కుంభకోణం యాత్ర – 6

 

 


కుంభకోణం యాత్ర – 6

సారంగపాణి ఆలయం

 


                                                                                                                                      

రామస్వామి ఆలయం ఎంత బాగుందో చూశారుకదా.  ఇప్పుడు కుంభకోణంలో ప్రముఖ వైష్ణవాలయం సారంగపాణి ఆలయానికి వెళ్దాము. ఆళ్వారులు దర్శించి కీర్తించిన ఆలయాలు వైష్ణవులకు దివ్య దేశాలు.  ఇవి 108.  వీటిలో మొదటిది శ్రీరంగంలోని శ్రీ రంగనాధుడు.  మొత్తం 12 మంది ఆళ్వారులలో 11 మంది ఈ ఆలయాన్ని దర్శించి శ్రీ రంగనాధుణ్ణి స్తుతించారు.  రెండవది తిరుపతి.  9 మంది ఆళ్వారులు శ్రీ వెంకటేశ్వరుని దర్శించి గానం చేశారు.  మూడవదిగా పేర్కొనబడుతున్నది కుంభకోణంలోని సారంగపాణి ఆలయం.  ఈ స్వామిని 9 మంది ఆళ్వారులు దర్శించి స్తుతించారు. కాలగర్భంలో ఆలయాలు వెలిసినప్పటి అసలు కధలు,  జనశ్రుతంగా వచ్చిన కొసరు కధలు కలిసి ఇప్పుడు మనకి ఆలయల గురించిన  కధలు ఒక్కో విషయంలో అనేకం అయ్యాయి.  ఈ ఆలయానికి సంబంధించి అలాంటి కధలు కొన్ని చెప్పుకుందాము.

 

 

భృగు మహర్షి ఒకసారి త్రిమూర్తులను సందర్శించాలని సత్య లోకానికి, కైలాసానికి వెళ్ళి, బ్రహ్మ సరస్వతులు, పార్వతీ పరమేశ్వరులు ఆయనని గమనించకపోవటంతో కోపగించి వైకుంఠానికి వెళ్ళాడు.  అక్కడ కూడా అదే పరిస్ధితి అయ్యేసరికి ఆగ్రహం పట్టలేక విష్ణువు హృదయం మీద తన్నుతాడు.  అవాక్కయిన లక్ష్మీదేవి, తన స్వామి భృగు మహర్షిమీద కోపగించక ఆయనని బుజ్జగించి కాళ్ళు ఒత్తటం చూసి ఆగ్రహిస్తుంది.  కానీ మహా విష్ణువు కాళ్ళు ఒత్తే నెపంతో భృగు మహర్షి అరికాలిలో వున్న కన్ను అదిమేయటం, దానితో ఆయన అహంకారం అణిగి స్వామి కరుణ కోసం వేడుకోవటం కధ తెలుసుకదా.  అదే వెంకటేశ్వరస్వామి కధకి నాంది.  ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు హృదయంలో తన స్ధానాన్ని తన్ని అపవిత్రం చేశాడని కోపగించిన లక్ష్మీదేవిని కూడా అనేక విధాల పూజించి, ఆవిడని తన కూతురుగా అవతరించమని ప్రార్ధిస్తాడు.  వారు ఆయన ప్రార్ధనలు మన్నిస్తారు. తర్వాత భృగు మహర్షి భూలోకంలో  హేమ ఋషిగా అవతరించి కుంభకోణంలో పొట్రుమరి తటాకం పక్కన తపస్సు చేస్తాడు. లక్ష్మీ దేవి తటాకంలో తామర పూల మధ్యనుంచి ఉద్భవించింది.  హేమ ఋషి సంతోషంతో ఆ బాలికకు కోమలాంబాళ్ అనే పేరు పెట్టి పెంచుకుంటాడు.  

 

 

లక్ష్మీ దేవిని వివాహం చేసుకోవటానికి భూలోకానికి వచ్చిన స్వామి ఆవిడని ఉడికించటానికి ఇక్కడ కొంచెం కిందగా వున్న (సెల్లార్ లాగా)  ఒక ప్రదేశంలో దాక్కున్నాడు.  ప్రస్తుతం ఆలయంలో ఆ ప్రదేశంలో శ్రీనివాసుని విగ్రహం పాతాళ శ్రీనివాస పేరుతో వున్నది.  పైన వున్న సారంగపాణి ఆలయం మెట్టు కోవెల. అమ్మవారు ఇక్కడ కొలను నుంచి ఉద్భవించి పెరిగింది కనుక ఆవిడ పుట్టిల్లు ఇది.  మహావిష్ణువు వైకుంఠంనుంచి దిగివచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడే వుండి పోయాడు.  ఇల్లరికపు అల్లుడన్నమాట.  తమిళంలో వీట్టోడు మాపిళ్ళై అంటారు.  అందుకే ఇక్కడ అమ్మవారిదే పైచెయ్యి.  మొదటి పూజ ఆవిడకే.

 

 

మూల విరాట్

ఇక్కడ స్వామి భంగిమ  పడుకున్నాయన కొంచెం లేచినట్లు వుంటాడు.  ఉధ్ధాన శయన భంగిమ అంటారు దీనిని. మహావిష్ణువు ఈ భంగిమ ఇక్కడ మాత్రమే చూడవచ్చు.  దీనికీ ఒక కధ చెబుతారు.  ఆళ్వార్లలో ఒకరైన తిరుమలేశాళ్వార్ స్వామిని దర్శించి స్తుతిస్తాడు.  భక్తుడిని ఆదరించటానికి స్వామి పడుకున్నాయన లేస్తున్నట్లు కొంచెం లేచారుట.  ఆళ్వార్ స్వామిని ఆ భంగిమలోనే భక్తులను కరుణించమని కోరాడని అందుకే అలాగే వున్నారని అంటారు.  ఈ భంగిమ గురించి రెండు, మూడు రకాల కధలు వున్నా, కారణం మాత్రం ఆళ్వార్ని కరుణించటమే.

 

 

దివ్య ప్రబంధ రూపకర్త

వైష్ణవులకి అత్యంత పవిత్రమైన దివ్య ప్రబంధం రూపొందబడటానికి కూడా ఈ స్వామే కారణం అంటారు.  దివ్య ప్రబంధంలో మహా విష్ణువుని కీర్తిస్తూ 12 మంది ఆళ్వారులు గానం చేసిన 4000 పాశురాలున్నాయి.  నారద ముని అనే వైష్ణవ ఆచార్యులు స్వామిని సేవించటానికి వచ్చి ఇక్కడి భక్తులు గానం చేసిన 10 పాశురాలు విని అవి అసంపూర్తిగా వున్నాయని తలచి ఆ భక్తులను మిగతా భాగం కూడా పాడమని అడిగాడు.  వారు వెయ్యికి పైగా వున్న పాశురాల్లో ఇవి కొంత భాగమేననీ, మిగతావి తమకి తెలియదని చెప్పారు.  నారదమునికి సారంగపాణి స్వప్నంలో కనబడి నవ తిరుపతులలో ఒకటిగా ప్రసిధ్ధి చెందిన తిరునగరి (టూటికోరన్ జిల్లా) వెళ్ళి నమ్మాళ్వార్ ని ఆశ్రయించమన్నాడు.  స్వామి ఆజ్ఞ ప్రకారం చెయ్యగా నమ్మాళ్వార్ నారదమునికి 4000 పాశురాలు చెప్పాడుట.  వాటినన్నిటినీ క్రమబధ్ధీకరించి దివ్య ప్రబంధం తయారు చేశారుట.  ఈ పాశురాలు ఈ నాటికీ నిలిచి వుండటానికి ఈ స్వామి సారంగపాణి ఇచ్చిన సందేశం ప్రకారం నారదముని చేసిన కృషే కారణం.  అందుకే సారంగపాణే కాక స్వామికి  అరవముద ఆళ్వార్ అనే పేరు కూడా వచ్చింది.

 

ఆలయ నిర్మాణం

రాజ గోపురం 11 అంతస్తులు ఎత్తు 150 అడుగులు.  ఇదికాక ఇంకో నాలుగు గోపురాలు వున్నాయి.  ఆలయ నిర్మాణ ఏనుగులు, గుఱ్ఱాలు లాగుతున్న రధం ఆకారంలో వుంటుంది.  స్వామి వైకుంఠంనుంచి దిగి వచ్చిన రధానికి ప్రతీక ఇది. అమ్మవారికోసం స్వామి దివినుంచి భువికి దిగి వచ్చాడు.  శ్రీ మహా విష్ణువు కోమలాంబాళ్ ని వివాహం చేసుకోవటానికి వైకుంఠంనుంచి ఏనుగులు, గుఱ్ఱాలు లాగే రధంలో ఇక్కడికి వచ్చాడు.  అందుకే ఇక్కడి ఆలయ నిర్మాణం ఆ రధాన్ని పోలి వుంటుంది.    ఆ రధానికున్నట్లే ఈ ఆలయానికీ రెండు ద్వారాలు వున్నాయి.  దివి నుంచి దిగి వచ్చేటప్పుడు ఆయన ధనుర్బాణాలు ధరించి వచ్చాడు.  అందుకే ఇక్కడ మూల విరాట్ చేతిలో, ఉత్సవ మూర్తుల చేతిలో విల్లంబులు వుంటాయి.  ఈయనకి సారంగపాణి అని పేరు రావటానికి కారణం అది.  

 

హేమ ఋషి విగ్రహం ఆలయంలో వున్నది.  ఆలయ గోడలకి  అద్భుతమైన శిల్పాలతోబాటు భరత నాట్య భంగిమలు అనేకం చెక్కబడ్డాయి. ఈ ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలు.  వాటిని ఉత్తరాయణ ద్వారం, దక్షిణాయన ద్వారం అంటారు.  తమిళ నెలలు తాయ్ నుంచి ఆడిదాకా ఉత్తదర ద్వారం, ఆడి మొదటి రోజునుంచి మార్గళి దాకా దక్షిణ ద్వారం తెరుస్తారు భక్తులు స్వామిని దర్శించటానికి. అమ్మ కోమలవల్లికి ప్రత్యేక ఆలయం వున్నది ఈ ప్రాంగణంలోనే.  ఇక్కడ ముందు అమ్మవారిని దర్శించి, తర్వాత అయ్యవారిని దర్శించాలి.  అమ్మవారి ఆలయం కూడా ప్రదక్షిణ మార్గంలో మొదట్లోనే వుంటుంది.

 

మెచ్చుకోవాలి

ఈ ఆలయ రాజ గోపురాన్ని నిర్మించిన శిల్పి  లక్ష్మీ నారాయణ స్వామి.  ఈయన జీవితమంతా స్వామి సేవలో గడిపాడు. గోపురాల నిర్మాణానికి సుప్రసిధ్ధులు.    ఈ ఆలయ రాజ గోపురం  నిర్మాణానికి ఎంతో సమయం వెచ్చించి అమిత శ్రధ్ధాసక్తులు చూపించారు. ఆయన బ్రహ్మచారి.  తను పోయిన తర్వాత శ్రాధ్ధ కర్మలు ఎవరు చేస్తారని దిగులు పడి, స్వామినే ప్రార్ధించేవాడుట నీదే బాధ్యత అని.  ఒక దీపావళి రోజున ఆయన మృతి చెందిన తర్వాత స్వామి ఒక యువకుని రూపంలో వచ్చి ఆయన అంత్యక్రియలు చేశారుట.  దీనికి నిదర్శనంగా మర్నాడు ఆలయం తలుపులు తెరిచిన వారికి స్వామి మెళ్ళో అపసవ్యంగా వున్న జంధ్యం, తడి బట్టలు, చేతికి దర్భ వగైరాలతో కనబడ్డాడుట.  ఇప్పటికీ లక్ష్మీ నారాయణ స్వామి మరణించిన దీపావళి రోజున  మధ్యాహ్నం తిధి జరపటానికి కావలసిన సరంజామా అంతా ఆలయంలో పెట్టి ఆలయం తలుపులు కొంతసేపు మూస్తారనీ, స్వామే ఆ కార్యక్రమం చేస్తారని, దీనిని ఎవరినీ చూడనివ్వరనీ, కొందరంటే, ఆలయ నిర్వాహకులు తిధి జరిపిస్తారని కొందరంటారు. ఏది ఏమైనా ఒక శిల్పికి దక్కిన అపూర్వమైన గౌరవంకదా ఇది. అనేక ప్రముఖ ఆలయాలలో శిల్పులెవరో ఎవరికీ తెలియదు.  అలాంటిది ఒక శిల్పి చాతుర్యాన్ని గుర్తించి, ఆయనని గుర్తుపెట్టుకుని, ఆయన తిధి నిర్వహించటం అంటే ఒక కళాకారునిపట్ల చూపిన గౌరవం.  ఇది మెచ్చుకోతగ్గది. ఈ ఆలయం అభివృధ్ధిలో చోళులు, విజయనగర రాజులు, నాయక రాజులు పాలు పంచుకున్నారు.  పెద్ద గ్రానైట్ గోడ మధ్య వున్నది గర్భాలయం.    ఆలయ పుష్కరిణి పొట్రమరై పడమర గోపురం బయట వున్నది.

 

విశేషం

వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశిరోజు స్వర్గద్వారమని ఉత్తర ద్వార దర్శనం వుంటుందికదా.  ఇక్కడ అలాంటిది వుండదు.  స్వామి సాక్షాత్తూ వైకుంఠంనుంచి దిగి వచ్చినాయనాయే.  అంతటి స్వామి దర్శనం ఏ రోజైనా ముక్తి ప్రదాయంకదా.  అందుకే ఉత్తరాయణ ద్వారం, దక్షిణాయన ద్వారం అని పేరుకు వున్నా ఏ ద్వారంలోంచి వెళ్ళినా స్వామి భక్తులను అన్ని వేళలా కరుణిస్తాడు.  ఈ రెండు ద్వారాలు స్వామి వైకుంఠంనుంచి దిగి వచ్చిన రధానికున్న ద్వారాలలాంటివి.

ఇంత అపురూప ఆలయాల దర్శనం అదృష్టమేకదా.

 

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)