చీకటిలో వెలుగు చూపే భగవద్గీతలోని విషయాలు..!

 

చీకటిలో వెలుగు చూపే భగవద్గీతలోని విషయాలు..!


ప్రతి వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు, దీని కోసం  కృషి చేస్తాడు కూడా. కానీ  పగలు  రాత్రి కష్టపడి పనిచేసినప్పటికీ చాలాసార్లు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతుంటారు. ఇది నిరాశకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఓపికగా చాలా ముఖ్యమవుతుంది.  ఓపికతోనూ, చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఈ సమయంలో చేసే తప్పులు  భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. జీవితంలో అన్ని వైపుల నుండి నిరాశ ఎదురైనప్పుడు, ధైర్యం కూడా సన్నగిల్లడం మొదలైనప్పుడు మనిషి సానుకూలంగా ఉండటం చాలా ముఖ్యం.   సానుకూలంగా ఉండటానికి ప్రతిరోజూ భగవద్గీతను చదవాలి.  భగవద్గీత జీవితంలో సానుకూలంగా ఎలా ఉండాలో.. సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్పుతుంది. భగవద్గీతలో ఉన్న విషయాలు మనిషి ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నా వాటికి పరిష్కారం చూపుతుంది. అవేంటో తెలుసుకుంటే..

భగవద్గీత ప్రకారం.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కోపం తెచ్చుకోకూడదు. దురాశ,  కోపం నరకానికి ద్వారాల వంటివి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఏదైనా పని సాధించాలంటే ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక లేకుండా పనిచేయడం వల్ల ఎల్లప్పుడూ సమస్యలు వస్తాయి, దీని వల్ల  ఎవరికీ ప్రయోజనం ఉండదు.

కొన్నిసార్లు కష్టపడి పనిచేసినా, ఫలితాలు సాధించలేరు. ఇలా జరిగినప్పుడు నిరుత్సాహపడటానికి బదులుగా, మంచి పనులు చేస్తూ.. మంచి దారిలో వెళుతూ ఉండాలి. గీత ప్రకారం, ఫలితం గురించి చింతించకుండా పని చేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు చేసిన పనికి ఫలితం తప్పక లభిస్తుంది.

ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలి. మంచి పనులు తప్పకుండా ప్రతిఫలాలను తెస్తాయి. జీవితంలో అత్యంత గొప్ప కార్యం దానధర్మం. ప్రతి ఒక్కరూ అవసరంలో ఉన్నవారికి దానం చేయాలి. ఇది శుభ ఫలితాలను తెస్తుంది.

తరచుగా విజయం సాధించడంలో వైఫల్యం ఎదురైతే అది ధైర్యం కోల్పోవడానికి దారితీస్తుంది. ప్రజలు మళ్ళీ ప్రయత్నించడానికి చాలా కష్టపడతారు, భయపడతారు,  ఆత్మవిశ్వాసం కోల్పోతారు. భగవద్గీత ప్రకారం సమస్యలు చుట్టుముట్టినప్పుడు, కిందకు జారిపోతున్నాం అనే బావన కలిగినప్పుడు దైవం వెంట ఉంటాడనే విషయాన్నిమర్చిపోకుండా దైర్యం తెచ్చుకోవాలి.  దైవం మీద ఉన్న నమ్మకమే మనిషిని నిలబెడుతుంది.

                                   *రూపశ్రీ.