కుంభకోణం యాత్ర – 3
కుంభకోణం యాత్ర – 3
ఆది కుంభేశ్వరాలయం – 2
ఆది కుంభేశ్వర ఆలయం అదిగో. దాని నిర్మాణాన్ని పరిశీలించండి.
ఆలయ నిర్మాణం
కుంభకోణం ఊరు మధ్యలో 4 ఎకరాల స్ధలంలో, 3 ప్రాకారాలతో విలసిల్లుతున్న ఆలయం ఇది. ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు. వీటిలో ఎత్తయినది అదిగో .. ఆ తూర్పు గోపురం. 11 అంతస్తులతో 128 అడుగుల ఎత్తులో వుంటుంది. ఈ కారిడార్ వుంది చూశారా? దీని పొడవు 330 అడుగులు, వెడల్పు 15 అడుగులు. రాజగోపురంనుంచీ, ఆలయం దాకా వుంటుంది ఈ కారిడార్. దీనిలోని స్తంభాలు చూడండి! ఎన్ని వున్నాయో!! వీటిమీద శిల్ప కళ కూడా ఎంత బాగుందో చూడండి!!
ఈ కారిడార్లు, మండపాలు వివిధ శిల్పాలతో విరాజిల్లుతున్నాయి. కొంచెం తలెత్తి ఈ ముందు మండపం పై కప్పు చూడండి. శివుని వివిధ నృత్య రీతులు ఎంత అద్భుతంగా చిత్రీకరించబడ్డాయో! ఆలయానికి 5 వెండి రేకులు తాపడం చెయ్యబడిన రధాలు వున్నాయి. ఇవికాక వివిధ వాహనాలు వెండిరేకుతో తాపడం చెయ్యబడినవి వున్నాయి. ఉత్సవాల సందర్భంగా దేవతా మూర్తులను వీటిమీద ఊరేగిస్తారు.
ప్రస్తుతం వున్న ఆలయం 7 – 9 శతాబ్దాలలో చోళ రాజుల సమయంలో నిర్మింపబడింది. తర్వాత 15 – 17 శతాబ్దాలలో తంజావూరు నాయకుల సమయంలో ఆలయం విస్తరించబడింది. ఇంక ఆలయంలో కొలువు తీరిన దైవాలను గురించి తెలుసుకుందాము.
ఆలయంలో దేవతా మూర్తులు
ప్రధాన ఆలయం ఆది కుంభేశ్వరునిది. అమృత భాండాన్ని ఛేదించిన తర్వాత శివుడు ఇక్కడ తపస్సు చేసి ఆ శక్తిని ఈ లింగంలో పొందుపరచాడు. అంటే ఈ లింగం ఎంత ప్రశస్తమయినదో కదా! ప్రదక్షిణా మార్గంలో శివలింగాలు, నాయన్మారులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వగైరా అనేక దేవతా మూర్తులను దర్శిస్తూ నడవండి.
ముఖ్య ఆలయంలో కుంభేశ్వరుని లింగం మామూలుగా మనం చూసే శివ లింగాలకన్నా కొంచెం భిన్నంగా వుంటుంది. కింద వెడల్పుగా వున్న శివలింగం పైకి వెళ్ళేసరికి కూజా మూతిలాగా సన్నగా వుంటుంది. అమృత కలశం ఆకారమని భావిస్తారు. అమృతం, ఇసుకతో కలిసిన లింగం కనుక దీనికి అభిషేకాలుండవు.
అమ్మవారు మంగళనాయకికి పక్కనే ప్రత్యేక ఆలయం. శివుడు ఇక్కడ వెలిశాడని తెలిసి కైలాసం నుంచి పార్వతీ దేవి కూడా ఇక్కడికి వచ్చింది. పార్వతీ దేవిని చూసిన శివుడు సంతోషంతో ఉప్పొంగి అమ్మవారిని తన ఎడమ వైపున కూర్చోమని చెప్పాడు. ఆ ఆదేశంతో పార్వతీ దేవి శివుడి పక్కనే వెలిసింది. ఈవిడని అర్చించినవారికి సకల మంగళాలూ కలుగుతాయని ఈవిడ పేరు మంగళనాయకి అన్నాడు శివుడు. .. 51 శక్తి పీఠాలలో మొదటి పీఠం అంటారు. శివుడు తన శరీరంలో సగ భాగం పార్వతీ దేవికి ఇచ్చేటప్పుడు తన మంత్ర శక్తిలో కొంత మంత్ర శక్తిని కూడా అమ్మవారికిచ్చారుట. అలాగే నేను అక్కడ సేకరించిన సమాచారం ప్రకారం శివుడు ఇచ్చిన మంత్ర శక్తి, ఆ దేవికున్న మంత్ర శక్తి, రెండూ కలిపి మంత్ర శక్తి అధికంగా వున్నదిట ఈ అమ్మవారికి. అందుకే మంత్ర పీఠేశ్వరి అంటారు ఈ తల్లిని.
చదువులో ఉన్నత స్ధాయిని సంపాదించటానికి, వివాహానికి, పిల్లలకోసం, వ్యాపార ఉద్యోగాలలో అభివృధ్ధి కోసం ఈ దేవిని శరణు కోరుతారుట.
ఆలయం ముందు పొట్రమరి పుష్కరిణి వున్నది. (ఈ పుష్కరిణి గురించి కూడా మాకు చెప్పేవాళ్ళు లేక చూడలేదు). మహామహంలో స్నానం చేసిన భక్తులు ఇక్కడా చేస్తారు. నవ కన్యలు మహా మహంలో స్నానం చేసిన తర్వాత ఇక్కడా చేస్తారని నమ్మకం. అందుకే భక్తులు ఇక్కడ కూడా స్నానం చేస్తారు.
వైష్ణవులకు 108 పుణ్య క్షేత్రాలున్నట్లే శైవులకూ 127 పుణ్య క్షేత్రాలున్నాయి. వీటిని దర్శించి శివుని స్తుతించినవారిని నాయన్మారులనీ, ఆ స్తుతులను తేవరమ్ లనీ అంటారు.. కుంభేశ్వరుణ్ణి సందర్శించి స్తుతించినవారు తిరుజ్ఞాన సంబందార్.
ఉత్సవాలు
సప్తాస్ధానం .. ఏప్రిల్ – మే నెలలలో జరుగుతుంది. ఇందులో స్వామి, అమ్మవారు 20 కి.మీ. లలో వున్న 7 క్షేత్రాలను దర్శిస్తారు.
స్వామి కళ్యాణం, తిరు మంజనం, ఆడి పూరమ్ వగైరా ఉత్సవాలు బాగా జరుగుతాయి.
ఒక గంట పైన ఆలయమంతా తిరిగి చూసి ఉదయం 9-45కి బయటకి వచ్చాము. ఒక కిలో మీటరు అలా నడిస్తే వేరే ఆలయానికి వెళ్ళచ్చు. కానీ, వేరే ఊరునుంచి వెళ్ళినవాళ్ళకి సమయం కూడా కలిసి రావాలికదా. అందుకే ఆటో మాట్లాడుకుని మధ్యాహ్నం 12 గం. ల దాకా ఇంకొక ఆరు ఆలయాలు, మహామహం చూసి హోటల్ కి చేరాము. ఆటోకి రూ. 400. చూడ వలసిన ఆలయాల లిస్టు నేనే చెప్పాను. హోటల్ లో బయల్దేరే ముందే ఆ పూట ఏమి చూడాలో, దగ్గర దగ్గర వుండే వాటినన్నింటినీ లిస్టు వేసుకునేదాన్ని. అదే లిస్టు మీకూ ఇస్తున్నాను. మీ వీలుని బట్టి మీరు చూడండి. ఈ పూట మేము చూసినవి...
ఆది కుంభేశ్వర ఆలయం
సోమేశ్వర స్వామి ఆలయం
రామస్వామి ఆలయం
సారంగపాణి ఆలయం
నాగేశ్వర ఆలయం
కాశీ విశ్వేశ్వర ఆలయం
అభిముఖేశ్వర ఆలయం
మహామహం
ఇవ్వన్నీ ఒకదానికి ఒకటి ఒక కిలో మీటరు దూరం లోపే వుంటాయి. కనుక వాహనంలో వెళ్తే సమయం సరిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తు పెట్టుకోండి. దాదాపు అన్ని ఆలయాలు మధ్యాహ్నం 12 గం. కు మూసి తిరిగి సాయంకాలం 4, 5 గం. లకు తెరుస్తారు. అందుకని మధ్యాహ్నం బసకి వచ్చి భోజనం, విశ్రాంతి వగైరాలు చూసుకోవచ్చు. సాయంకాలం కొంచెం తొందరగా బయల్దేరి, ఆలయం తీసే సమయానికి దూరంగా వుండే ఆలయాలకి వెళ్తే సమయం కలసి వస్తుంది.
ఇక్కడనుంచి ఆటో రామస్వామి ఆలయానికి సాగింది. ఎక్కడికి వెళ్తున్నామో మాకు ముందు తెలియదు. అడిగేలోపలే ఆలయం వచ్చేస్తోంది. ఆటో ఆపి ఆలయం పేరు చెబుతున్నాడు డ్రైవర్. ఎందుకైనా మంచిది .. మీరు కాగితం మీద ఆ పూట ఏమి చూడాలనుకున్నారో రాసుకుని, చూసిన వాటికి టిక్కులు పెట్టుకోండి. లేకపోతే అన్ని చూసేటప్పుడు చాలా తికమకగా వుంటుంది.
కుంభకోణం విశేషాలు
ఈ ఊరి ఆలయాల గురించే కాక, ఇక్కడి విశేషాల గురించి కూడా కొంచెం తెలుసుకుందామా?
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లెక్కల మేధావి శ్రీ రామానుజన్ ఇక్కడే పుట్టారు. ఆయనే కాదు ఇంకా అనేక మేధావులకు పుట్టిల్లు కుంభకోణం.
ఇక్కడికి దగ్గరలో వున్న తిరుపువనం పట్టు చీరెలకి ప్రసిధ్ధి.
ఇక్కడి ఇత్తడి ఇంకా ఇతర పాత్ర సామగ్రి మన్నికకు పెట్టింది పేరు.
దీపపు కుందులు కూడా ఇక్కడ బాగుంటాయి.
ఇక్కడ తమలపాకులు చాలా రుచిగా వుంటాయిట.
ఈ విశేషాలన్నీ తర్వాత నేను తెలుసుకుని మీకోసం చెబుతున్నవే. అయితే నేను కుంభకోణంలో చాలా పెద్ద షాపింగ్ చేశానండీ. (సాధారణంగా మేము బయట ఊళ్ళకెళ్ళినప్పుడు షాపింగ్ చెయ్యము). లుంగీలు తక్కువ ధరలో వుంటే (ఒక్కొక్కటి రూ. 130, 140 అలా వున్నాయి). రెండు తీసుకున్నాను. వెడల్పు, పొడుగు ఇక్కడ దొరికే బ్రాండెడ్ వాటికన్నా పెద్దగా వున్నాయి. ఇక్కడ ఒక్కొక్కటీ రూ. 200 పైన వున్నాయి. అక్కడ కొన్నవి ఉతికినా బాగున్నాయి. సో, వెళ్ళిన వాళ్ళంతా లుంగీలు కొనుక్కొచ్చుకోండి.
మీకు తెలిసే వుంటుంది. తమిళనాడులో కాఫీ చిన్న స్టీలు గిన్నెలాంటి దానిలో గ్లాసు పెట్టి ఇస్తారు. నాకూ, మావారికీ అవి ఇష్టం. అందుకే అవి ఆరు కొన్నాను. ఒక్కొక్క సెట్ రూ. 50. మొద్దుగా బాగున్నాయి.
అయ్యో విశేషాల్లో పడి అసలు విషయం మర్చి పోయాము. పదండి పదండి... వేరే ఆలయానికి వెళ్దాము.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)