ఆశల పాశం చేసే మాయ ఎలాంటిదంటే..

 

 ఆశల పాశం చేసే మాయ ఎలాంటిదంటే..


సర్వసంగపరిత్యాగియై అరణ్యంలో కుటీరం వేసుకొని జీవించే ఓ సాధువు జీవించేవాడు. ఆయనకు  రెండు కౌపీనాలు ఉండేవి. ఒకరోజు ఒక కౌపీనాన్ని ఎలుక కొరికివేసింది. వాటిని ఎలుకల నుంచి కాపాడుకునేందుకు సాధువు ఒక పిల్లిని పెంచుకోసాగాడు. ఆ పిల్లిని పోషించుకునే నిమిత్తం ఒక ఆవును కూడా కొనుక్కున్నాడు. ఆవును చూసుకోవటం కోసం ఒక పనివాణ్ణి నియమించాడు. క్రమక్రమంగా ఆవుల సంఖ్య పెరిగింది. అవి మేయటానికి పచ్చికబయళ్ళను కొనుగోలు చేశాడు. ఆ బయళ్ళను సాగు చేసేందుకు అనేకమంది నౌకర్లను నియమించాడు.


ఈ విధంగా మెల్లమెల్లగా ఆ సాధువు కాస్తా భూస్వామిగా మారిపోయాడు. అటు నుంచి ఆశ కాస్తా ఆస్తుల నుంచి అతివ వైపునకు మరలింది. చివరకు ఓ శుభముహూర్తంలో ఓ ఇంటివాడయ్యాడు. కొంతకాలం తరువాత అతడి మిత్రుడైన మరో సాధువు ఆ దారి గుండా వెళుతూ  ఈ సాధువు సంసారాన్ని చూసాడు. , ఆయన సంసారాన్ని చూడగానే  విస్తుపోయాడు. 


"సాధువులా ఉన్న నువ్వు ఇలా మారిపోవడానికి కారణం ఏంటి?" అని  అడిగాడు. 


అప్పుడు ఆ సాధువు 'ఇదంతా ఓ కౌపీనంపై పెంచుకున్న ఆశతో దాపురించిన లంపటం' అని అన్నాడు.


  శ్రీరామకృష్ణ పరమహంస ఈ దృష్టాంతాన్ని చెప్పి ఆశలపాశం ఎక్కడిదాకా  తీసుకువెళుతుందో హెచ్చరించేవారు. అంత సులువుగా మనస్సు వైరాగ్యానికి సుముఖత చూపదు. ఏ క్షణంలో ఏ వైపు నుంచి వచ్చి కాటేస్తుందో తెలియని కాలసర్పం లాంటిది కోరిక. అలాంటి ఆ 'ఆశ' ఎంతటి పరిత్యాగినైనా పట్టిపీడిస్తుందని ఆదిశంకరాచార్యుల 'భజ గోవిందం... భజ గోవిందం'లో గుర్తుచేస్తూ... సుబోధుడు


అగ్రే వహ్నిః పృష్టే భానూ, రాత్రే చుబుక సమర్పిత జానుః। కరతలభిక్ష స్తరు తలవాసః, తదపి న ముంచత్యాశా పాశః||


'అగ్ని ముందరుంటుంది. సూర్యుడు వెనుక ఉంటాడు. రాత్రి చలికి ముడుచుకొని మోకాలికి గడ్డం ఆన్చి కూర్చుంటాడు. భిక్షాటనం చేసి జీవిస్తాడు. చెట్టుకిందే ఉంటాడు. కానీ ఆశలపాశాల నుంచి మాత్రం తప్పుకోలేడ'ని స్పష్టం చేస్తున్నాడు. మనిషి ఈ భౌతిక సుఖాల మీద అంత సులువుగా మనసు పక్కకు తిప్పలేడు. ఆశల పాశం చేసే మాయ ఇది.


                                       *నిశ్శబ్ద.