మహాభారత యుద్దంలోని విధ్వంసకర ఆయుధాల గురించి తెలుసా!
మహాభారత యుద్దంలోని విధ్వంసకర ఆయుధాల గురించి తెలుసా!
మహాభారత యుద్ధం కేవలం కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్దం మాత్రమే కాదు, ఆ యుగంలోని గొప్ప యోధులు, వారి శక్తివంతమైన ఆయుధాల ప్రదర్శనకు ఇది వేదిక అయ్యింది. కురుక్షేత్ర యుద్ధభూమిలో భీముడు, కర్ణుడు వంటి శక్తివంతమైన యోధులు యుద్దంలో నిలబడ్డారు. మరొకవైపు ప్రాణాలను ఈ విశ్వాన్ని కూడా ఎంతో సులువుగా తుడిచిపెట్టే శక్తి కలిగిన దైవిక ఆయుధాలు కూడా యుద్దంలో ఉపయోగించారు. నేటికాలంలో అణ్వాయుధాలను మించి శక్తి కలిగినవిగా మహాభారత యుద్ద ఆయుధాలను పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు తన ఆలోచన, జ్ఞానం, దైవిక శక్తితో ఈ ఆయుధాల ప్రభావాలను నియంత్రించకపోతే ఈ యుద్ధం తర్వాత భూమిపై జీవజాలం అనేది అస్సలు ఉండేది కాదని, పూర్తీగా తుడిచిపెట్టుకుపోయి ఉండేదని చెబుతారు. మహాభారత యుద్ధాన్ని చరిత్రలో అత్యంత వినాశకరమైన యుద్ధంగా మార్చిన ఐదు వినాశకరమైన ఆయుధాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
పాశుపతాస్త్రం..
పాశుపతాస్త్రం శివుడి ఆయుధం. ఇది చాలా మర్మమైనది, శక్తివంతమైనది. అర్జునుడు కఠినమైన తపస్సు చేసి ఈ ఆయుధాన్ని శివుడి నుండి పొందాడు. మనస్సు వేగంతో కదిలడం దీని ప్రత్యేకత. ఒకే ఒక్క ఆలోచనతో మొత్తం విశ్వాన్ని నాశనం చేయగలదు. ఇది అధర్మవంతులను, రాక్షసులను నాశనం చేయడానికి మాత్రమే ఉపయోగించబడింది. దీనిని అమాయకులు, మంచి గుణం కలిగిన వ్యక్తుల మీద ప్రయోగిస్తే.. ఆ ప్రయోగించిన వ్యక్తినే నాశనం చేస్తుందట. విశ్వంలో శివుని త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం మాత్రమే దాని శక్తిని ఎదుర్కోగలవని చెబుతారు.
నారాయణాస్త్రం..
నారాయణాస్త్రం విష్ణువు ఆయుధం. ఈ ఆయుధం చాలా భయంకరమైనది. దీన్ని ప్రయోగిస్తే విశ్వం అంతటా వినాశనం కలిగిస్తుంది. అశ్వత్థామ దీనిని పాండవ సైన్యానికి వ్యతిరేకంగా ఉపయోగించాడని చెబుతారు. ఈ ఆయుధాన్ని ఎదుర్కోవడం అసాధ్యం. ఇది ఆయుధాలు ధరించిన యోధులను ఎంపిక చేసుకుని చంపిందని చెబుతారు. ఈ ఆయుధం నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం వారి ఆయుధాలను విడిచిపెట్టి పూర్తిగా లొంగిపోవడమే. శ్రీకృష్ణుని ఆదేశం మేరకు, పాండవ సైన్యం తమ రథాల నుండి కిందకు దిగి నమస్కరించడం ద్వారా ఈ ఆయుధం నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నారట.
వాసవి శక్తి..
ఇంద్రుడు కర్ణుడికి ఇచ్చిన ఆయుధమే వాసవి శక్తి. దీన్ని అమోఘ అని పిలిచారు. అంటే ఎప్పటికీ విఫలం కానిది అని అర్థం. కర్ణుడు ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చిన తర్వాత ఇంద్రుడు కర్ణుడికి వాసవి శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. ఈ ఆయుధాన్నికేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలరు. అందుకే కర్ణుడు ప్రత్యేకంగా అర్జునుడిని చంపడానికి ఈ ఆయుధాన్ని భద్రపరుచుకున్నాడు. కానీ భీముడి కుమారుడు ఘటోత్కచుడు కౌరవ సైన్యంపై విధ్వంసం సృష్టిస్తుంటే ఏమీ చేయలేక చివరికి వాసవి ఆయుధాన్ని ప్రయోగించి ఘటోత్కచుడిని సంహరించాడు.
సుదర్శన చక్రం..
శ్రీ కృష్ణుడి సుదర్శన చక్రం కేవలం ఆయుధం కాదు, ధర్మం, న్యాయానికి చిహ్నం. యుద్ధంలో ఆయుధాలు చేపట్టనని శ్రీ కృష్ణుడు ప్రతిజ్ఞ చేసినప్పటికీ, అతని చక్రం పరోక్షంగా అధర్మాన్ని నాశనం చేసిందని చెబుతారు. యుద్ధానికి సాక్ష్యంగా నిలిచిన బార్బరికుడి తల శ్రీ కృష్ణుడి సుదర్శన చక్రం మాత్రమే యుద్ధభూమిలో తిరుగుతూ, పాపులను నాశనం చేసిందనే రహస్యాన్ని వెల్లడించింది. ఈ చక్రం దాని లక్ష్యాన్ని ఛేదించి తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు చేరింది.
బ్రహ్మాస్త్రం..
బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మ దేవుడు రూపొందించిన ఆయుధంగా చెబుతారు. బ్రహ్రాస్త్రం చాలా శక్తివంతమైనది. అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ వంటి కొద్దిమంది యోధులు మాత్రమే దానిని ప్రయోగించగలిగారు. అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రం సైనికులను చంపడమే కాకుండా ఉత్తరుడి పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేసింది. పురాణ గ్రంథాలలో ఉన్న సమాచారం ప్రకారం ఒక బ్రహ్మాస్త్రం ప్రభావాన్ని మరొక బ్రహ్మాస్త్రం ద్వారా మాత్రమే ఎదుర్కోగలరు. కానీ బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత భూమి కొన్ని వేల సంవత్సరాలు బంజరు భూమిగా మారిపోతుంది.
*రూపశ్రీ