English | Telugu

బ్రూనోను కిరాత‌కంగా చంప‌డంపై యాంకర్ రష్మి ఎమోషనల్ పోస్ట్!

 

యాంకర్ రష్మీ గౌత‌మ్‌ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు పలు విషయాలపై ఆమె స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మూగజీవాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటుంది. మూగజీవాల పరిరక్షణ కోసం ఆమె ఎన్నో మంచి పనులు చేసింది కూడా. ఈ క్రమంలో త‌ను ట్రోలింగ్‌కు గుర‌వుతున్నా ఏమాత్రం ప‌ట్టించుకోదు. పండగల్లో జంతు బలి ఇవ్వడాన్ని తప్పుబడుతూ రష్మీ చాలా సార్లు నెగెటివ్ కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెని టార్గెట్ చేశారు. 

అయితే రష్మీ మాత్రం అసలు రాజీ పడదు. హిందూ సంప్రదాయాన్నే కాదు.. మూగజీవాలకు హాని కలిగించే ప్రతి అంశాన్నీ ఆమె వేలెత్తి చూపుతుంటుంది. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అనే తేడా లేకుండా అన్నింటి గురించి ఆలోచిస్తుంటుంది. వీధి కుక్కలపై జరిగే దాడిని ఎప్పటికప్పుడు ఖండిస్తుంటుంది.ఇటీవ‌ల‌ ఓ బీచ్‌లో బ్రూనో అనే కుక్కను ముగ్గురు కలిసి కిరాతకంగా చంపేశారు. కర్రలతో బాది ఆ తరువాత చేపల గాలానికి వేలాడదీసి చంపేశారు. 

ఈ భయంకరమైన ఘటన అందరినీ కుదిపేసింది. ఈ ఘటనకు కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన రష్మీ.. మనుషులు, మానవత్వం అనే దానిపై సిగ్గేస్తోంద‌ని.. కరోనా లాంటివి రావడం సమంజసమే అనిపిస్తోందని కామెంట్స్ చేసింది. బ్రూనో హంతకుల‌ను ఉద్దేశిస్తూ.. "అది మీకేం అన్యాయం చేసింది.. అదేం పాపం చేసిందని దాన్ని అలా చంపారు? అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది ర‌ష్మి.