English | Telugu
తమ మధ్య విభేదాలు లేవని చెప్పడానికే విజయ్ అలా చేశాడా?
Updated : Sep 15, 2023
తమిళ్ హీరో విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్‌కు గుండె ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలిసి విదేశీ యాత్రలో ఉన్న విజయ్ ఆగమేఘాలమీద ఇండియా వచ్చి తండ్రిని కలుసుకున్నాడు. వాస్తవంగా తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోతే కొడుకు రావడంలో విశేషం ఏమీ ఉండదు. కాకపోతే ఈ తండ్రీ కొడుకుల మధ్య ఎంతోకాలంగా విభేదాలు ఉన్నాయి. దానికి కారణం విజయ్‌కు చెప్పకుండా అతని పేరు మీద ఓ రాజకీయ పార్టీ పెట్టారు చంద్రశేఖర్. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ అది తనకు సంబంధించింది కాదని చెప్పాడు విజయ్. ఇక అప్పటి నుంచి తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి.
ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రం చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా పూర్తి చేసుకొని విదేశాలకు వెకేషన్‌పై వెళ్ళాడు. అదే సమయంలో తండ్రికి ఆపరేషన్ జరిగిందని తెలుసుకొని తిరిగి వచ్చాడు. తండ్రితో కలిసి ఫోటో కూడా దిగాడు. అయితే తండ్రి ఆరోగ్యం బాగా లేదని వచ్చాడా? లేక వారిద్దరి మధ్య ఉన్న విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి వచ్చాడా అనేది తెలియరాలేదు.
ఇక విజయ్ కెరీర్ గురించి చెప్పాల్సి వస్తే ఇటీవల విజయ్‌కి హిట్ అనేది లేదు. గత చిత్రం వారసుడు డిజాస్టర్ అయింది. దాంతో తన ఆశలన్నీ లియోపైనే పెట్టుకున్నాడు విజయ్. అంతే కాకుండా ఈ సినిమా తర్వాత మరో సినిమా చేసి హీరోగా రిటైర్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. అందుకే చివరి సినిమాలు హిట్ సినిమాలు అయి ఉండాలని విజయ్ కోరుకుంటున్నాడట.