కుంభకోణం యాత్ర –7 నాగేశ్వరార్ కోవెల
ఇప్పుడు మనం నాగేశ్వరస్వామి ఆలయానికి, అదేనండీ .. ఇక్కడివారు నాగేశ్వరార్ కోవెల అంటారు వచ్చాము. ప్రళయ సమయంలో అమృతభాండం ఈ ప్రదేశానికి వచ్చిందనీ, అందులో సామాను ఇక్కడ అంతా పడి చెట్లుగా, శివ లింగాలుగా మారాయి అని చెప్పాను కదా. ఇక్కడ కలశంలోని బిల్వ పత్రాలు పడి బిల్వ వనం ఏర్పడింది. ఆది శేషుడు ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్టించాడు...దానికి సంబంధించి ఒక కధ వుంది. అదేమిటంటే... మన పురాణ గాధల ప్రకారం ఆది శేషుడు భూభారాన్ని మోస్తూ వుంటాడు కదా. భూమి మీద జనం చేస్తున్న పాపాల వల్ల భూ భారం పెరిగి శేషుడికి మొయ్యలేని భారమయింది. ఆయన కైలాసంలో శివుడికి మొర పెట్టుకున్నాడు. ఈ భరించలేని భారం మోసే శక్తి ఇవ్వమని. శివుడు ఆది శేషుడికి ఒక్క తలతోనే ఆ భారం మోసే శక్తి ఇస్తానని భరోసా ఇస్తాడు. (ఆది శేషుడికి వెయ్యి తలలు). ఆది శేషుడు శివుని ఆశీస్సులతో కుంభకోణంలోని ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ శివ లింగం ప్రతిష్టించి పూజించాడు. నాగులకు రాజైన నాగరాజు ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్టించి పూజించాడు గనుక ఈ స్వామి పేరు నాగేశ్వర స్వామి (తమిళంలో నాగేశ్వరార్). బిల్వ వనంలో వున్నాడు కనుక బిల్వవనేశ్వర్.
కుంభకోణానికి అతి దగ్గరలో వున్న తిరునాగేశ్వరానికీ, దీనికీ కన్ఫ్యూజ్ కాకండి. అది వేరు. ఇది వేరు. అక్కడికీ తీసుకెళ్తాను. గర్భాలయం శివ లింగం చిన్నదే. పెద్ద పీఠం పై వుంటుంది. ఆది శేషు ప్రతిష్టించిన లింగం కనుక రాహు దోష నివారణార్ధం భక్తులు ఇక్కడ సోమ గురు వారాలలో పూజలు చేస్తారు. రాహు దోషం వల్ల వివాహం జరగటం, పిల్లలు పుట్టటం ఆలస్యం అవవచ్చు. ఆలయంలో విష్ణు దుర్గ, సూర్యనారాయణ వగైరా ఇతర దేవతా మూర్తులను కూడా దర్శించవచ్చు.
ఆలయ నిర్మాణం:
9 వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. సృష్ట్యాదినుంచి వున్న ఈ క్షేత్రం గురించి 7వ శతాబ్దంలో తిరుజ్ఞాన సంబంధార్ రచించిన తేవరమ్ లో చెప్పబడింది. చోళుల కళాభిరుచికి దర్పణంగా వున్న ఈ ఆలయంలో పలు విగ్రహాలు, డిజైనులు చాలా అందంగా మలచబడ్డాయి. వీటిలో దేవతా విగ్రహాలే కాక ఆ కాలంలో రాజులవి, దాతలవి కూడా వున్నాయి. పూర్వం ఈ ఆలయం చుట్టూ చెట్లు, చేమలు ఇష్టం వచ్చినట్లు పెరిగి ఆలయం శిధిలావస్తలో వున్నది. పడగచెర్రి రామలింగస్వామి అనే శివ భక్తుడు జోలె పట్టి అందరినీ డబ్బులు అడుక్కుని తీసుకువచ్చి ఆ డబ్బుతో కొంచెం కొంచెంగా ఆలయాన్ని అభివృధ్ధి చేసి, కుంభాభిషేకం కూడా చేయించాడు.
ఆలయం లోపలకి ప్రవేశిస్తుంటే ఎడమవైపు తోట (మేము చూడలేదు సమయం లేక) కుడివైపు అమ్మ పెరియనాయకి ఆలయం, నటరాజు ఆలయం కనిపిస్తాయి. పెరియనాయకి అమ్మ పెరియనాయకి ప్రత్యేక ఆలయంలో, అభయ హస్తంతో భక్తులను దీవిస్తూ వుంటుంది. నటరాజు ఆలయం ఈ నటరాజు ఆలయం చూశారా? గుఱ్ఱాలు, ఏనుగులు లాగుతున్న రధంలాగా లేదూ? ఇలా రధం ఆకారంలో వున్న ఆలయం ఇంతకు ముందు మనం సారంగపాణి ఆలయం చూశాం. ఈ రెండే కాక దారాసురంలో కూడా ఇలాంటి ఆలయం ఇంకొకటి వున్నది. లోపలకెళ్దాం పదండి. ఈ మందిరంలో నటరాజు నాట్యానికి తాళం వేస్తున్న అమ్మ శివకామి, వేణువు వాయిస్తున్న విష్ణుమూర్తిని చూడవచ్చు. ఇక్కడ ఏనుగుల మీద రాజులున్నారు చూశారా. వీళ్ళు ఎవరో తెలియలేదు.
విశేషం
ఇంకో నిర్మాణ నైపుణ్యం ఏమిటో తెలుసా ఇక్కడ? చిత్తిరై మాసంలో మొదటి మూడు రోజులు సూర్య కిరణాలు స్వామిని తాకుతాయి గంగై వినాయగర్ రాజేంద్ర చోళుడు గంగా తీరందాకా తన రాజ్యాన్ని విస్తరించాడని చరిత్రలో చదువుకున్నాం కదా. అలాంటి ఒక యుధ్ధంనుంచి సైన్యం తమ విజయ చిహ్నంగా ఒక వినాయకుడి విగ్రహాన్ని తీసుకు వచ్చారుట. ఆ విగ్రహాన్ని ఈ ఆలయంలో చూడవచ్చు.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)