుజ్ఞాన సంబంధార్, తిరునవుక్కసర్ పాడారు. 


పూజలు, ఉత్సవాలు
ఉదయం 6 గం. ల నుంచి రాత్రి 9 గం. ల దాకా ఆరు సమయాల్లో వివిధ పూజలు చేస్తారు.  ఇవి కాక వారంలో, పక్షంలో, నెలలో ముఖ్యమైన రోజులలో, తిధులలో చేసే విశేష పూజలుంటాయి. ఏడాదికి 12 సార్లు చేసే ముఖ్యమైన ఉత్సవాలు వుంటాయి  వీటిలో పది రోజులు జరిగే మాఘ మాసి ముఖ్య ఉత్సవం.

దర్శనం అయింది కదా...కొంచెం అలా వెళ్తే అభిముఖేశ్వర ఆలయం వున్నది. అప్పుడే అలసి పోయారా? అభిముఖేశ్వరుణ్ణి, మహామహాన్ని దర్శిస్తే ఈ పూట మన ప్రోగ్రాం అయిపోయినట్లే.  పదండి.

 

 .. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)