English | Telugu

టైగర్‌ నాగేశ్వరరావు.. ఈ ఏడాది అన్నింటికంటే పెద్ద సినిమా ఇదే!

రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ఈ ఏడాది విడుదలైన సినిమాల్లోకెల్లా పెద్ద సినిమా అనిపించుకుంది. అదేమిటి.. దీనికంటే పెద్ద సినిమాలు చాలా రిలీజ్‌ అయ్యాయి కదా.. అనుకోవచ్చు. కానీ, దానికి ఓ కారణం ఉంది.

‘టైగర్‌ నాగేశ్వరరావు’ అక్టోబర్‌ 20న దసరా కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రేణు దేశాయ్‌ ఒక ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే. నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్‌ అవుతోంది. రవితేజ కెరీర్‌లో ఇదే పాన్‌ ఇండియా సినిమా కావడం విశేషం. మరి ఈ సినిమా పెద్ద సినిమా ఎలా అయ్యిందంటే.. నిడివి పరంగా. మూడు గంటల రెండు నిమిషాల నిడివితో ఈ సంవత్సరం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ రికార్డు సృష్టించింది. ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. కథ పరంగా ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు చాలా ఉన్నాయని, వాటిని తగ్గించాలని సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు దర్శకనిర్మాతలకు సూచించారని తెలుస్తోంది.
సెన్సార్‌ సభ్యులు దర్శకనిర్మాతలకు ఇచ్చిన సూచనలు ఏమిటో చూద్దాం.. హీరో రవితేజ విలన్స్‌ని ముక్కలు ముక్కలుగా చేస్తాడట. అవి తగ్గించడమే కాకుండా కేవలం హీరో మొహం మాత్రమే చూపించాలి. ఓ చిన్న కుర్రాడు తండ్రి తల నరికి చేత్తో పట్టుకోవడం లాంటి సన్నివేశాలు ఉన్నాయట. వాటిలో ఇబ్బందిగా ఉన్నవాటిని బ్లర్‌ చెయ్యమని చెప్పారు. సెన్సార్‌ సభ్యుల సూచనలు చూస్తుంటే సినిమాలో అవసరాన్ని మించి హింస ఉంటుందని అర్థమవుతోంది. మరి ఇలాంటి సీన్స్‌ని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.