English | Telugu
ఈ యేటి మేటి హిట్ ఏది??
Updated : Dec 27, 2014
సరిగ్గా కొత్త యేడాది గుమ్మం దగ్గర ఉన్నాం. మరి కొద్ది రోజుల్లో 2015లో హుషారుగా అడుగుపెట్టబోతున్నాం. అందరిలానే తెలుగు సినిమా పరిశ్రమ కూడా కోటి ఆశలతో 2015లోకి ఎంటర్ అవుతోంది. 2014లో పరిశ్రమ కొన్ని మధురమైన విజయాల్ని నమోదు చేసుకొంది. టాప్ హీరోలు ఫామ్‌లోకి వచ్చారు. చిన్న సినిమాలు కొన్ని బాగా ఆడాయి. కొత్త దర్శకులు అద్భుతాలు సృష్టించారు. అంచాలేం లేని సినిమాలు బాగా ఆడి ఆశ్చర్యపరిచాయి. మొత్తమ్మీద 2014 ఓ మిశ్రమ అనుభూతిని కలిగించింది. కొన్ని మధురమైన విజయాలు నమోదైన ఈ యేడాదిలో... మేటి చిత్రం ఏది?? ఏ సినిమా అటు ప్రేక్షకుల మదినీ, ఇటు బాక్సాఫీసునీ కొల్లగొట్టగలిగింది. నెంబర్ 1 స్థానం ఏ సినిమాకి ఇవ్వొచ్చు. తెలుగు వన్ చేస్తున్న ఓ చిన్న విశ్లేషణ ఇది..
దాదాపు 12 సినిమాలు ఈ యేడాది హిట్ అనే ముద్ర వేసుకొన్నాయి. ప్రతీ నెలా పరిశ్రమకు `హిట్` అనే మాట వినిపించింది. సంక్రాంతికి వచ్చిన ఎవడు రూ.40 కోట్ల క్లబ్‌లో చేరింది. మెగా ఫ్యాన్స్ ని అలరించిన ఈ సినిమాకి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. మార్చిలో నందమూరి బాలకృష్ణ హంగామా కనిపించింది. ఆయన లెజెండ్ అంటూ... ఉగ్రరూపం దాల్చారు. బాలయ్య డైలాగులు, బోయపాటి శైలిలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్ని ఊర్రూతలూగించాయి. దాంతో ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌కి అతి చేరువుగా వచ్చింది. రెండు థియేటర్లలో 275 రోజులు ప్రదర్శింపబడింది. ఏప్రిల్‌లో మరో మెగా హీరో బన్నీ హంగామా చేశాడు. మాస్, యాక్షన్ కలగలిపిన కథతో సినిమా చూపించేశాడు. ఈ సినిమా కూడా రూ.50 కోట్ల క్లబ్‌కి అతి చేరువుగా వచ్చింది. మేలో అక్కినేని కథానాయకుల మూడు తరాల కథ మనం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏఎన్నార్ చివరి సినిమా కావడంతో మనంపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. విక్రమ్ కె.కుమార్ ఈ కథని మలిచిన విధానం చూసి విమర్శకులు సైతం సంబర పడ్డారు. ఈ చిత్రం రూ.40 కోట్ల క్లబ్‌లో చేరి ఏఎన్నార్‌కి గ్రాండ్ గా వీడ్కోలు ఇచ్చింది.
జులైలో మరో అగ్ర హీరో వెంకటేష్ వెరైటీ కథతో అలరించాడు.. అదే దృశ్యం. తన కుటుంబం కోసం ఓ తండ్రి పడే ఆవేదన ఈ సినిమా. మలయాళంలో ఘన విజయం సాధించిన దృశ్యం... తెలుగులోనూ అదే స్థాయిలో ఆకట్టుకొంది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించడం ఈ సినిమాకి ప్లస్. అదే నెలలో శర్వానంద్ రన్ రాజా రన్ అంటూ మెప్పించాడు. శర్వా కెరీర్‌లో తొలి కమర్షియల్ హిట్ గా రన్ రాజా రన్ గుర్తింపు తెచ్చుకొంది.
ఆగస్టులో నెలలో గీతాంజలి హిట్ సాధించింది. హారర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమా లాభాల్ని మూటగట్టుకొంది. సెప్టెంబరులో పవర్, లౌక్యంలు హిట్ అందుకొన్నాయి. ఈ రెండు సినిమాలూ రూ.20 కోట్లకు పైనే వసూళ్లు సాధించాయి. గోపీచంద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్.. లౌక్యం.
అక్టోబర్‌లో వచ్చిన చిన్న సినిమా కార్తికేయ కూడా లాభాల బాట పట్టింది. అలా ... ఈ యేడాది ఈ సినిమాలన్నీ కలిసి హిట్లు అందించాయి.. బాక్సాపీసుని కళకళలాడించాయి.మేటి చిత్రం విషయానికొస్తే రేసుగుర్రం, లెజెండ్, మనం, దృశ్యం. పోటీ పడుతున్నాయి. వసూళ్ల పరంగా లెజెండ్ అందరినీ ఆకట్టుకొంది. బాలయ్య హిట్ కొట్టడం తప్పనిసరి అనుకొన్న పరిస్థితుల్లో అటు అభిమానుల్నీ, ఇటు చిత్రసీమనీ అలరించిన చిత్రమిది. అయితే.. మనం ఓ డిఫరెంట్ కాన్సెప్ట్. ఆకథ, కథని నడిపించిన పద్ధతి, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన తీరు.. అందరికీ బాగా నచ్చింది. రేసుగుర్రం, లెజెండ్ పూర్తిగా కమర్షియల్ చిత్రాలు. అయితే కొత్త దారిలో నడిచి హిట్ కొట్టొచ్చు అని నిరూపించిన సినిమా మాత్రం ఖచ్చితంగా మనం చిత్రమే. కాబట్టి ఈయేడాది మేటి చిత్రం... మనం. కొత్త యేడాది మనం లాంటి చిత్రాలు మరిన్ని రావాలని, బాక్సాఫీసు నిత్య కల్యాణం పచ్చతోరణంలా కళకళలాడిపోవాలని కోరుకొందాం.