English | Telugu
రమ్యకృష్ణ వల్లే ఆ షో నుంచి వనితా విజయ్‌కుమార్ బయటకు వచ్చేసిందా?
Updated : Jul 5, 2021
విజయ్ టెలివిజన్‌లో ప్రసారమవుతోన్న డాన్స్ రియాలిటీ షో 'బీబీ (బిగ్ బాస్) జోడిగళ్' నుంచి బయటకు వచ్చేసింది వనితా విజయ్‌కుమార్. ఆమె అలా ఆ షో నుంచి వచ్చేయడానికి కారణం రమ్యకృష్ణ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ షోలో తాను ఓ సీనియర్ మహిళ వల్ల వేధింపులకు, బెదిరింపులకు, అవమానాలకు గురయ్యానని ఓ స్టేట్‌మెంట్‌లో వనిత చెప్పింది. ఈ వివాదంపై రమ్యకృష్ణ స్పందించారు.
'బీబీ జోడిగళ్' షోలో అవమానాలకు గురయ్యానని తన సోషల్ మీడియా అకౌంట్ పోస్టులో తెలిపింది వనిత. తాను వేధింపులను భరించే మనిషిని కాదనీ, అందుకే ఆ షో నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నాననీ ఆమె చెప్పింది. ఒక స్త్రీ మరో స్త్రీని సపోర్ట్ చేయాలే కానీ, వాళ్ల జీవితాన్ని దుర్భరం చేయకూడదని ఆమె రాసుకొచ్చింది.
ఈ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న వారిలో రమ్యకృష్ణ ఒకరు. వనిత పర్ఫార్మెన్స్‌కు 10 మార్కులకు గాను రమ్యకృష్ణ ఇచ్చిన మార్కులు కూడా వనిత ఈ షో నుంచి బయటకు రావడానికి ఒక కారణం అంటున్నారు. దీనిపై 'సినిమా వికటన్' అనే తమిళ పత్రిక ప్రశ్నించగా, "నో కామెంట్స్" అని జవాబిచ్చారు రమ్యకృష్ణ. "మీరు 'బిగ్ బాస్ జోడిగళ్' షూటింగ్‌లో ఏం జరిగిందో వనితను అడిగితే బాగుంటుంది. నావరకు ఇదసలు ఒక సమస్యే కాదు. ఆ కాంట్రవర్సీపై నేను కామెంట్ చేయాలని ఇప్పటికీ మీరనుకుంటూ ఉంటే, నో కామెంట్స్ అనే చెప్తాను." అని ఆమె స్పష్టం చేశారు.
'బీబీ జోడిగళ్'కు రమ్యకృష్ణతో పాటు నటుడు నకుల్ జైదేవ్ మరో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. మునుపటి తమిళ 'బిగ్ బాస్' షోలలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారితో ఈ డాన్స్ రియాలిటీ షోను రూపొందిస్తున్నారు.