కుంభకోణం యాత్ర – 1

 

 

 

కుంభకోణం యాత్ర – 1

 


ప్రళయం, మహా ప్రళయం, కల్పాంతం ..  ఇలా ప్రళయాలలో కూడా రకరకాలు.  ప్రకృతి విపరీతాలు, యుధ్ధాలు ..  ఇవి కూడా ప్రళయాలే.  ఇలాంటివాటివల్ల ప్రాణ నష్టం విపరీతంగా వున్నా, మొత్తం సృష్టి సమాప్తమయ్యేది కల్పాంతంలో అంటారు.  అయితే అప్పుడు కూడా భగవంతుడు వూరు కోడు.  ప్రళయం తర్వాత సృష్టి కొనసాగిస్తాడు.  అలా కల్పాంతం తర్వాత పరమ శివుడు తానుగా ప్రకటితమై, సృష్టికి శ్రీకారం చుట్టిన ప్రదేశం కుంభకోణం.  ఆధారాలకోసం అడక్కండి.  ఏ మహాఋషో ప్రత్యక్షమై వివరించినా వాళ్ళ భాష మనకి అర్ధం కాదు, అర్ధం చేసుకుంటే ఆయన ఐడెంటిటీ మీదే అనుమానం రావచ్చు.  కనుక మనం హాయిగా ఆలయాలు చూసి సంతోషిద్దాము.

 

కుంభకోణం ..  అంటే అదొక  మోసాల పుట్ట అని మన అర్ధం.  కుంభకోణం అంటే జగత్ సృష్టి ప్రారంభమయిన స్ధలమని తమిళుల అభిప్రాయం.  స్ధల పురాణంలో దానికి సంబంధించిన కధ వున్నది.   నేను సేకరించిన వివరాల్లో ఏ పురాణంలో ఈ విషయం వున్నదో తెలియలేదు.   కానీ కుంభకోణం అంటే ఆలయాల పుట్ట అంటాను నేను.  అన్ని ఆలయాలు వున్నాయి అక్కడ.  ఆన్ని వున్నాయికదా అని ఏవో చిన్నా చితకావి అనుకోకండి.  పెద్ద నుంచి చాలా పెద్ద ఆలయాలే ఎక్కువ.  ఇన్ని పెద్ద ఆలయాలు దగ్గర దగ్గరగా ఒక ప్రదేశంలో ఎందుకు నిర్మించారో అర్దంకాదు.

 

 

పది, పదిహేనేళ్ళ క్రితం మావారూ నేనూ కుంభకోణం మీదుగా వెళ్తూ తమిళనాడులోని కొన్ని ఆలయాలు దర్శించాముగానీ కుంభకోణం చూడలేదు.  అప్పుడు అక్కడికెళ్ళటానికి మమ్మల్ని కొందరు వారించారు కూడా.  అక్కడంతా మోసాలెక్కువ, జాగ్రత్తగా వుండాలి.  ఏదో ఒక గుడి చూడటానికి వెళ్ళి అనవసరంగా ఇబ్బందులలో చిక్కుకోవటం ఎందుకు అని.  ... దానితో మేమూ విరమించుకున్నాము.

 

తర్వాత 2008 లో ఒకసారి  మావారు శ్రీ వెంకటేశ్వర్లుగారితో కలిసి నాలుగు రోజులు ఇక్కడ వుండి చాలా ఆలయాలు చూశాను.  అప్పుడు తెలిసింది .. కుంభకోణం అంటే మోసాల రాజ్యం కాదనీ, ఆలయాల సామ్రాజ్యమనీ.  అసలు అన్ని ఆలయాలు వున్నాయని అక్కడికి వెళ్తేకానీ మాకు తెలియలేదు.   అంత పెద్ద ఆలయాలు, ఆ దేవతా మూర్తులు, ఆ శిల్ప సంపద, మేము వున్న నాలుగు రోజులలో వున్న సమయమంతా వృధా చెయ్యకుండా చూసినా ఇంకా చూడవలసినవి చాలా మిగిలిపోయాయి.  అత్యంత పాతకాలంనాటి ఆ ఆలయాల ద్వారా మన పురాణాల గురించి కూడా కొంత తెలుసుకోగలిగాము.  ఆ పురాణ కాలంనాటి ఆలయాలు (చాలామటుకూ వేల సంవత్సరాల క్రితంవనే చెబుతారు) ఎంత చూసినా తనివి తీరలేదు.  అప్పటినుంచీ మళ్ళీ వెళ్ళాలనే కోరిక.  మిత్రులు చాలామందితో చెప్పాను.  ఫలించలేదు.  

 

 

మొన్న ఆగస్టులో మావారికి ఆఫీసు పనిమీద వారం రోజులు రాంచీ వెళ్ళాల్సి రావటంతో నేనూ, ఉమా కుంభకోణం ప్లాను వేసుకున్నాము.  పాపం ఉమ మంచి స్నేహితురాలు లెండి.  తనకీ కొత్త ప్రదేశాలు చూడాలనే సరదా వున్నది.  టికెట్లు, హోటల్  అన్నీ బుక్ చేసేసింది.

 

మరి నేను చూసినవి మీకు చెప్పకపోతే నాకు తోచదు కదా.  మాటల సందర్భంలో తెలుగువన్.కాం శ్రీమతి రమగారితో అన్నాను కుంభకోణం ఆలయాల గురించి.  ఇంకేం, వాటి గురించి వరసగా రాసెయ్యండి అని ప్రోత్సహించారు.  నామీద నమ్మకంతో వారానికి మూడు రోజులు ఈ ధారావాహిక ప్రచురించటానికి అనుమతినిచ్చిన తెలుగువన్.కాం అధినేత  శ్రీ కంఠమనేని రవిశంకర్ గారికి, నాందీ పలికిన శ్రీమతి రమగారికి నా ధన్యవాదాలు పత్రికా ముఖంగా తెలుపుకుంటున్నాను.

 

 

కుంభకోణంలోని ఆలయాల గురించి తెలుగువారికి చాలామందికి తెలిసి వుండక పోవచ్చు.  రాష్ట్రాల మాట ఎలా వున్నా, మన భారత దేశ వైభవాన్ని నలుగురికీ పరిచయం చెయ్యాలనే నా చిన్ని కోరిక మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
పురాతన ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఒక విషయం మీరు గమనించారా మనకి ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళినట్లు మనస్సు తృప్తిగా, సంతోషంగా, నిర్మలంగా వుండటం.  అనేక యుగాలనుంచీ ఆ ఆలయంలో దైవం, ఆ దైవానికి జరిగే పూజలు, అవి నిర్వహించే పూజారులు దీనికి కారణం.  పూజలు సక్రమంగా జరిగి, భక్తుల మనోభావాలు దెబ్బతిననంతమటుకూ ఆ ఆలయానికి మళ్ళీ మళ్ళీ వెళ్లాలని భక్తులు కోరుకోవటం కూడా సహజమే.  భగవంతునికీ, భక్తునికీ మధ్య వుండే ఈ అవినాభావ సంబంధం వల్లనే ఆలయాలు అభివృధ్ధి చెందుతాయి., ఇంతకీ మా యాత్రా విశేషాలు చెప్పాలికదా.  యాత్ర సాగిన విధంబెట్టిదనగా......

 

23-8-16 న సాయంకాలం 5-15కి సికింద్రాబాద్ లో సికింద్రాబాద్ – చెన్నై ఎక్స్ ప్రెస్ ఎక్కాము ఉమ, నేను.  మర్నాడు ఉదయం 7 గం. ల లోపే చెన్నైలో దిగాము.  చెన్నై సెంట్రల్ స్టేషన్ లో రత్న కేఫ్ లో కాఫీ, 25 రూ.  తాగాము.  చాలా బాగుంది.  సెంట్రల్ అనుకుంటున్నారా?  నేను చెప్పింది కాఫీ గురించండీ.  కాఫీ ప్రియులు సెంట్రల్ కెళ్తే రత్న కేఫ్ లో కాఫీ తాగండి. ఈ ట్రావెలాగ్ పూర్తయ్యేలోపల నేను చాలా రికమెండ్ చేస్తూ వుంటాను.  ఇవి బిజినెస్ ప్రమోషన్ కి కాదు, మీకోసం చేసిన రికమెండేషన్స్ అని మరీ మరీ నొక్కి వక్కాణిస్తున్నాను. అక్కడే పొంగల్ కూడా పేక్ చేయించుకున్నాము బ్రేక్ ఫాస్ట్ కి.  అక్కడనుంచి ఆటోలో ఎగ్మూర్ స్టేషన్ కి వెళ్ళాము.  మా ఉమకి తమిళం బాగానే వచ్చు.  అందుకని ఈ ట్రిప్ లో తనతో మాట్లాడేడప్పుడు తప్ప మిగతా సమయాల్లో నాకు నోరు విప్పే ఛాన్స్ రాలేదు.

 

ఎగ్మూర్ నుంచి తంజావూర్ వెళ్ళే ఎక్స్ ప్రెస్ ఉదయం 8-30  కి వున్నది.  ఆ రైల్లో కుంభకోణందాకా రిజర్వు చేసుకున్నాము.  ఎగ్మూర్ లో 3వ నెంబరు ప్లాట్ ఫాం మీదకి వస్తుంది రైలు అంటే మా సామాను మోసుకుంటూ .. కాదు .. లాక్కుంటూ, (ఇలాంటి ప్రయాణాల్లో పెద్దగా తీసుకెళ్ళంలెండి మేమే మోసుకోవాల్సి వస్తుందని .. చెరో చిన్న సూట్ కేసు) ఎస్కలేటర్ ఎక్కి 3వ నెంబరు ప్లాట్ ఫాం మీదకి వెళ్ళి స్ధిమితంగా ఒక బెంచీ మీద చతికిలబడ్డాము. ఉదయం 7-40 అయింది అప్పటికి.  రైలు మా ఎదురుగానే వున్నదికానీ, తలుపులు తియ్యలేదు.  సరే ఈ లోపల బ్రేక్ ఫాస్ట్ కానిచ్చాము.  తమిళనాడులో సాధారణంగా పొంగల్ బాగుంటుంది.  కానీ ఇది అంత బాగాలేదు

 

మనం ప్రయాణానికి బయల్దేరేటప్పుడు ఇంటిముందు ఒక నక్కని తొక్కి వస్తే సుఖ ప్రయాణంట.  (ఇదీ రికమెండేషనే)  చిన్నప్పుడు వినేదాన్ని .. తేలికగా కలిసి వస్తే నక్కని తొక్కొచ్చాడు అని.  మరి నక్కని మా ఉమ తొక్కిందో, నేను తొక్కానో తెలియదుగానీ, మాకీ ప్రయాణం అంతా చాలా హేపీస్.   అందుకు మొదటి నిదర్శనం మేము ఎక్కవలసిన కంపార్ట్ మెంటు మేము కూర్చున్న బెంచీకి ఎదురుగానే.  ఉదయం 8-15కి రైలు బండి తలుపులు తెరుచుకోవటం, మేము ఎక్కి సర్దుకు కూర్చోవటం అన్నీ అయిపోయినాయి.  8-30కి బండీ కదలటంకూడా జరిగింది.

 

మా కంపార్టుమెంటులో పిల్లా పెద్దా అంతా కలిసి పదిమంది వున్న ముస్లిమ్ కుటుంబం ఎక్కారు.  వాళ్ళు లండన్ నుంచి ఒక నెల సెలవులకి వచ్చారుట.  తంజావూరు దగ్గర పల్లెటూరు వాళ్ళ ఊరు.  అక్కడికి వెళ్తున్నారు.  ఆయన లండన్ లో ఆక్యుపంచర్ డాక్టర్ ట.  వాళ్ళు తమిళంలోనే మాట్లాడుకుంటున్నారు.  పుట్టి పెరిగింది తమిళనాడులోనే కదా మరి.  వాళ్ళూ దూర ప్రయాణాల్లో వున్నారు కదా, దోవలో ఎక్కడో వడలు కట్టించుకు వచ్చారు.  వాటిలోంచి మా ఇద్దరికీ కూడా ఆఫర్ చేశారు.  ఇప్పుడే తిన్నాము, వద్దంటే, ఫ్లాస్కులో వున్న టీ తాగమని బలవంతం చేశారు.  సంస్కారం భారత దేశం నరనరాల్లోనూ వున్నదనిపించింది.

 

కుంభకోణం చేరేటప్పటికి మధ్యాహ్నం 2-30.  బయటకి వచ్చి ఆటో అడిగేతే 100 రూ. ల నుంచీ 70 రూ. కి దిగి వచ్చారు.  నెట్ పరిజ్ఞానంతో హోటల్ దగ్గరగానే వుంది, అంత అక్కరలేదు అని మా ఆలోచన.  ఒక టాక్సీ అతను 200 రూ. తో మొదలు పెట్టి, మేము ఆటోవాళ్ళని అడుగుతుండటంతో చివరికి 50 రూ. కి వచ్చాడు.  ఆటోకన్నా తక్కువ.  బహుశ అతనికి బేరం దొరికి వుండదు, అటే వెళ్తూ, మమ్మల్ని దించి పోయాడేమో అనుకున్నాము.

 

 ఉమా వాళ్ళబ్బాయి గౌతమ్ మేక్ మై ట్రిప్ మెంబరు.  వాడి ద్వారా బుక్ చేస్తే అక్కడ హోటల్ ..  శివ మురుగన్ లో చాలా డిస్కౌంట్ తో రూమ్ దొరికింది.  ముందు వానాకాలమేకదా అని నాన్ ఎ.సి. రూమ్ రెండు రోజులకి బుక్ చేయించుకున్నాము.  డబల్ బెడ్ రూం రోజుకి రూ. 700 కి వచ్చింది. అక్కడ చూసి, బాగుండకపోతే వేరే చోటికి మారుదామని మా ఆలోచన.   అక్కడ ఎండలు ఠారెత్తిస్తున్నాయి.  విపరీతమైన వేడి.  వుండలేక పోయాము.  మూడో రోజు ఎ.సి. రూమ్ కి మారిపోయాము.  అది రూ. 1450 డిస్కౌంట్ తర్వాత.  హోటల్ బాగుంది, స్టాఫ్ చాలా మర్యాదగా ప్రవర్తించారు. బాగా ఎటెండ్ అయ్యారు.   రెస్టారెంట్ లో ఫుడ్ కూడా బాగానే వున్నది.  పైగా బస్ స్టాండ్ కి 5 నిముషాల నడక కూడా లేదు.  అందుకే ఇంక మారకుండా అక్కడే వుండిపోయాము.

 

ముందు ప్లాన్ ప్రకారం ఆ రోజు సాయంకాలం ఒకటి రెండు గుళ్ళన్నా చూడాలి.  కానీ నిన్న సాయంకాలంనుంచీ దాదాపు 24 గంటల ప్రయాణం అయ్యేసరికి ఇద్దరికీ ఓపిక లేక రెస్టు తీసుకున్నాము.  మీరు కూడా ఇవాళ్టికి రెస్టు తీసుకోండి.  రేపటినుంచి బోలెడు ఆలయాలు తిప్పుతాను.  

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)