రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తన గొయ్యి తానే తవ్వుకుంటోందా?

ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతోంది. అధికార వైసిసి పట్ల ఏం వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసిపి లోక్ సభ సభ్యులతో బిజెపికి పని లేకపోయినా రాజ్యసభ సభ్యులతో మాత్రం ఆ పార్టీకి ఇంకా పని ఉంది. పైగా వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్లు బాగా తగ్గి అన్ని సీట్లూ వైసీపీకి రాబోతున్నాయి. అందువల్ల వైసిపి రాజ్యసభ సభ్యులతో బిజెపికి పని ఉంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. ఈ బలహీనతతో బాటు వైసిపిని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం, బెంగ  బిజెపిని పట్టి పీడిస్తున్నాయి.  అందుకోసం కూడా బిజెపి అనుకున్న విధంగా వైసీపీని కట్టడి చేయలేకపోతున్నట్టు కనపడుతుంది. వైసిపికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం కనపడుతోంది.. పవన్ కల్యాణ్ వెనుక ఉండేది అందరూ యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి  విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్ధిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని జనసేన తమ ఆధీనంలోకి వచ్చే విధంగా బిజెపి చేసుకుంది. ఈ ఎత్తుగడతో వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్ కల్యాణ్ ను కూడా కట్టడి చేసి వైసిపిని బిజెపి అన్ని రకాలుగా రక్షిస్తున్నట్టు సామాన్యులు సైతం అనుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడం పై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బిజెపి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా మాట్లాడారని ప్రజలు అనుకుంటున్నారు. జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బిజెపి పూర్తిగా నీరుగారి పోయింది. ఉద్యమం చేస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బిజెపి తొలి ఐదేళ్లలో ఏపిలో బిజెపి పెరిగే అవకాశాన్ని చేజేతులా కొల్పోవడమే కాక  ఏపి ప్రజలకు విరోధిగా మారింది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత  బీజేపీకి ఏపిలో మళ్లీ పెరిగే అవకాశం వచ్చింది. అయితే అమరావతి తరలింపు తదితర అంశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ బిజెపి తన పెరుగుదలకు తానే పాతర వేసుకుంటోంది.  ఆంధ్రా రాజకీయాల్లో కమలం పార్టీ కన్స్యూజన్ లో ఉందని, తాజా పరిణామాలతో నేతలు అయోమయంలో వున్నారన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆంధ్ర నాయకులు ఒకలా.. ఢిల్లీ నాయకులు మరోలా మాట్లాడుతూ నానా  గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.  మూడు రాజధానుల నుంచి మండలి రద్దు అంశం వరకూ  బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కమలం పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకాక నేతలతో పాటు జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీలను వ్యతిరేకించినా ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

విశాఖ ఉక్కు ఉద్యమ స్ఫూర్తితో అమరావతి పరిరక్షణ.. ఒకే రాజధానికి పెరుగుతున్న డిమాండ్

60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు. కానీ దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత అమరావతిలో విభజన ఏపీ రాజధాని కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు ఉద్యమం నాటి పరిస్ధితులు మాత్రం కనిపించడం లేదు. విశాఖ ఉక్కు వల్ల మిగతా ప్రాంతాలకు ఎలాంటి లాభనష్టాలు లేకపోయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యమించిన ప్రజలు ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలింపు వల్ల నష్టమని తెలిసినా కూడా ఉద్యమాన్ని మాత్రం ఎందుకు తమదిగా భావించలేకపోతున్నారు? 1965లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఐదు ప్రాంతాల్లో భారీ ఉక్కు కర్మాగారాల్ని నిర్మించాలని భావించింది. అందులో విశాఖపట్నం కూడా ఒకటి. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా దీనికి అంగీకరించారు. అయితే 1966లో శాస్త్రి మరణం తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ తన రాజకీయ అవసరాల కోసం ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ లో కాకుండా వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల  ప్రజలు కుల, మత, ప్రాంతాలకతీతంగా వ్యతిరేకించారు. ప్రస్తుత రాజధాని అమరావతిలోని తాడికొండకు చెందిన కాంగ్రెస్ దళిత నాయకుడు టి.అమృత రావు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి, సొంతపార్టీకి వ్యతిరేకంగా 1966 అక్టోబర్ 14న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 32 మంది పోలీస్ కాల్పులలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో ఉక్కు పరిశ్రమ రాకతో స్ధానికులకే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసినా, మిగతా ప్రాంతాల వారు సంకుచితంగా ఆలోచించలేదు. ఉక్కు పరిశ్రమ రాకతో తెలుగు జాతి ఆర్ధికంగా వృద్ధి చెందుతుందని భావించారు.  చివరికి ఎవ్నో పోరాటాల తర్వాత 1971 నుంచి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తర్వాత 90వ దశకం వరకూ కేంద్రంలో వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. నలుగురు ప్రధానులు కూడా మారారు. రాష్ట్రంలోనూ వివిధ పార్టీలు, 10 మంది ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చారు. రాజకీయ అవసరాల కోసమో, మరే ఇతర కారణాలతోనో విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరో ప్రాంతానికి మార్చాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికీ రాలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 24 వేల ఎకరాల భూసేకరణ చేసిన అప్పటి ప్రభుత్వం..  మార్కెట్ ధర కన్నా 8 నుండి 10 రెట్లు ఎక్కువ నష్టపరిహారం కూడా ఇచ్చింది. భూములు కోల్పోయిన కుటుంబాలకు శిక్షణ ఇచ్చి, వేలాదిగా ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇళ్ళు కోల్పోయిన వారికి ఇంటిస్థలం, ఇల్లు నిర్మించుకోవటానికి సాయం కూడా అందించారు. కానీ గతేడాది డిసెంబర్ 17న అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి ప్రాంతంలో అనిశ్చితి మొదలైంది. వాస్తవానికి 2014 లో ప్రాంతీయ తత్వం కారణంగా ఏపీ విభజన జరిగితే, సెప్టెంబర్ 4వ తేదీన రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలలో  నిర్మాణం చేయాలని అసెంబ్లీ లో అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. రాజధానికి 29 వేల రైతు కుటుంబాల నుంచి 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో చేపట్టిన ఈ భూసేకరణలో భూములిచ్చిన రైతులకు 25 శాతం అభివృద్ధి చేసిన ప్లాట్లను, పదేళ్ల పాటు కౌలు తప్ప చంద్రబాబు ప్రభుత్వం మరో పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ లో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా అమరావతిలో ఉన్న సచివాలయం, హైకోర్టును విశాఖ, కర్నూలుకు తరలించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని సమర్ధించుకునేందుకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలను తెరపైకి తెచ్చింది. చివరికి 10 మంది మంత్రులతో కూడిన హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజదానుల నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులు అసెంబ్లీలో నెగ్గించుకున్నా.. మండలిలో మాత్రం ఛైర్మన్ వాటిని సెలక్ట్ కమిటీకి పంపడంతో ఈ నిర్ణయం భవితవ్యం ఏమిటన్నది ఇంకా తేలడం లేదు.  అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు నిత్యం రోడ్లపై ఉద్యమాలు చేస్తున్నారు. కానీ మిగతా ప్రాంతాల నుంచి మాత్రం వారికి తగిన సహకారం, మద్దతు లభించడం లేదు. చివరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ప్రతి రోజూ రాజధాని గ్రామాల్లో తిరుగుతూ అక్కడి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. మరోవైపు సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం మూడు రాజధానులకు మద్దతుగా మిగతా ప్రాంతాల్లో మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటి కట్టడాలతో కుదురుకుంటున్న రాజధానిని తరలింపు చేపట్టడం అనేది వాస్తవంగా అవసరమా కాదా అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో కుల, మత , ప్రాంతాలకు అతీతంగా పోరాడిన ప్రజలు ఇప్పుడు అమరావతిలోనే రాష్ట్ర రాజధాని ఉండాలన్న వాదనకు మద్దతుగా నిలవకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో విశాఖ ఉక్కు కోసం ఊరూవాడా ఉద్యమించిన ప్రజలు రాజధాని విషయంలోనూ అదే చొరవ, తెలువ చూపితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే అవకాశం కూడా లభిస్తుంది. అదే సమయంలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మీడియాత పాటు మేథావులు కూడా నిర్ణయాత్మక రీతిలో గొంతు విప్పితే అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వాదనకు బలం చేకూరినట్లవుతుంది.

అమరావతిని స్మశానంతో పోల్చిన ప్రభుత్వం.. రావణ కాష్టం రగల్చనుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు. అదే విధంగా భవిష్యత్తులో ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తానేనని తప్పక చెప్పుకుంటారని, అందుకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతిని తరలించడమే కాకుండా అమరావతిని సర్వ నాశనం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనపడుతోంది. అమరావతి అనే పేరు వినిపించకుండా చేసేందుకు వైఎస్ జగన్  నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని ఎడతెగని ఉద్యమం చేస్తున్న రాజధాని గ్రామాల ప్రజలపైకి వేరే ప్రాంత ప్రజలను యుద్ధానికి పంపుతున్నది. అమరావతి భూములలో దాదాపు నాలుగు వేల ఎకరాలను పేదలకు పట్టాలుగా పంచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందనే వార్తలు గుప్పు మనడంతో రాజధాని ప్రాంతాల రైతులు అలోలక్ష్మణా అంటూ ఏడుస్తున్నారు. రాజధాని తరలిపోవడం ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇచ్చేయడం మరొక ఎత్తు. పేదలకు పట్టాలు ఇచ్చేస్తే వారు వచ్చి ఆక్రమించుకుంటారు. దాంతో అమరావతి ప్రాంతంలో అంతర్యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. వేరే ఊరుకు చెందిన ప్రజలు తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు, దాన్ని అమరావతి ప్రాంత ప్రజలు అడ్డుకుంటే అంతర్యుద్ధం తప్పదు. అమరావతి ప్రాంత రైతులు బాగా బలిసిన వారని అందుకే పేద ప్రజలకు భూములు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని వైసిపి నేతలు ప్రచారం మొదలు పెడతారు. దాంతో ఈ సమస్య మరింత తీవ్ర తరం అయి అమరావతి సర్వ నాశనం అవుతుంది. దాదాపు నెల కిందటే అమరావతి భూములను పందేరం చేయాలనే ప్రతిపాదన పెట్టారు. అయితే ఆ విషయం బయటకు రాలేదు. గ్రామ సచివాలయం అధికారులు విజయవాడ గుంటూరు పట్టణాలలో భూముల కోసం అర్జీ పెట్టుకున్న పేదల నుంచి అమరావతి గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమా అనే అభిప్రాయ సేకరణ మొదలు పెట్టేసరికి విషయం అమరావతి రైతులకు తెలిసింది. దాంతో వారి కలలు పటాపంచలు కావడమే కాకుండా సాటి ప్రజలతో పోరాడే స్థితికి తమను ప్రభుత్వం నెట్టివేస్తోందని ఆగ్రహిస్తున్నారు. తాము భూములు ఇస్తే తమ ప్రాంతం సింగపూర్ హాంకాంగ్ లాగా అవుతుందని కలలు కన్నారు. ఇప్పుడు రాజధాని అక్కడ నుంచి వెళ్లిపోవడమే కాకుండా తమ భూములను అందరికి పంచే వ్యూహాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలో వారికి అర్ధం కావడం లేదు. కసితో కక్షతో ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలో వారికి అర్ధం కావడం లేదు. నాలుగు వేల ఎకరాలు పేదవారికి పట్టాలిచ్చి పంచితే అక్కడకు లక్షల సంఖ్యలో జనాభా వచ్చేస్తారు. వారంతా కాలకృత్యాలు తీర్చుకోవడానికి, చెత్త డంప్ చేయడానికి, ఉపయోగించిన ప్లాస్టిక్ ను పడేయడానికి కృష్ణానదిని వాడితే ఇక కృష్ణమ్మ మరో మూసీగా మారక తప్పదు. కృష్ణా నది గర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే కొందరు బడాబాబులు పెద్ద పెద్ద భవనాలు అక్కడ నిర్మించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆ భవనాలన్నింటిని కూలగొట్టి కృష్ణా నదిని కాపాడతానని చెప్పడమే కాదు..దానికి నాందిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టారు కూడా. తర్వాత అక్కడ ఉన్న భవనాల యజమానులకు తాకీదులు కూడా ఇచ్చారు. కానీ కోర్టుల జోక్యంతో అక్కడ ఉన్న భవనాలను అంగుళం కూడా ఆయన కదిలించలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని జనాలతో నింపేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు కనపడుతోంది. నది ఓడ్డున రాజధాని కడితే మునిగిపోతుందని ఉదర కొట్టిన జగన్ ప్రభుత్వం అక్కడ పేదలకు పట్టాలు ఎలా ఇస్తుంది? నది పొంగి పేదలంతా మునిగిపోతే ఫర్వాలేదా? ప్రజల పైకి ప్రజలనే రెచ్చగొట్టి చోద్యం చూసే ప్లాన్ ఇది..అని రాజధాని ప్రాంత రైతులు, ప్రతి పక్షాలు అంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓవర్ డ్రాఫ్ట్ సెగ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భవిష్యత్ లో ఏ విధంగా ఉంటుందనే విషయంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2019-2020 జనవరి 23 వ తేదీ వరకూ, ఎక్కువ మొత్తం ఓ.డి. తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడటం ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు ఆర్ధిక సంవత్సరాలలో  ఓ.డి. పొందిన రోజులే 188 దినాలుగా నమోదు అయినట్టు, సమాచార హక్కు చట్టం (ఆర్టి ఐ యాక్ట్) కింద భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బిఐ) వెల్లడించింది.  వివరాల్లోకి  వెళితే, 2014-15 లో 14 రోజులకు గాను 4,313 కోట్లు, 2015-16 లో 6 రోజులకు గాను 95. 38 కోట్లు, 2016-17 లో 6 రోజులకు గాను 1,295.22 కోట్లు, 2017-18 లో 38 రోజులకు గాను 8,625. 81 కోట్లు, 2018-19 లో 88 రోజులకు గాను 19,616.71 కోట్లు, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి 23 వరకూ మొత్తం 36 రోజులకు గాను 13, 736. కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుందని ఆర్బీఐ.. ఆర్టిఐ చట్టం కింద సమాచారం పొందు పరిచింది. తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి, గడిచిన ఏడాది అంటే 2018-19 వరకూ అత్యధికంగా, 2018-19 లోనే ఆ ప్రభుత్వం అత్యధికం గా 88 రోజులకు గాను 19,616.71 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్నిడ్రా చేసింది. ఇప్పుడా పెను భారాన్ని, వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం కూడా మోయాల్సిన పరిస్థితి రావటం తో, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలైనపట్టి నుంచీ , ఈ ఏడాది జనవరి 23 వరకూ కేవలం 36 రోజులలో 13,736.75 కోట్ల రూపాయల ఓ.డి. సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. నిజానికి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి మించి పోతోందంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ కు, నిరుడు జూన్ 11, జూన్ 12 తేదీల్లో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ రెండు లేఖలు కూడా పంపారు. 2019 జూన్ 10 వ తేదీ నాటికి ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం 699. 99 కోట్ల రూపాయల మొత్తం గా నమోదైందని, ఆ త్రైమాసికం లో 16 రోజులు ఓ.డి. సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందిందనీ, వరసగా 14 రోజుల పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఓ.డి. పొందిన పక్షం లో రిజర్వ్ బ్యాంక్ చెల్లింపులు నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఆ లేఖలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ హెచ్చరించారు. నిరుడు జూన్ 12 వ తేదీన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం 17 వరస పని దినాల్లో 339. 17 కోట్ల రూపాయల ఓ.డి. పొందినట్టు పేర్కొన్నారు. తక్షణమే ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ లేఖలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శిని కోరారు. మొత్తం ఓవర్ డ్రాఫ్ట్ లెక్కలను పరిశీలించిన ఆర్ధిక నిపుణుల విశ్లేషణ ప్రకారం..రాష్ర ఆర్ధిక పరిస్థితి అంట ఆశాజనకం గా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం అప్పచెప్పిన ఓవర్ డ్రాఫ్ట్ లెక్కల నుంచి బయటపడాలంటే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికక్రమశిక్షణ చర్యలను తక్షణం చేపట్టాలని వారు సూచిస్తున్నారు.

సిఎంలుగా నాయుడు... జగన్ పూర్తిగా ఐఏఎస్‌ల మీదే ఆధార పడ్డారు

  ఒకరు సంక్షోభాలతో చెలిమి చేస్తే, మరొకరు పైనున్న దేవుడిపైన భారం వేశారు... ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు అంటూ ప్రజలను ఎమోషనల్ గా టచ్ చేసిన యువ నేత జగన్మోహన రెడ్డి. తనపై రుద్దబడిన లక్ష కోట్ల అవినీతి బురదను వదిలించుకోవటానికి లేదా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి ఈయనకు తొమ్మిదేళ్ల గడ్డు కాలం పట్టింది. నాయుడిదయితే  డిఫ్ఫరెంట్ స్టైల్. ఆధునికాంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ పితగా తనను తాను  ఆయన మార్కెట్ చేసుకున్న తీరుకు నార్త్ ఇండియా ముఖ్యమంత్రులు సైతం ఫిదా అయిపోయి, ఆయన చేత రెండు దశాబ్దాలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పించారు. వివిధ జాతీయ పార్టీల గోసలకు , వాటి మధ్య సమన్వయానికి ఆయనే చుక్కాని అయ్యారు. అటువంటి నాయుడిని ఈ రోజు 24 గ్రామాల చక్రబంధంలో ఇరికించింది  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే , తాజాగా... ఆయన ఒకప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అతడి నుంచి  విలువైన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సేకరింపచేసిన అమిత్ షా-మోడీ ద్వయం తెలుగుదేశాన్ని ఇరకాటం లో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఓ సారి నాలుగేళ్ల వెనక్కు రీలు తిప్పితే--అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2014లో విజయవాడ వచ్చేసి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత 2015 మధ్యలో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఒక పాజిటివ్ అప్రోచ్ కనిపించింది. . 'విభజనలో అన్యాయం జరిగింది. అయినా రెట్టింపు ఉత్సాహంతో, ధృఢ సంకల్పంతో పనిచేయాలి. హైదరాబాద్ నగరాన్ని తలదన్నే మహా నగరాన్ని నిర్మించుకోవాలి' అనే పాజిటివ్ స్పిరిట్ఆ యన మాటల్లో ధ్వనించింది. ప్రజల్లో అనేక కొత్త ఆలోచనలు, ఆశలు రేకెత్తించే పదాలు ఆ సందర్భంలో వినిపించాయి. ఆ తర్వాత ఆలాంటి 'స్ఫూర్తి'నిచ్చే ప్రసంగాలే 2018 మార్చి వరకూ కొనసాగాయి. అయితే ప్రజలు ఆతర్వాత ఎన్నికల్లో భిన్నంగా స్పందించారు. ఇప్పుడు, అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి- రాష్ట్ర ఆర్ధిక వాస్తవ పరిస్థితి, తాను ప్రజలకిచ్చిన హామీలు, రెండింటి మధ్య సమన్వయము  చేస్తున్న తీరు, రాష్ట్ర పరిస్థితిపై తన ప్రణాళికలు చెపుతున్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టు .'గాలిలో మేడలు, అసాధ్యమైన హామీలు ఇచ్చే ఆలోచన తనకు లేదని, మన రాష్ట్ర పరిస్థితి అర్ధం చేసుకుని ఆ మేరకు ఎంత చేయగలమో అంతే మాట్లాడాలి' అనే భావం వినిపించింది.మరి అయినా సారం జగన్మోహన్ రెడ్డి ఎందుకింతగా ఆఫీసర్ల మధ్యన సమన్వయము సాధించుకోలేకపోతున్నారు. ఏ రాష్ట్ర చరిత్ర లోనూ లేని విధంగా ప్రస్తుతం, ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ ల మధ్య ఆధిపత్య పోరుకు అమరావతి సెక్రెటేరియట్  వేదిక కావటం ప్రస్తుతం దేశం మొత్తం చూస్తున్న చోద్యం. ముఖ్యమంత్రులుగా అటు నాయుడు, ఇటు  జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి ని పరిశీలిస్తే, నాయుడి ఎడ్మినిస్ట్రేషన్ ఎప్పుడూ చాలా గుంభనం గా వ్యవహరించేది. లోపల తగువులున్నప్పటికీ, ఎక్కడా ఎవరూ బయటపడిన సందర్భాలు లేవు. ఇప్పుడు అందుకు భిన్నంగాఉంది... జాస్తి కృష్ణ కిషోర్, ఏ బి వెంకటేశ్వర రావు ల ఎపిసోడ్లు పరిశీలిస్తే, అమరావతి సచివాలయం నేషనల్ మీడియాకు కావలసినంత మసాలాను ఉత్తి  పుణ్యానికే అందించినట్టు తెలిసిపోతోంది. ఇది అవాంఛనీయ, అనభిలషణీయ పరిణామమని సీనియర్ అధికారులంటున్నారు. అమరావతి లో క్యాపిటల్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ, ఇలాంటి సంఘటనల ద్వారా రాష్ట్రం పరువు ఢిల్లీ వీధుల్లో మార్కెట్ వస్తువుగా మాత్రం మారిపోయింది. ఇక నైనా , అధికారం లో ఉన్న వారు పూర్తిగా ఐ ఏ ఎస్ ల మీద ఆధారపడి పాలన సాగించే ఛత్రం నుంచి బయట పడాలి. నాయుడి ఓటమి కి కారణం ఆయన పూర్తిగా బ్యూరోక్రాట్లమీదే ఆధారపడటం అని తెలుగుదేశం లో సీనియర్ నాయకులు ఇప్పటికే, ఒక పార్టీ అధ్యక్షడుకి ఒక ధీసిస్ కూడా సమర్పించిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకోవాలి.

మా అమ్మాయి పెళ్లి వరకూ విడిచిపెట్టండి : దర్యాప్తు సంస్థలను కోరిన పెండ్యాల శ్రీనివాస్!

ఐదోరోజు విచారణలో కంట తడి పెట్టిన పెండ్యాల జరుగుతున్న దర్యాప్తు తీరుతో బిత్తరపోయిన తెలుగుదేశం శ్రేణులు దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఎవరూ..ఏమీ మాట్లాడవద్దని పార్టీ క్యాడర్, లీడర్లకు నాయుడు ఆదేశం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ, దర్యాప్తు సంస్థలను ఉటంకిస్తూ కొందరు సీనియర్ అధికారులు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నారు. వరసగా ఐదోరోజు కూడా పెండ్యాల శ్రీనివాస్ ఇంటిలో జరిగిన సోదాల సందర్భంగా, పెండ్యాల శ్రీనివాస్ అటు ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ , ఇటు ఇన్ కమ్ ట్యాక్స్, మరో వైపు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ సంస్థల బృందాల వద్ద తన వైపు నుంచి అప్రూవర్ గా మారటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడైన ఒక మాజీ ఐ.ఏ.ఎస్. అధికారికి బంధువైన పెండ్యాల శ్రీనివాస్, నాయుడు దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చాలా సంవత్సరాలు పని చేశారు. 2014 లో తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన తర్వాత నాయుడు, పెండ్యాల శ్రీనివాస్ ని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలలో, పెండ్యాల కొందరు ఐఏఎస్ లను ఏక వచనంతో సంబోధించేంతగా ఎదిగారు. నాయుడు దగ్గర పూర్తిగా ఆంతరంగిక సిబ్బందిలో భాగమైన పెండ్యాల శ్రీనివాస్ ద్వారా జరిగినట్టుగా ప్రచారమవుతున్న లావాదేవీలలో, ఎక్కువగా నాయుడికి అత్యంత సన్నిహితులైన వారి పేర్లు ఎక్కువ దఫాలు శ్రీనివాస్ ద్వారా జరిపిన బ్యాంక్ నగదు లావాదేవీల్లో రిఫ్లెక్ట్ అయినట్టు దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. కోటి రూపాయలకు పైబడి నగదు లావాదేవీలు జరిపేంతటి స్థాయి లేని పెండ్యాల శ్రీనివాస్ , పలు దఫాలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అందుకు బాధ్యులైన వారితో జరిపిన లావాదేవీలు, అలాగే ఫోన్ సంభాషణలన్నింటినీ కూడా దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా సేకరించి, అధ్యయనం చేస్తున్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా, వివిధ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన పెండ్యాల శ్రీనివాస్.. తాను అప్రూవర్ గా మారటానికి సిద్ధంగా ఉన్నాననీ, వచ్చే మాసం లో తన కుమార్తె వివాహం ఉన్న దృష్ట్యా తనను ప్రస్తుతానికి విడిచిపెట్టాలని అభ్యర్ధించినట్టు సమాచారం. అంతేకాకుండా, తన ద్వారా ప్రతిరోజూ పార్టీ లోని, ప్రభుత్వం లోని అత్యంత కీలకమైన వ్యక్తులకు ఏ మేరకు సొమ్ములు చేరవేసింది కూడా పెండ్యాల శ్రీనివాస్ దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అతని కాల్ రికార్డు హిస్టరీని, అలాగే బ్యాంక్ నగదు లావాదేవీల హిస్టరీని అధ్యయనం చేస్తున్న దర్యాప్తు అధికారులకు విస్తుపోయే సంగతులు తెలిసాయి. ఒక ప్రముఖ నటుడు, మాజీ ఎం.పి కి చెందిన నిర్మాణ సంస్థ తోనూ, అలాగే, మరో మాజీ ఎం.పి, ఆటోమోబైల్ వ్యాపార రంగం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా శాఖలున్న సంస్థ తోనూ...శ్రీనివాస్ ద్వారా జరిగిన ఆర్ధిక లావాదేవీలతో దర్యాప్తు సంస్థలు అనివార్యంగా తమ ఇంటరాగేషన్ ను మరి కొద్దీ రోజులు పొడిగించాల్సి వచ్చింది. వాస్తవానికి అటు హైదరాబాద్ లోనూ, ఇటు విజయవాడ లోనూ, ఇంకా శ్రీనివాస్ స్వస్థలంలోనూ జరుగుతున్న సోదాల సందర్భంగా తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని లోగడ ముఖ్యమంత్రి కార్యాలయం లో చక్రం తిప్పిన పలువురు సిబ్బంది ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా తెలుగు  దేశం హెడ్ క్వార్ట్రర్స్ నుంచి శ్రీనివాస్ ను ఆదుకునే వ్యవస్థేలేవీ ముందుకు రాకపోవడంతోనే, ఆయన అప్రూవర్ గా మారటానికి   నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

నా గురించి వర్రీ కాకండి: ఏ.బి. వెంకటేశ్వర రావు

కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఏ.పీ. సర్కార్ ఇది మరో సంక్షోభం... మొన్న జాస్తి కృష్ణ కిషోర్... ఈ రోజు ఏ.బి. వెంకటేశ్వర రావు. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వితే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందించిందో ఇప్పటికే అనుభవైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దూకుడు గా వ్యవహరిస్తోంది. జగన్ సర్కార్.... ఏమిటీ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలు... నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ అదనపు డి.జి. గా ఒక వెలుగు వెలిగిన ఏ.బి. వెంకటేశ్వర రావుతో  ఇప్పటి ప్రభుత్వం వ్యవహరించిన విధానం అసలేమాత్రం బాలేదనేది నిపుణుల అభిప్రాయం. అవును, ఏ.బి. రక్షణ పరికరాలు కొనడం మాత్రమే కాదు... 23 మంది ఎం.ఎల్.ఏ.  లను కొనడంలో కూడా కీలక పాత్ర పోషించారు... కాదనలేము.... ప్యానెల్ లో నిపుణుడు అయిన అధికారిని మార్చి తన పేరు మాత్రమే ఉండాలి అని చూసుకున్న సర్క్యులర్ ఉంది. ఇదీ కాదనలేం. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కనుగోలు చేసి, నాయుడు పట్ల తన ప్రభు భక్తిని చాటుకున్నారు ...ఇది జగమెరిగిన సత్యం..ఇందులోనూ ఎలాంటి వివాదం లేదు..కానీ, ఇవన్నీ చేసింది ఆయన తన ప్రభుత్వానికి మీ నుంచి..అంటే వై.ఎస్.ఆర్.సి.పి . నుంచి ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్త లో భాగంగానే అనే విషయం మీరు గుర్తించాలి. అసలు లోగడ , ఏ ప్రభుత్వమైనా ఇలా కక్ష గట్టి అధికారులను టార్గెట్ చేసిన సందర్భాలున్నాయా.... మీ తండ్రి హయాంలో ..చంద్రబాబు నాయుడు భక్తులైన అధికారులకు కూడా సముచిత ప్రాధాన్యం లభించిన సంగతి మీకు తెలియదా.... చంద్రబాబు నాయుడి కి అత్యంత నమ్మకస్తుడైన సతీష్ చంద్ర చేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగాఉన్న సమయం లో జలయజ్ఞం బాధ్యతలు అప్పగించలేదా... జగన్ మోహన్ రెడ్డి గారూ... ముఖ్యమంత్రిగా మీరు అందరినీ కలుపుకుని పోవలసిన సందర్భం ఇది... ఇంటా , బయటా శత్రువులను తయారు చేసుకుంటే, రాబోయే ఆపదల నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఇది ప్రతిపక్ష నేత నాయుడిని అభినందించాల్సిన సందర్భం ..ఎందుకంటే, ఎలాంటి అధికారి చేతనైన ఆయన పని చేయించుకునే  తీరు నుంచి మీరు నేర్చుకోవలసిన అవసరం ఏంటో ఉంది. జాస్తి కృష్ణ కిషోర్ లాంటి మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆఫీసర్ మీద కేసులు బనాయించిన మీ తీరు చూస్తే, పిడుక్కీ, బియ్యానికి ఒకటే మంత్రమేసే మీ అమాయకత్వమే కనిపిస్తోంది. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్ట్రర్స్ దాటి వెళ్ళొవద్దనేంత ఆదేశాలు ఇచ్చేముందు అసలు ఏ.బి. ర్యాంక్ ఏమిటి చూశారా..అన్నీ బావుంది, నాయుడు అధికారం లోకి వచ్చి ఉంటె, ఆయన డి.జి.పి . ఆయ్యేవారు... 40 ఏళ్ళ  సర్వీసు ఉన్న ఆ ఆఫీసర్ ఉన్న పళంగా ఏ విదేశాలకూ పారిపోరు...సెలవు పెట్టి తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని వ్యాపకం గా చేసుకున్న ఏ.బి. ఎక్కడికి పారిపోతారు? ఐదు కారణాలను చూపుతూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనలకు  విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు, ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు , ఇజ్రాయెల్ సంస్ధ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్ తో కుమ్మక్కై కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ, విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని కూడా పేర్కొన్నారు. విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ చేశారు. నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రాష్ట్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణతో పాటు, కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని, విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని, ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని, నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారని, కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారని ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఇవన్నీ భారీ స్థాయి అభియోగాలు. అఖిల భారత సర్వీసు నిబంధలు ఉల్లంఘిస్తే, ఏ.బి. రాజద్రోహానికి పాల్పడినట్టు మీరు భావిస్తే, మన రక్షణ వ్యవహారాలకు భంగం కలిగించేలా ప్రోటోకాల్ నిబంధల కు నీళ్లు వదిలితే ...రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు....సొంతంగా దర్యాప్తు చేయటానికి మీకున్న విశేషాధికారాలు ఏమిటి..లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని మీకు తెలియదా? నిజానికి సస్పెండ్ చేయటమ వరకూ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది.... దీనిని ర్యాటిఫై చేయాల్సింది కేంద్రమే.నెలరోజుల లోపు ఈ వ్యవహారాన్ని కేంద్రానికి చేరవేయాలి. ఈ మొత్తం ఎపిసోడ్ పై ఏ.బి. వెంకటేశ్వర రావు 'తెలుగు వన్' తో మాట్లాడుతూ... మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. దీనివల్ల మానసికంగా తనకు వచ్చిన నష్టమేమీ లేదని, కాబట్టి మరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానని కూడా ఏ.బి. చెప్పారు.

నాయుడు మాజీ పీ.ఎస్. పెండ్యాల శ్రీనివాస్ చెప్పిన ఆ ఇద్దరూ ఎవరు?

ఒక ఇన్ ఫ్రా మేజర్ ద్వారా జరిగిన లావా దేవీ ల వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ తలకు చుట్టుకుంటోందా? 36 గంటల పైబడి జరుగుతున్న విచారణ లో పెండ్యాల ఇంతకీ ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈ.డీ) కి ఏమి సమాచారం చేరవేశారు? కిలారు రాజేష్, గుత్తా కిరణ్ లనూ ఇదే విషయమై విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడో రోజు కూడా శ్రీనివాస్ ఇంటిలో ఈ.డీ. చేస్తున్న సోదాలకు , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డి.ఆర్.ఐ.), ఇన్ కమ్ ట్యాక్స్ (ఐ.టీ.) బృందాలు కూడా తోడవటం తెలుగుదేశం పార్టీ సీనియర్లను కలవరపెడుతోంది. పెండ్యాల శ్రీనివాస్ నివాసం లోని రహస్య లాకర్ల నుంచి కీలకమైన ఓత్రాలను స్వాధీనం చేసుకున్న ఈ.డీ. , డీ.ఆర్.ఐ. , ఐ.టీ . బృందాలు ప్రస్తుతం వాటిని అధ్యయనం చేసే పనిలో పడినట్టు సమాచారం. వాస్తవానికి, తమ నాయకుల నివాసాలు, వ్యాపార సంస్థలపైన లోగడ ఐ.టి. దాడులు జరిగినప్పుడు హడావుడిగా మీడియా సమావేశాలు నిర్వహించి కేంద్ర సంస్థలను ఏకిపారేసిన తెలుగుదేశం అగ్రనాయకత్వం ఇప్పుడు జరుగుతున్న సోదాల మీద మాత్రం ఏ రకమైన వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ, కేంద్ర సంస్థల తీరును ప్రశ్నిచే ప్రయత్నం కానీ చేయకపోవటం రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేస్తోంది. వాస్తవానికి, నిరుడు అక్టోబర్ లో జరిగిన సోదాల్లోనే ప్రముఖ ఇన్ ఫ్రా మేజర్ పేరు వెలుగులోకి వచ్చింది. అమరావతి నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్న ఆ సంస్థ, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ ద్వారా జరిపిన లావా దేవీల వ్యవహారం అంతా గమనించిన సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సి.బి.డి.టి.), ఇంకా ఐ.టి. అధికారులు ఆ ఇన్ఫ్రా మేజర్ ద్వారా అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ సంస్థ నుంచి దాదాపు 750 కోట్ల రూపాయల విరాళాలు వెళ్లినట్టు గుర్తించారు. అప్పటి నుంచే, దీనిపైన నిఘా వుంచిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈ.ఓ. డబ్ల్యు. ) ఆ దరిమిలా చేపట్టిన విచారణలో... అప్పటి ముఖ్యమంత్రి పెర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ పేరు ప్రముఖం గా ఫిగర్ అయింది. అలాగే, నారా లోకేష్ కుడి భుజం, ఎడమ భుజాలుగా వ్యవహరించిన కిలారు రాజేష్, గుత్తా కిరణ్ ల వ్యవహారం పైన కూడా ఈ నిఘాసంస్థలన్నీ దృష్టి సారించాయి. ముంబై కి చెందిన ఇన్ఫ్రా మేజర్ నుండి 150 కోట్ల రూపాయల  విరాళం తెలుగుదేశం పార్టీకి విరాళంగా వెళ్ళిందంటూ వచ్చిన వార్తల దరిమిలా, ఈ ఎపిసోడ్ లో కీలకపాత్ర పోషించినట్టుగా చెబుతున్న పెండ్యాల శ్రీనివాస్ ను పూర్తి స్థాయి లో విచారించటానికే, ఆయన్ను హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. ఐదేళ్ల పదవికాలం లో ఆ సంస్థకు దాదాపు 2230 కోట్ల రూపాయలు పనుల కాంట్రాక్టు పనులు అప్పజెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం లో కీలకమైన శాఖలకు మంత్రులుగా వ్యవహరించిన డాక్టర్ నారాయణ, నారా లోకేష్ అనుయాయులపైనా, వారి ఆర్ధిక లావాదేవీల కు సంబంధించిన డాక్యుమెంట్ల పైన లోతైన అధ్యయనం చేయటం కోసమే నిఘాసంస్థలు ఇంత సమయం తీసుకుంటున్నామని సమాచారం. పనులు ఇచ్చినందుకు గాను అప్పట్లో గవర్నమెంట్ కు చెందిన వ్యక్తి కి 700 కోట్లు చెల్లించాలని, అందులో భాగంగా అప్పటి అధికార పార్టీకి ఎన్నికల సమయంలో 150 కోట్ల రూపాయల డబ్బులు అందాయని  దర్యాప్తు సంస్థల విచారణ లో ప్రాధమికంగా వెల్లడైన అంశం. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్, ఆగ్రా, పూణే, గోవాలతో పాటు 42 చోట్ల, నిరుడు నవంబరు లో జరిపిన సోదాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు తేలినట్టు దర్యాప్తు సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఎన్నికల సమయం లో 150 కోట్ల రూపాయల డబ్బు  హైదరాబాద్ మీదుగా విజయవాడ కు చేరినట్టు గుర్తించిన ఐటీ అధికారులు, తర్వాతి విచారణ నిమిత్తం, ఈ.డీ., డీ.ఆర్. ఐ. ల సాయం కోరినట్టు సమాచారం. నిజానికి, ఇంత భారీ స్థాయిలో సోదాలు జరుగుతుంటే, అందునా... తన మాజీ పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ నివాసం లోనూ, లోకేష్ ఆంతరంగికుడు కిలారు రాజేష్, అలాగే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి నివాసాల్లోనూ ఈ సోదాలు గడిచిన 36 గంటలుగా జరుగుతుంటే, తెలుగుదేశం అగ్రనాయకత్వం కిక్కురుమనకుండా కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవానికి, ఇప్పటికే వైఎస్ఆర్సిపీ ని ఈ ఎపిసోడ్ లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం తెలుగుదేశం చేసి ఉండేదనీ, అయితే, అవతల దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో రంగంలోకి దిగటం తో ఏమి జరుగుతుందో వేచి చూద్దామనే ధోరణిలోకి తెలుగుదేశం వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, ఈ పరిణామాలేవీ వైఎస్ఆర్సిపీ కి కూడా మింగుడుపడటం లేదు..కారణమేమిటంటే , రాబోయే రోజుల్లో తమ వ్యాపార, వాణిజ్య సంస్థలపైనా కేంద్ర సంస్థలు ఈ రకమైన సోదాలు నిర్వహించవచ్చునేమోననే సందేహాలు ఆ పార్టీ లోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం బట్టి పెండ్యాల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు పారిశ్రామిక వేత్తల పేర్లు మాత్రమే ...దర్యాప్తు సంస్థల అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.

ఐటీ దాడులతో టీడీపీలో కలవరం.. నాన్ బీజేపీ పార్టీలతో టచ్ లోకి వెళ్లాలని నాయుడు యోచన!

ఒకవైపు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రస్తుతం తెలుగుదేశాన్ని చుట్టుముడుతున్న తీరు, తెలుగుదేశం అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. దీన్ని ఎలా అధిగమించాలి అని తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి రాష్ట్రంలో కష్టకాలం మొదలైంది. పార్టీ అగ్ర నాయకత్వానికి అతి దగ్గరి వారైన అందరినీ ప్రస్తుతం జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.  గడిచిన 50 రోజులుగా మూడు రాజధానుల వివాదంతో  బలంగా ప్రజల్లోకి వెళ్లి గలిగిన తెలుగుదేశం పార్టీ, తాజాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అనుయాయుల నివాసాల మీద, కార్యాలయాల్లోనూ జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ దాడులతో ఆత్మరక్షణలో పడిపోయింది. నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, లోకేష్ అనుచరుడు కిలారు రాజేష్, ఇంకా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు నివాసాలపై, ఇన్కమ్ టాక్స్ అధికారుల బృందం ఒకేసారి హైదరాబాద్ ,విజయవాడలో దాడులు జరిపింది. 2 నెలల క్రితం, నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ పెద్దలతో జరిపిన రాజీ మంతనాలు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి ఊరటను ఇవ్వకపోగా బీజేపీ అధిష్టానం, ఇప్పట్లో తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధంగా లేదనే సంకేతాలను పంపాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో దూకుడు పెంచిన బిజెపి, తెలుగుదేశంతో సమానంగా అధికార వైయస్సార్సీపి పై ఉద్యమాల బాట పట్టింది. ఆరడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ బిజెపికి తోడవడంతో, ప్రస్తుతానికి తెలుగుదేశంతో దూరం పాటించాలనే ఆలోచన లో బిజెపి హెడ్ క్వార్టర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఒక చిత్రమయిన పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ , వ్యూహాత్మకంగా వెళ్లలేక పోతుంది అనే భావన పార్టీ క్యాడర్లో నెలకొని ఉంది. మూడు రాజధానుల ప్రకటన చేసి జగన్మోహన్రెడ్డి సర్కార్, తెలుగుదేశం పార్టీకి కావలసినంత  ఆక్సిజన్ ఇచ్చినప్పటికీ, తాజాగా జరిగిన ఐటీ దాడులు ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. 2024 లో కనీసం ప్రతిపక్ష స్థాయిని చేరుకోవాలని భావిస్తున్న బిజెపి, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దశలవారీగా దెబ్బ కొట్టడానికి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను టచ్ చేస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ బలహీన పడుతుందని, తద్వారా బీజేపీని బలోపేతం చేసుకోవచ్చునని అమిత్ షా ఇప్పటికే ఒక దిశా నిర్దేశనం  చేసినట్టు సమాచారం. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో టిడిపి ముఖ్య నాయకుల నివాసాలు కంపెనీల పైన కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని తెలుగుదేశం భావిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు, మరోవైపు పార్టీ అంతర్గత నిర్మాణం లో ఎటువంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి, బిజెపి వైపు నుంచే ఎక్కువ ప్రమాదం కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని ఖరాఖండిగా చెప్పేసిన వైయస్సార్ సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి,  ఆ రకంగా టీడీపీకి రిలీఫ్ ఇచ్చినప్పటికీ, మరోవైపు బిజెపి దూకుడుగా వెళుతూ  రాష్ట్రంలో టిడిపిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే, నాయుడు ముఖ్య అనుచరులపై కేంద్ర సంస్థలు మరికొన్ని కేసులతో, తెలుగుదేశాన్ని ఇరకాటంలో పెట్టే  ప్రయత్నాలు జరగవచ్చునని సంకేతాలు ఉన్నాయి. దరిదాపుల్లో టీడీపీకి, బిజెపి నుంచి స్నేహ హస్తం అందే అవకాశం లేక పోవటం వల్ల, ప్రస్తుతానికి అడుగులు ఆచి తూచి వేయాలని, అవసరమైతే  నాన్ బిజెపి పార్టీలతో మరోసారి జట్టు కట్టి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోనుందా? జగన్ ప్రభుత్వంతో కియాకి పడటం లేదా?

వైసీపీ ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పలువురు పారిశ్రామికవేత్తలు సైతం వైసీపీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతుందంటూ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మోహన్‌దాస్ పాయ్ ఆమధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రముఖ కంపెనీలు, పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శలు నిజమేనేమోననిపిస్తున్నాయి. ఎందుకంటే, దక్షిణకొరియా దిగ్గజ కంపెనీ కియా మోటార్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలగేందుకు ప్రయత్నిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తన ప్లాంట్ ను తరలించాలనే ఉద్దేశంతో ఉందనే ప్రచారం జరుగుతోంది. 1.1 బిలియన్ డాలర్లతో అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కార్ల ప్లాంట్ ను తమిళనాడుకు తరలించే సాధ్యాసాధ్యాలపై కియా మోటార్స్ చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. కియా మోటార్స్ ప్రతినిధులు ఇఫ్పటికే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపినట్లు ప్రముఖ వార్తసంస్థ రాయిటర్స్ సంచలన కథనం ప్రచురించింది. దాంతో, రాయిటర్స్ కథనంపై ఏపీలో కలకలం రేగుతోంది.  ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కారు మార్కెట్ కలిగివున్న కియా మోటార్స్... భారత్ లోకి ఎంట్రీ ఇచ్చి తన తొలి ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పింది. అనంతపురం జిల్లాలో రెండేళ్ల నిర్మాణ పనుల తర్వాత గతేడాది డిసెంబర్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది. ఏడాదికి 3లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నెలకొల్పిన ఈ ప్లాంట్లో ప్రత్యక్షంగా 12వేల మందికి ఉద్యోగాలను కల్పించింది. అయితే, చంద్రబాబు హయాంతో రాష్ట్రానికొచ్చిన కియా మోటర్స్.... జగన్ ప్రభుత్వం వచ్చాక కొన్ని ఇబ్బందులను ఎదుర్కొందనే ఆరోపణలు వినిపించాయి. అందుకు రుజువుగా, అసెంబ్లీ సాక్షిగా కియాకి చంద్రబాబు కల్పించిన రాయితీలు, సౌకర్యాలపై మంత్రి బుగ్గన తప్పుబట్టారు. దాంతో, కియా మోటార్స్ తో జగన్ ప్రభుత్వానికి సఖ్యత లేదనే మాటలు వినిపించాయి. ఇఫ్పుడు, రాయిటర్స్ కథనంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక టీడీపీ నేతలైతే జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ వంటి వారైతే.. ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారని ఈ శిక్ష అనుభవించాలి, ఏపీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారంటూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే, రాయిటర్స్ కథనాన్ని ఏపీ అధికారులు ఖండిస్తున్నారు. కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమంటున్నారు. కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఏపీ ఇండస్ట్రీస్ సెక్రటరీ రజత్ భార్గవ చెబుతున్నారు. వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా రాయిటర్స్ కథనాన్ని ఖండించారు. ఏపీ నుండి కియా తరలిపోతుందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సీఎం జగన్ కియాతో సంఖ్యతగా ఉన్నారని, రాష్ట్రంలో కియా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తారని విజయసాయి చెప్పుకొచ్చారు. అసలు రాయిటర్స్ లాంటి సంస్థ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏంటని అధికార పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కియా తరలిపోతుందన్న అసత్య ప్రచారంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో.. అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతలు.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. నష్టనివారణ చర్యలు చేపట్టారు. అయితే, రాయిటర్స్ కథనంపై కియా మోటార్స్ స్పందించాల్సి ఉంది. అలాగే, ఏపీ నుంచి ప్లాంట్ ను తరలించే ఉద్దేశం లేదని ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే అనుమానాలు కంటిన్యూ కావడం ఖాయం.

వికేంద్రీకరణ బిల్లుపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ!!

పాలన వికేంద్రీకరణ బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. కమిటీలు వేయొద్దని కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని సమాచారం. చైర్మన్ నిర్ణయం పాటించొద్దు అంటూ ఉప ముఖ్యమంత్రి, చీఫ్ విప్ లు లేఖలు రాశారు. దీంతో కార్యదర్శి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. పాలన వికేంద్రీకరణ, సీ ఆర్ డీ ఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు కాకుండా జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కమిటీల ఏర్పాటు జరగకుండా చూడాలని ప్రభుత్వ, వేసి తీరాల్సిందేనని చైర్మన్ గట్టి పట్టుదలతో ఉండటంతో ఉత్కంఠ భరితంగా మారింది. సెలక్ట్ కమిటీల ఏర్పాటును అడ్డుకునే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి కార్యదర్శికి ఏకంగా లేఖ రాయగా కమిటీల్లో నియమించేందుకు తమ సభ్యుల పేర్లను టిడిఎల్పీ ఇప్పటికే ఇన్ చార్జి కార్యదర్శి రాజ్ కుమార్ కు అందజేసింది. దీంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏకంగా మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం తుది నిర్ణయం తీసుకుని పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసేదాకా మండలి కొనసాగుతుంది. ఈలోపు సెలక్ట్ కమిటీలు ఏర్పాటు కాకుండా మండలి ఇన్ చార్జి కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెలక్ట్ కమిటీల్లో నియమించే ఎమ్మెల్సీల పేర్లు పంపాల్సిందిగా ఆయా పార్టీలకు లేఖలు రాయాలని మండల ఇన్ చార్జి కార్యదర్శికి ఇప్పటికే చైర్మన్ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో చైర్మన్ ఆదేశాల ప్రకారం ఆయన వెంటనే లేఖలు రాస్తారు కానీ, ప్రభుత్వ ఒత్తిడి బలంగా ఉండటంతో ఆయన ఇంత వరకూ ఈ లేఖలు పంపలేదు. ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే యోచనతో టిడిపి శాసన సభాపక్షం తమ తరపున పదిమంది ఎమ్మెల్సీల పేర్ల జాబితాను ఇప్పటికే కార్యదర్శికి అందజేసింది. ఒక్కో కమిటీలో టిడిపి కోటా కింద ఐదుగురు సభ్యులు వస్తారు. ఇది అందజేసినట్టు కార్యదర్శి నుంచి రశీదు కూడా తీసుకున్నారు. ఇది తెలిసి అధికార పక్షం వెంటనే రంగంలోకి దిగింది. మండలిలో సభా నాయకుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ లు విడివిడిగా కార్యదర్శికి లేఖలు రాశారు. నియమాలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీల ఏర్పాటు జరుగుతున్నందున అందులో తాము భాగస్వామి కాబోమని తమ పార్టీ నుంచి ఎవరూ ఈ కమిటీల్లో ఉండరని ఉమారెడ్డి తన లేఖలో తెలిపినట్టు ప్రచారం జరుగుతుంది. కమిటీలు ఏర్పాటు చేయాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం.. నియమాలకు విరుద్ధమని అందువల్ల కమిటీలు ఏర్పాటు చేయవద్దని కోరుతూ బోస్ మరో లేఖ రాశారు. ప్రభుత్వ అధికారి అయిన కార్యదర్శి అటు ప్రభుత్వపక్షం మాట కాదనలేక, ఇటు చేరిపోయిన ఆదేశాలను ధిక్కరించే పరిస్థితి లేక ఏ నిర్ణయం తీసుకోకుండా రోజులు నెట్టుకొస్తున్నారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మండలిలో సభా నాయకుడి లేఖను జతపరుస్తూ.. పై అభ్యంతరాల దృష్ట్యా తాను సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేనని చైర్మన్ కు లేఖ రాయాల్సిందిగా కార్యదర్శికి ప్రభుత్వం సూచించిందని అంటున్నారు. మరి ఆయన అలా రాస్తారా లేదా అన్నది చూడాలి.

శాసనమండలి రద్దు నిర్ణయంతో నిరాశకు గురైన వైసిపి నేతలు!!

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకే కాదు వైసీపీ నేతలకు కూడా తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. తాజాగా శాసనమండలిని రద్దు నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ లోని పలువురు నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే ఉద్దేశంతో ఏకంగా శాసన మండలినే ఏపీ ప్రభుత్వ పెద్దలు రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చిక్కుముడి విప్పబోయి వంద చిక్కుముడులు వేసినట్టుగా ఉంది జగన్ తీరు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు కామెంట్ చేస్తున్నారు. శాసన మండలి రద్దు నిర్ణయం వల్ల ఆ పార్టీలోని ఎందరో నేతల ఎమ్మెల్సీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో వారంతా పార్టీ అధినేత తీరుపై అసహనంతో ఉన్నారు.  మండలి రద్దు నిర్ణయంతో చిత్తూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముఖ్య నేతలు ఆశలు అడియాసలయ్యాయి. అందులో ఒకరు కె చంద్ర మౌళి కాగా రెండోవారు ఎస్సీవీ నాయుడు. తాము అధికారంలోకొస్తే ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడదే జగన్ ఏకంగా శాసనమండలిని రద్దు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మండలి సభ్యత్వం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ ఇద్దరి పరిస్థితేమిటన్నది పార్టీ శ్రేణులకు కూడా అంతుబట్టడం లేదు. సీఎం జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా ఎవరు తప్పుపట్టకపోయినా సన్నిహితుల వద్ద మాత్రం వారు ఆక్షేపిస్తున్నారు.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కె చంద్ర మౌళి కుప్పం నియోజకవర్గంలో 2014-19 ఎన్నికల్లో వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పోటి చేసారు. పోటీ చేసిన రెండు సందర్భాలలో కూడా చంద్రబాబు మెజారిటీని కొంత తగ్గించగలిగారు. ఇదిలా ఉంటే కుప్పంలో చంద్రమౌళిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఒకవేళ బాబుపై గెలవకపోయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తామని కూడా వాగ్దానం చేశారు. దీనికి తోడు 2019 ఎన్నికల్లో చంద్రమౌళి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనలేకపోయారు. దీంతో పార్టీ వర్గాల్లో ఆయనపై బాగా సానుభూతి ఏర్పడింది. వయసు రీత్యా కూడా ఇది చివరి అవకాశం అనే భావన అందరిలో ఉంది వీటికి తోడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా హామీ ఇచ్చినందున చంద్ర మౌళికి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని కుప్పం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. చంద్రమౌళి కూడా ఇదే ధీమాతో ఉన్నారు, మండలిలోకి చంద్రమౌళి అడుగుపెడతారని అదృష్టం కలిసొస్తే మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అనుచరులు గంపెడాశతో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిని రద్దు తీర్మానం చేయడంతో ఈ అంశం చంద్రమౌళి పాలిట పిడుగుల మారింది.  శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు రాజకీయంగా అనేక పార్టీలలో కొనసాగినప్పటికీ స్థానికంగా బలమైన నేత. శ్రీకాళహస్తితోపాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్తివేడులోనూ నెల్లూరు జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట నియోజక వర్గంలో ఆయనకు బాగా పట్టుంది. గత పాతికేళ్ల నుంచి శ్రీ కాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆశతో అప్పటికే తాను కొనసాగిన పార్టీలో టిక్కెట్ ఆశించి భంగపడిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి ఈ ఆశతోనే ఆయన పలు పార్టీలు మారినట్టుగా స్థానికులు చెబుతుంటారు. 2004ఎన్నికల సమయంలో ఎస్సీవీ నాయుడు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించింది, తొలిసారి గెలిచి చట్ట సభలోకి అడుగు పెట్టారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఎస్సీవీ నాయుడు తిరిగి తెలుగుదేశం గూటికి వచ్చారు. అప్పటి నుంచి టిడిపిలో కొనసాగారు. 2019 ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆశించారు, టికెట్ లభించకపోవడంతో టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీ కాళహస్తి సత్యవేడు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో కూడా ఎస్సీవీ నాయుడు పట్టు ఉండటంతో ఆ మూడు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు గట్టిగా కృషి చేశారు. అయితే పార్టీలో చేర్చుకునే సమయంలో ఎస్సీవీ నాయుడుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. వయసు రీత్యా నాయుడు కూడా ఈ ఐదేళ్ళలోనే సముచిత పదవులు పొందాలనే ఆశ పెట్టుకున్నారు. జగనిచ్చిన మాట నెరవేరుతుందని తన అనుచర వర్గంతో కూడా చెబుతూ వచ్చారు.  అయితే మూడు రాజధానుల బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకపోవడంతో ఏకంగా మండలి పైనే వేటు వేశారు సీఎం జగన్. ఈ పరిస్థితుల్లో ఎమెల్సి పదవులపై ఆశ పెట్టుకున్న నేతల్లోనే కాకుండా వారి అనుచర వర్గాల్లో కూడా తీవ్ర నిరాశ చోటుచేసుకుంది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇతర పదవులేమైనా ఇస్తారని ఆశించాలన్నా అలాంటి అవకాశం కనుచూపు మేరలో కనబడటం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాలతోపాటు మహిళలకు రిజర్వేషన్ పాటించేలా విధాన పరమైన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. దీంతో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు దక్కడం దాదాపు అసాధ్యమని ఆయా నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ నిర్ణయంపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలు బహిరంగంగా మాత్రం విమర్శించటం లేదు కానీ, అంతర్గతంగా బాగా రగిలిపోతున్నారట. మండలి రద్దును స్వాగతించే వారికన్నా విమర్శించే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

ఇది అసలు ట్విస్ట్ అంటే... దేశ రెండో రాజధానిగా అమరావతి!!

ఏపీని నెలరోజులుగా పట్టి కుదిపేస్తున్న అంశం మూడు రాజధానులు. అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్ష టీడీపీ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజధానిగా అమరావతినే ఉంచాలని, అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదని రైతులతో కలిసి ఉద్యమిస్తోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజధాని అంశంపై ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతుంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం వేడుక చూస్తోంది. ఆ పార్టీ నాయకులు.. కొందరు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో.. రాజధానిపై బీజేపీ స్పష్టమైన వైఖరి ఏంటో తెలియకుండాపోయింది. ఇలా రాజధాని రగడ నెలరోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. అయితే ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతున్న వేళ.. బీజేపీ ఊహించని ట్విస్ట్ ఇవ్వడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హవా ఉండేది. అయితే విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఏపీలో బీజేపీ ప్రభావం మొదటి నుండి అంతంత మాత్రంగానే ఉండేది. రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో కలిసి బరిలోకి దిగిన బీజేపీకి గౌరవప్రదమైన సీట్లు వచ్చాయి. అయితే ౨౦౧౯ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది. నోటా కంటే తక్కువ ఓట్లు సాధించింది. ఏపీ ప్రజలు.. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ని ఎంత వ్యతిరేకిస్తున్నారో... విభజన హామీలు మరిచి, ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన బీజేపీని కూడా.. అంతే వ్యతిరేకిస్తున్నారని ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది. ఆ వ్యతిరేకతను పోగొట్టి ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఆ దిశగానే ఇప్పుడు అడుగులు వేస్తోంది. దేశ రెండో రాజధాని దక్షిణాదిన ఉండాలని రాజ్యాంగంలో సూచించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. బీజేపీ ఇప్పుడు ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రెండో రాజధానిగా అమరావతి అయితే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్‌ఎస్ఎస్ కూడా అమరావతి అయితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చారిత్రకత, సంస్కృతి, ఇలా అన్నిటిపరంగా అమరావతి అనువైన రాజధాని అవుతుందని ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించి దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర భారత దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ.. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేదు ఫలితాలను రుచిచూసింది. దీంతో ఉత్తరంలో తగ్గిన ప్రభని దక్షిణంలో సరి చేయాలి అనుకుంటుంది. దానిలో భాగంగానే ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో 2014 నుండి టీడీపీ- వైసీపీల మధ్య పోరు నువ్వానేనా అన్నట్టుగా ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఊహించని విజయాన్ని అందుకొని.. టీడీపీకి వెనక్కి నెట్టింది. అయినా టీడీపీ బలంగానే ఉంది, ప్రతిపక్ష పార్టీగా తన గళాన్ని బలంగా వినిపిస్తోంది. అయితే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని వైసీపీ చూస్తోంది. మరోవైపు టీడీపీ ప్లేస్ లోకి బీజేపీ వచ్చి.. వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భావిస్తోంది. అంటే రెండు పార్టీలకు టీడీపీని దెబ్బకొట్టడం కావాలి. అందుకే రాజధాని అంశాన్ని తెరమీదకు తెచ్చి టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు. మూడు రాజధానులతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ మీద వ్యతిరేకత ఏర్పడేలా చేసి... మరోవైపు అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించి రాష్ట్రంలో బీజేపీ బలపడాలని చూస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మూడు రాజధానులు అంటూ వైసీపీ.. అమరావతి దేశ రెండో రాజధాని అంటూ బీజేపీ... ఇలా రెండు పార్టీలు కలిసి ఏపీలో టీడీపీని సమాధి చేయడానికి కంకణం కట్టుకున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.