కర్ణుడి ప్రతిజ్ఞ.. అర్జునుడిని మాత్రమే ఎందుకు చంపాలని అనుకున్నాడు!

 

కర్ణుడి ప్రతిజ్ఞ.. అర్జునుడిని మాత్రమే ఎందుకు చంపాలని అనుకున్నాడు!

మహాభారత యుద్ధంలో కౌరవ పాండవులు మాత్రమే  కాకుండా మరొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నాడు. అతనే  కర్ణుడు. పాండవుల తల్లి అయిన కుంతికి  కర్ణుడు జన్మించాడు.  ఎల్లప్పుడూ అన్యాయాన్ని ఎదిరించే కర్ణుడు  అన్నీ తెలిసి దుర్యోధనుడి పక్షాన నిలిచాడు.  అర్జునుడిని చంపుతానని శపథం చేశాడు.  ఐదుగురు పాండవులు కౌరవులకు శత్రువులు,  కర్ణుడు కౌరవుల పక్షాన నిలిచి పోరాడేవాడు. కానీ  పాండవులలో ఉన్న 5 మందిలో నలుగురిని కాకుండా కేవలం అర్జునిడి మాత్రమే కర్ణుడు లక్ష్యం చేసుకోవడం, అర్జునుడిని మాత్రమే చంపుతనని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.  పాండవులను అందరినీ వదిలి కేవలం అర్జునిడి మీదనే కర్ణుడు ద్వేషం పెంచుకోవడానికి కారణాలు ఏంటి?  చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుంటే..

అర్జునుడే లక్ష్యం..

మహాభారతంలో కర్ణునికి అర్జునుడిపై ఉన్న వ్యక్తిగత అయిష్టతను స్పష్టంగా సూచించే అనేక ప్రస్తావనలు ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధభూమిలో కూడా, కర్ణుని లక్ష్యం మిగతా నలుగురు పాండవులు కాదు, ఎప్పుడూ అర్జునుడే. కర్ణుడు తన సొంత సోదరుడు, పరాక్రమవంతుడైన విలు విధ్య వీరుడు.

అసూయ..

కర్ణుడు అపారమైన శక్తిమంతుడు, ఐదుగురు పాండవుల కంటే గొప్ప శౌర్యం, యుద్ధ నైపుణ్యాలు కలిగినవాడు. కానీ, అర్జునుడు ఎప్పుడూ అత్యంత పరాక్రమవంతుడైన విలు విధ్య వీరుడిగా పేరొందాడు.  ఈ విషయం కర్ణుడిని ఎప్పుడూ బాధించేది.  అదే  అర్జునుడి మీద ద్వేషంగా మారింది.

స్నేహం..

ప్రపంచం కర్ణుడిని రథసారథి కొడుకని తిరస్కరించింది. అలాంటి సమయంలో దుర్యోధనుడే అతడిని గౌరవించి అంగరాజ్యానికి రాజుగా చేశాడు. దుర్యోధనుడు పాండవులను ద్వేషించడం, అర్జునుడు వారి గొప్ప బలం కావడం వల్ల, కర్ణుడు తన స్నేహితుడైన దుర్యోధనుడిపై ఉన్న విశ్వాసంతో యుద్ధంలో గెలవడానికి అర్జునుడిని తన ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నాడు.

ద్రౌపది ఎగతాళి..

స్వయంవరంలో ద్రౌపది కర్ణుడిని రథసారథి కొడుకని అవమానించింది. అదే  స్వయంవరంలో అర్జునుడు  గెలిచి ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన కూడా కర్ణుడికి చాలా బాధ కలిగించింది.

గురువుల ఆశీర్వాదం..

అర్జునుడు ఎప్పుడూ గురువుల పట్ల వినయంగా ఉండేవాడు. దీంతో గురువుల ఆశీర్వాదం మెండుగా ఉండేది. అందరూ అర్జునుడిని ఇష్టపడేవారు.   కర్ణుడు, ప్రతిభావంతుడైనప్పటికీ గురువుల నుండి విద్యను అభ్యసించలేకపోయాడు. కర్ణుడికి ఏ గురువుల ఆశ్వాదం లేదు.  దీని కారణంగా అర్జునుడంటే కర్ణుడికి ద్వేషం ఎక్కువ.

కుంతి వాగ్దానం..

యుద్ధభూమిలో పాండవులలో కర్ణుడు కేవలం అర్జునుడిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడానికి ఒక కారణం, తన తల్లి కుంతికి ఇచ్చిన మాట.  యుద్దంలో అర్జునుడిని మాత్రం వదలిపెట్టనని, మిగిలిన నలుగురిని చంపనని కర్ణుడు కుంతికి వాగ్దానం చేశాడని చెబుతారు. అర్జునుడు మరణించినా నాతో కలిపి నీకు ఐదు మంది కొడుకులు ఉంటారని,  ఒకవేళ నేను మరణించినా ఐదు మంది పాండవులు  అలాగే ఉంటారని కుంతికి కర్ణుడు చెప్పినట్టు చెబుతారు.

పై విషయాల కారణంగా కర్ణుడికి అర్జునుడు అంటే చాలా ద్వేషం,  మహాభారత యుద్దంలో కేవలం అర్జునుడిని చంపితే చాలని లక్ష్యం చేసుకున్నాడు.

                                   *రూపశ్రీ.