కుంభకోణం యాత్ర – 2

 

 

 

కుంభకోణం యాత్ర – 2

ఆది కుంభేశ్వర ఆలయం - 1

 

                                                                                 

మేమున్నది శివమురుగన్ హోటల్ ..  పేరు బాగుందికదా.  హోటల్ లో శివుడి ఒళ్ళో సుబ్రహ్మణ్యస్వామి కూర్చున్నట్లు పెద్ద ఫోటో వున్నది.  ముందు అది ఎవరో అర్ధం కాక అడిగితే చెప్పారు.  తండ్రీ కొడుకుల ఆ పోజు స్వామి మలై లో వున్నది.  దాని గురించి తర్వాత.  ప్రస్తుతం ఆత్మారాముడి గురించి.

 

మేమున్న హోటల్ లో కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ వున్నది.  26-8-16న ఉదయం 7-30కి హోటల్ లో  బ్రేక్ ఫాస్ట్ ముగించి వాళ్ళనే అడిగాము.  కుంభేశ్వర టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అని.  నేను అంతకు ముందు చూశాను కనుక చాలామటుకు గుర్తున్నాయి.  వాళ్ళు దగ్గరలోనే బస్ స్టాప్ వున్నది, అక్కడినుంచి బస్ లో వెళ్ళచ్చు, ఆటో చాలా తీసుకుంటాడు అన్నారు. యాత్ర ఇప్పుడే మొదలు, ఉదయం ఫ్రెష్ గా వున్నాము, సరే చూద్దామని బయల్దేరాము.  ఐదు నిముషాలు కూడా నడవకుండానే బస్ స్టేండ్ వచ్చింది.  ఇది చుట్టు పక్కల ఊళ్ళకే.  దానిలోకి ప్రవేశించగానే చాలా సంతోషం వేసింది.  బస్ స్టాండ్ చిన్నదే అయినా ప్లాట్ ఫాం పైన ఏ ఊరు వెళ్తున్నాయో పెద్ద పెద్ద అక్షరాలతో ఇంగ్లీషులో కూడా బోర్డులున్నాయి. ఈ విషయంలో ఇదివరకు కన్నా కొంచెం అభివృధ్ధి కనిపించింది.  ఇదివరకు తమిళం తప్పితే వేరే భాషలో వుండేవి కాదు బోర్డులు.  ఇప్పుడు ఇంగ్లీషులో కనబడితే మరి సంతోషం వెయ్యదా?  లేకపోతే బోర్డులున్నా, చదువు రాని వాళ్ళల్లా ప్రతి దాని గురించీ ఎవరినన్నా అదేమిటి అని అడగాల్సి వచ్చేది.  బస్ స్టాండ్ నీట్ గా వున్నది. 

 

 

దాని ఎదురుగానే మఫ్జల్ బస్ స్టాండ్. ఇదివరకు మేము వెళ్ళినప్పుడు మఫ్జల్ బస్ స్టాండ్ నుంచే అన్ని చోట్లకీ వెళ్ళాము. అక్కడే వున్న రాయల్ హోటల్ లో వున్నాము.  అప్పుడే నాన్ ఎ.సి. రూ. 400 రోజుకి.  ఈ బస్ స్టాండ్ కొత్తగా వచ్చింది. దీని గురించి ఇంకొక ప్రశంశ.  ఎంక్వైరీలో ఏ సమయంలో చూసినా మనిషి వున్నారు.  అడిగినదానికి చిరాకు పడకుండా బస్ నెంబరు, అదిగనుక బస్ స్టాండ్ లో వుంటే ఎక్కడ వున్నదీ చెప్పారు. అంతేకాదు, మేము కోవెలకి వెళ్ళాలంటే మినీ బస్ లో వెళ్ళమని, అది ఆలయందాకా వెళ్తుందని అడగకుండానే మనకి అవసరమైన సలహా ఇచ్చేవాళ్ళు.   అక్కడ వున్నన్నాళ్ళూ అక్కడ సౌకర్యాలకి సంతోషించక, పాడు బుధ్ధి ప్రతిదానికీ మన స్టేట్ తో పోల్చుకుని నీరసంగా నిట్టూర్చింది.  

 

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, కుంభకోణంలో ఆలయాలు చూడటానికి బస్సులు, నడక, అవసరమైతే ఆటోలు చాలు. బోలెడు డబ్బులు పోసి టాక్సీలక్కరలేదు.  మీకీ సలహా ఇచ్చినందుకు టాక్సీ వాళ్ళందరూ నా మీద పోట్లాటకొస్తే మీరే కాపాడాలి నన్ను.

 

 

ముందు కుంభేశ్వర ఆలయానికి బస్ ఎక్కాము. టికెట్ మనిషికి 5 రూ. లు.   బస్ లో పది నిముషాల్లో ఆలయానికి చేరుకున్నాము.  ఆలయం వచ్చినప్పుడు చెప్పమని కండక్టర్ ని అడిగాము. కండక్టరు బిజీగా వుండి ఎక్కడ మర్చిపోతాడో అని పక్క వాళ్లకీ చెప్పాము.  స్టేజ్ వచ్చినప్పుడు పక్క వాళ్ళు చెప్పారు.  లేవబోతే కండక్టరు ఆపి, గుడికి దగ్గరగా బస్ ఆపించి దిగమని ఎటు వెళ్ళాలో కూడా చూపించాడు.  కొత్తవాళ్ళమని గ్రహించి సహాయం చేశాడు. ఏమిటో అతనూ చాలా మంచివాడండీ!!    

 

 

కండక్టర్ దోవ చూపించాడు కదా.  గుడికి పదండి.  అన్నట్లు గుళ్ళోకెళ్ళే ముందు ఒక సలహా ఇవ్వనా?  తమిళనాడులో ఏ ఆలయానికి వెళ్ళినా బయట మంచి పూల దండలు అమ్ముతారు.  చిన్న ముక్క తీసుకు వెళ్ళినా ఆలయంలో దేవుడికి అలంకరిస్తారు. చిన్న ముక్కలు కూడా అంతకు ముందున్న దండలకి కలిపేస్తారు, లేదా వేరే విధంగా దేవుడికి పెడతారు.   అలంకరించేవి అలంకరిస్తుంటే అంతకు ముందు పెట్టినవి తీసి వచ్చిన భక్తులకు ఇస్తూ వుంటారు.  కొబ్బరి కాయలు సాధారణంగా దేవుడి  గర్భగుళ్ళోనే కొడతారు.  అర్చన చేయించాలి అంటే నైవేద్యానికి ఫలం, కొబ్బరికాయగానీ, ఇంకేదైనా ఫలం కానీ వుండాలి.

 

మరి నడుస్తూ నడుస్తూ ఈ ఆలయ చరిత్ర  కూడా చెప్పుకుందామా? …. అయితే ఒక్క మాట. తమిళ భాష నాకు రాదు. తమిళనాడులో తమిళం తప్ప మాట్లాడరు.  కనుక నేను చెప్పే వాటిలో మాటలు పలకటంలోగానీ, విషయ సేకరణలోగానీ ఏ విధమైన తప్పులున్నా క్షమించమని ముందే కోరుతున్నాను. 

 

పూర్వం, మహా ప్రళయం రాబోతున్నదనే సంగతి తెలుసుకున్న బ్రహ్మ దేవుడు ఆ ప్రళయంలో సృష్టి బీజం కూడా నాశనమయితే ప్రళయానంతరం జీవ సృష్టి ఎలా జరుగుతుందనే ఆందోళనతో మహా శివుణ్ణి అడిగాడు.  పరమ శివుడు బ్రహ్మ దేవుణ్ణి అక్కడి ఇసుకతో ఒక కుండని తయారు చేసి అందులో అమృతాన్ని పోసి దానిలో సృష్టి బీజాలనుంచమన్నాడు.  ఇంకా వేదాలనీ, పురాణాలనీ, ఇతిహాసాలని కూడా అందులో సర్దమన్నాడు.  పైన మామిడి ఆకులు పెట్టి, కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసి దానిని దారంతో, దర్భలతో కట్టి, కదలకుండా ఒక కుదురులో వుంచమన్నాడు.  దానిని ఒకచోట వుంచి, బిల్వ పత్రాలతో  పూజించమన్నాడు. ప్రళయం వచ్చినప్పుడు మన్నూ మిన్నూ ఏకం చేసేటట్లు కురిసే వానలో సముద్రాలు వుప్పొంగి సృష్టి అంతా మునిగి పోయినప్పుడు ఈ అమృత భాండము మాత్రము ఆ నీటిలో దక్షిణ దిశగా  ప్రయాణించి ఒక పవిత్ర ప్రదేశంలో ఆగుతుందని చెప్పాడు.  అప్పుడు అనేక వింతలు జరుగుతాయని,   పరమాత్ముడు స్వయం ప్రకాశుడై తర్వాత సృష్టి కొనసాగటానికి ఏర్పాట్లు చేస్తాడని, బ్రహ్మ దేవుడిని కలత పడవలదనీ చెప్పాడు.  బ్రహ్మ దేవుడు శివుడు ఆజ్ఞాపించినట్లు అన్నీ చేశాడు.

 

ప్రళయం వచ్చింది.  ప్రపంచమంతా మునిగి పోయింది.  బ్రహ్మ దేవుడు తయారు చేసి, పూజించిన కుంభం మాత్రం ఏ విధమైన నష్టమూ లేకుండా ఆ నీటిలో దక్షిణం వైపు సాగిపోయింది.  కొంత కాలానికి నీరు తగ్గింది.  నీటిలో ప్రయాణిస్తున్న కుంభం ఒక చోట ఆగింది.  అక్కడ మామిడి ఆకులు, దర్భలు కుంభంనుంచి కింద పడ్డాయి.  అవి కింద పడటంతోనే అక్కడ మామిడి వృక్షం కన్పించింది.  దానికింద దర్భలు పడ్డ ప్రదేశంలో శివుడి లింగ రూపం ఏర్పడింది.  అక్కడ తన పని అయిపోయినట్లు ఆ కుంభం ముందుకు సాగింది.  కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట కొబ్బరికాయ కింద పడి కొబ్బరి చెట్టయింది.  కుండకి పెట్టిన కుదురు శివలింగమయింది.  ఈ లింగాన్ని న్రికాల లింగమన్నారు.  బిల్వ పత్రాలు కిందపడి బిల్వ వృక్షాలు అయ్యాయి.  వాటికింద ఉద్భవించిన లింగం పాతాళ లింగం.  అలాగే కుంభానికి కట్టిన దారం కూడా లింగం అయింది.  అందుకేనేమో  కుంభకోణంనిండా అన్ని ఆలయాలు!!

 

శివుడు, అమృత భాండాన్ని చూడటానికి భూమిపైకి వచ్చాడు.  అమృతంతో వున్న కుంభం తిరువిడై మరుదూర్ కి పడమర దిశంలో వున్నదని తెలుసుకున్నాడు.  అందులో వున్న అమృతం అన్ని చోట్లా పడాలనే వుద్దేశ్యంతో శివుడు ఒక బాణంతో కుంభాన్ని ఛేదించాడు.  శివుడు బాణం ప్రయోగించిన ప్రదేశం బాణాపురం.  అక్కడ శివాలయం వున్నది.  ఆ బాణం కుంభానికి తగిలి కుంభం మూతి పగిలి అమృతం తిరువిదై మరుదూర్ నుంచి చాలా దూరంగా పడ్డది.  అమృతం కుండ కొమ్మునుంచి పడి  (పాత కాలంనాటి కొంబు చెంబు,  కమండలాలు, సినిమాల్లో రాజుల భవంతులలో చూపించే మదిర పాత్రలను గుర్తు తెచ్చుకోండి) ఇసుకతో కలిసి శివలింగమయింది.    భాండం కొమ్మునుంచి అమృతం పడ్డది గనుక ఆ ప్రదేశం కూడమూకు, తర్వాత కుంభకోణం అయింది, కుంభం నుంచి అమృతం పడ్డ చోట వెలసిన శివుడు కుంభేశ్వరుడు అయ్యాడు.  అమృత భాండంనుంచి ఉద్భవించిన శివుడుగనుక అమృత కుంభేశ్వరుడనీ, బ్రహ్మ, బ్రహ్మ సృష్టికన్నా ముందే ఏర్పడ్డ లింగం కనుక ఆది కుంభేశ్వరుడనీ అన్నారు.  అదిగో ఆలయం వచ్చింది.  పదండి.....

 

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)