English | Telugu
‘రూల్స్ రంజన్’.. మళ్లీ డేట్ మార్పు
Updated : Sep 12, 2023
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’. డీజే టిల్లుతో అందరి మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న బ్యూటీ డాల్ నేహా శెట్టి ఇందులో హీరోయిన్‌గా మెప్పించనుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాను ముందుగా సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కాస్త సమయం పట్టేలా ఉండటంతో డైరెక్టర్ రత్నం కృష్ణ రిక్వెస్ట్ మేరకు మేకర్స్ ‘రూల్స్ రంజన్’ను అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డేట్ మారొచ్చు కానీ ఎంటర్‌టైన్‌మెంట్ డోసు మాత్రం మారదని మేకర్స్ ఘంటా పథంగా చెబుతున్నారు.
సినిమా ఎంటర్‌టైనింగ్ అంశాలతో పక్కాగా నవ్వించేలా ఉంటుందని రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ముంబై వంటి అర్బన్ ఏరియాతో పాటు విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే అమ్రిష్ గణేష్ సంగీత సారథ్యంలో విడుదలైన 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా', 'ఎందుకురా బాబు' పాటలు ఒక దానికి మించి ఒకటి అన్నట్లుగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మూవీ కోసం జ్యోతి కృష్ణ తన పేరుని రత్నం కృష్ణగా మార్చుకున్నారు మరి. ఆక్సిజన్ సినిమా తర్వాత ఈయన తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. కిరణ్ అబ్బవరం ఈ మూవీపై మంచి హోప్స్ పెట్టుకున్నారు.
ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 6న రాబోతున్న మన ‘రూల్స్ రంజన్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో తెలియాలంటే వేచి చూడక తప్పదు మరి.