కుంభకోణం యాత్ర – 4
కుంభకోణం యాత్ర – 4
సోమేశ్వర ఆలయం
ఆటోలో కూర్చునేది ఐదు నిముషాలే .. కానీ మనం ఆలయం చూసే దాకా వాళ్ళు ఆగాలి కదా...అందుకే అంత ఛార్జి. కుంభేశ్వర ఆలయం నుంచి సోమేశ్వర ఆలయానికి వెళ్ళాము.
అమృత కుంభంలోని అనేక పదార్ధాలు అనేక చోట్ల పడి శివ లింగాలుగా, వృక్షాలుగా రూపు చెందాయని తెలుసుకున్నాముకదా. కలశానికి కట్టిన దారాలు (సిక్కమ్) ఇక్కడ పడి శివ లింగంగా రూపొందాయి. అంటే ఈ స్వామి స్వయంభూ. కలశం దారాలనుంచి ఉద్భవించిన ఈ స్వామిని సిక్కేశ్వరార్ అంటారు.
ఈ స్వామిని సేవిస్తే అన్ని రకాలైన రోగాలు, ఎంత పెద్దవైనా సరే నయమవుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు భక్తుల చెడ్డ రోజులు స్వామి దర్శన మాత్రంచేత మంచి రోజులుగా మారుతాయని, వారి అన్ని విధాలైన యాతనలు తుడిచి పెట్టుకు పోతాయనీ అంటారు.
ఈ స్వామి గురించి ఇక్కడివారు చెప్పుకునే ఇంకో విశేషం. తిరుమల శ్రీనివాసుడు ఒకసారి ఇక్కడికి వచ్చి చాలా రోజులు వుండి ఈ స్వామిని ప్రార్ధించాడుట. అప్పుడు ఈయన వెంకటేశ్వరస్వామికి అసురులను సంహరించే శక్తినిచ్చాడుట. అందుకే ఈయనని మాలీశర్ (మాలి అంటే తమిళంలో విష్ణువు అన్నారు) అని కూడా అంటారు. మాలీశర్, దేవేరి మంగళాంబిక ఆలయాలను (సోమేశ్వరాలయంలోనే) వెంకటేశ్వరస్వామి నిర్మించారని చెప్తారు. తూర్పు వైపు రాజ గోపురంలోంచి ఆలయంలోకి ప్రవేశించగానే వీరి దర్శనం చేసుకోవచ్చు.
ఈ ఆలయానికి మూడు వైపులనుంచి ప్రవేశించవచ్చు. ఒక్కొక్క వైపు ఒక్కొక్క దైవాన్ని దర్శించుకోవచ్చు. తూర్పు వైపు నుంచి వచ్చిన వారు మాలీశర్, మంగళాంబిక, కట్టై గోపురం నుంచి వచ్చిన వారు సోమనాధార్, ఆయన దేవేరి తెనర్ మొఝిల దర్శనం ముందు చేసుకుంటారు. అలాగే ఉత్తరం వైపునుంచి వెళ్ళినవారు సోమేశ్వర్, సోమ సుందరిల దర్శనం చేసుకోవచ్చు. మేము ఇటువైపునుంచే వెళ్ళాము. ఎటునుంచి వెళ్ళినా మనం దైవ దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందవచ్చన్నమాట.
చంద్రుడు, తన గురువు బృహస్పతి ఇచ్చిన శాపం పోగొట్టకోవటానికి ఇక్కడికి వచ్చి సిక్కేశ్వరుణ్ణి పూజించి శాపం పోగొట్టుకున్నాడు. చంద్రుడు పూజించాడుగనుకు ఈ ఈశ్వరుడు సోమేశ్వరుడు అయ్యాడు.
నవ గ్రహాల్లో ఒకరైన గురు ఇక్కడ ప్రధాన దైవం సోమేశ్వరుణ్ణి పూజించాడని, అందుకే ఆయనకి వ్యఝ (గురు) సోమేశ్వరుడు, లేకపోతే గురు సిక్కేశ్వర్ అనే పేరు వచ్చింది. వీరిద్దరికీ ఇష్టమయిన సోమ, గురు వారాలలో ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తారు.
ఈ ఆలయంలో నటరాజు, శివగామి, ఇంకా అనేక విగ్రహాలు చూడవచ్చు. ఇక్కడ నటరాజుని కన నట్టమ్ ఉదయార్ అంటారు. అంటే భక్తులు ఆయనని సేవించకపోయినా ఆయనకేమీ నష్టం లేదు. ఆ నష్టం భక్తులకే. ఎందుకంటే ఆయనని ప్రార్ధిస్తే భక్తులకు వృత్తి ఉద్యోగాలలో అభివృధ్ధి వుంటుందిట.
ఇక్కడ ఇంకో ప్రత్యేకత మురుగన్..అదేనండీ మన సుబ్రహ్మణ్యుడు. మామూలుగా 6 తలలతో, 12 చేతులతో తన వాహనం నెమలి మీద కూర్చుని కనబడతాడు. ప్రత్యేకత ఏమిటంటే ఆయన పాద రక్షలు వేసుకుని వుంటాడు. (ఇది మేము చూడలేదు ముందు తెలియక, అంత పరీక్షగా గమనించలేదు .. అందుకే అన్ని వివరాలూ మీకు ముందు చెప్పటం .. మీరు వెళ్ళినప్పుడు అన్నీ గుర్తు పెట్టుకుని చూస్తారని).
13వ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ ఆలయంలో చోళ రాజుల నిర్మాణ శైలిని దర్శించవచ్చు. ఆలయం తర్వాత వచ్చిన రాజులచే అభివృధ్ధి చెయ్యబడింది. బయటనుంచి చూస్తే మామూలుగా వుండే ఈ ఆలయంలో కూడా అందమైన శిల్పాలను చూడవచ్చు. ఇది కుంభేశ్వర ఆలయం అంత పెద్దది కాదు. అలాగని చిన్నదీ కాదు. ఫోటోలు చూడండి. తిరుజ్ఞాన సంబంధార్ ఈ స్వామి గురించి పాడాడు. సంబంధార్ విగ్రహాన్ని ఆలయంలో చూడవచ్చు.
ఇక్కడికి కిలోమీటరు లోపల వున్న ఆలయాలు 1 . కుంభేశ్వర స్వామి 2. రామస్వామి, 3. నాగేశ్వర్, 4. సారంగపాణి, 5 చక్రపాణి, 6. వరాహ స్వామి, 7. బ్రహ్మేశ్వరార్
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)