English | Telugu

సినిమాలకు గుడ్ బై చెప్తున్న స్టార్ హీరో!

మన దేశంలో సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎందరో సినీ స్టార్స్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. అందులో ముఖ్యమంత్రి అయినవాళ్లు కూడా ఉన్నారు. అలాగే కొందరు రాజకీయ వారసులు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సినిమా వాళ్ళకి రాజకీయాలు, రాజకీయాలకు సినీ గ్లామర్ అనేది ఎప్పటినుంచో నడుస్తున్న ట్రెండ్. ఇప్పుడు మరో సినీ స్టార్ రాజకీయాల్లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఆయనెవరో కాదు.. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్.

కోలీవుడ్ లో టాప్ స్టార్స్ లో విజయ్ ఒకరు. రీజినల్ సినిమాతోనే రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టగల సత్తా ఆయనది. తమిళనాడులో ఆయనకు తిరుగులేని క్రేజ్ ఉంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎట్టకేలకు ఆయన ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చేసింది. తాజాగా తన అభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన విజయ్, తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చేశారు. రాజకీయ ప్రవేశానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే ఎంట్రీ ఉంటుందని తెలిపారట. అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చాక, సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారట. 2024 లో లోక్ సభ ఎన్నికలు ఉండగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 లో జరగనున్నాయి. వచ్చే ఏడాది పార్టీని ప్రకటించి, అసెంబ్లీ ఎన్నికల సమయానికి ప్రజల్లోకి బలంగా వెళ్లేలా విజయ్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న 'లియో' సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు విజయ్. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఆయన పూర్తిగా రాజకీయాలతో బిజీ అయ్యే అవకాశముంది.

సినిమాల్లో కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే స్టార్స్ అరుదుగా ఉంటారు. తెలుగునాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా చేశారు. అయితే ఆయన రాజకీయాల్లో ఉంటూనే, సినిమాల్లో కూడా నటిస్తున్నారు. కానీ విజయ్ మాత్రం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, ఫుల్ టైం రాజకీయాలు అంటున్నారు. మరి విజయ్ భవిష్యత్ లో తన నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ సినిమాల్లో కనిపిస్తారో లేక గుడ్ బై మాటకు కట్టుబడి ఉంటారో చూడాలి.