Read more!

English | Telugu

'ఆస్కార్' యాక్టర్స్.. టాప్ లో ఎన్టీఆర్!

95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' సాంగ్ కి అవార్డు గెలుచుకొని 'ఆర్ఆర్ఆర్' మూవీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ, ఇందులో హీరోలుగా నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రపంచస్థాయిలో మరో ఘనత కూడా సాధించడం విశేషం.

ఆస్కార్ వేడుక సందర్భంగా మీడియా, సోషల్ మీడియాలో అత్యధికంగా మెన్షన్ చేసిన టాప్-5 సినిమాల లిస్టులో 'ఆర్ఆర్ఆర్' చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ఇండియన్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' రెండో స్థానంలో నిలిచింది. ఉత్తమ చిత్రం సహా మొత్తం ఏడు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న 'ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్'ని సైతం వెనక్కి నెట్టి మొదటి రెండు స్థానాల్లో భారతీయ చిత్రాలు నిలవడం విశేషం.

ఇక యాక్టర్స్ విషయానికి వస్తే హాలీవుడ్ స్టార్స్ ని సైతం వెనక్కి నెట్టి జూనియర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో రామ్ చరణ్ నిలిచాడు. మొత్తానికి ఆస్కార్స్ సమయంలో మీడియా, సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ డామినేషన్ కనిపించింది.