మహాభారతంలో సుభద్ర వివాహం ఎలా జరిగిందో తెలుసా!
మహాభారతంలో సుభద్ర వివాహం ఎలా జరిగిందో తెలుసా!
సుభద్ర మహాభారతంలో కనిపించే ప్రధాన పాత్ర. శ్రీకృష్ణుడి సోదరిగా సుభద్రను చెబుతారు. మహాభారతంలో సుభద్ర, అర్జునుడికి వివాహం జరుగుతుంది. ఈ వివాహం కూడా పూర్తీగా శ్రీ కృష్ణుడి ఆశీర్వాదంతోనే జరుగుతుంది. అర్జునుడు, సుభద్ర ల వివాహం పూర్తీగా ప్రేమ, గౌరవం, నమ్మకం, సరైన మార్గదర్శకత్వం పైన ఆధారపడి ఉంటుంది. శ్రీకృష్ణుడు సహనం, జ్ఞానం, ధర్మంతో పరిష్కారం అందించి వీరి వివాహానికి సరైన మార్గం చూపించాడు. అర్జునుడు, సుభద్రల వివాహం ఎలా జరిగింది? దీని వెనుక జరిగిన కథ ఏమిటి? తెలుసుకుంటే..
వనవాస సమయంలో అర్జునుడు తీర్థయాత్ర నిమిత్తం ద్వారకకు వచ్చాడట. అతని రాక గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమ, గౌరవంతో అర్జునుడికి స్వాగతం పలికాడు. చాలా కాలం తర్వాత కలుసుకున్న ఆ ఇద్దరు మిత్రులు తమ అనుభవాలను పంచుకుని, కొన్ని రోజులు కలిసి గడపాలని అనుకున్నారు.
శ్రీకృష్ణుడు అర్జునుడిని రైవతక పర్వతం మీద జరిగిన ఒక ఉత్సవానికి తీసుకువెళ్ళాడు. అక్కడ యాదవ వంశపు రాకుమారులు, రాకుమార్తెల మధ్య సుభద్ర కూడా ఉంది. సుభద్రను మొదటిసారి చూసిన అర్జునుడు, ఆమె సౌందర్యానికి, వినయానికి, తేజస్సుకు ఎంతగానో ముగ్ధుడయ్యాడు. సుభద్ర నిరాడంబర స్వభావం, మంచి వ్యక్తిత్వం అర్జునుడిలో ఆమె పట్ల ప్రేమను రేకెత్తించాయి. సుభద్ర తనకు ఆదర్శవంతమైన జీవిత భాగస్వామి అవుతుందని అర్జునుడు భావించాడు. అప్పుడు అర్జునుడు తన మనసులో ఉన్న విషయాన్ని శ్రీకృష్ణునికి తెలియజేయాలని అనుకున్నాడు.
అర్జునుడు సుభద్రను వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు, స్వయంవరం ఫలితం స్పషంగా ఉండదని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అందువల్ల, క్షత్రియ సంప్రదాయం ప్రకారం సుభద్రను అపహరించమని ఆయన సూచించాడు. ఆనాటి పరిస్థితులు, ఆచారాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కృష్ణుని ప్రణాళిక ప్రకారం, అర్జునుడు సరైన సమయంలో సుభద్రను తన రథంలో తీసుకువెళ్ళాడు. ఈ సంఘటన యాదవ వంశంలో కలకలం రేపింది, కానీ కృష్ణుడు అర్జునుడు యోగ్యుడు, ధైర్యవంతుడు , సద్గుణవంతుడని అందరినీ ఒప్పించాడు. చివరికి, అందరూ ఆ సంబంధాన్ని అంగీకరించారు.
వారి కుటుంబాల అంగీకారం పొందిన తరువాత, అర్జునుడు , సుభద్ర సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహం మహాభారతంలోని అత్యంత ప్రసిద్ధ సంఘటనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వారి కుమారుడైన అభిమన్యుడు, ఆ తరువాత కురుక్షేత్ర యుద్ధంలో సాటిలేని ధైర్యసాహసాలను ప్రదర్శించాడు.
*రూపశ్రీ.